రామోజీరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో విశాఖ ‘ఈనాడు’ స్థలం యజమాని వర్మ అనుబంధ పిటిషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో విశాఖ ‘ఈనాడు’ స్థలం యజమాని వర్మ అనుబంధ పిటిషన్

రామోజీరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో విశాఖ ‘ఈనాడు’ స్థలం యజమాని వర్మ అనుబంధ పిటిషన్

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

వాస్తవాలను కోర్టుకు చెప్పలేదు.. ఆయన చేసిన మోసాల గురించి ప్రస్తావించలేదు
రామోజీకి అప్పటి కలెక్టర్లు ఎస్వీ ప్రసాద్, కె.వి.రావు సహకరించారు
రామోజీకి ప్రభుత్వ స్థలమివ్వడం నిబంధనలకు విరుద్ధమని తహసీల్దార్ చెప్పినా, ఎస్వీ ప్రసాద్ ఇచ్చారు
నిర్వహణ కోసం ప్రభుత్వం స్థలం ఇచ్చింది.. రామోజీ దానిని సొంతదిగా చెప్పుకుంటున్నారు
ఇందుకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారు.. సంతకాలను ఫోర్జరీ చేశారు
వీటన్నింటినీ చెప్పకుండా హైకోర్టును తప్పుదోవ పట్టించారు.. అందుకే హైకోర్టు స్టే ఇచ్చింది
వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని స్టే ఉత్తర్వులను ఎత్తివేయండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈనాడు గ్రూపు సంస్థల యజమాని రామోజీరావు కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని విశాఖపట్నం ఈనాడు కార్యాలయం ఉన్న స్థలం యజమాని మంతెన ఆదిత్య ఈశ్వరకుమార కృష్ణవర్మ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ వేశారు. విశాఖ సీతమ్మధారలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలం లీజు గడువు ముగిసినా తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్న రామోజీరావుపై వర్మ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎస్వీ ప్రసాద్, కె.వి.రావులు విశాఖపట్నం కలెక్టర్లుగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ స్థలాన్ని రామోజీకి కట్టబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. రామోజీ తనను మాత్రమే కాక, వాస్తవాలను చెప్పకుండా కోర్టును మోసం చేస్తున్నారని హైకోర్టుకు నివేదించారు. తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించి ఏసీబీ దర్యాప్తుపై పొందిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని అనుబంధ పిటిషన్‌లో కోరారు. రామోజీ ఎలా మోసం చేసిందీ కోర్టుకు వివరించలేదని, ఆయనపై సానుభూతి వచ్చేలా, ఆయనకు అనుకూలంగా ఉన్న కొన్ని అంశాలను మాత్రమే తెలిపారని వర్మ వివరించారు. పిటిషన్‌లో కోర్టుకు వివరించిన అంశాలివీ..

‘‘విశాఖపట్నం, సీతమ్మధార సర్వే నంబర్ 50/4లో నాకు చెందిన 2.70 ఎకరాల భూమిని 33 సంవత్సరాల లీజు ఒప్పందంతో ఉషోదయ పబ్లికేషన్స్ పేరు మీద 1974 మార్చి 30న రామోజీ తీసుకున్నారు. ఆ తరువాత నాకు ఎలాంటి ముందస్తు సమాచారమివ్వకుండానే, నా వద్ద లీజుకు తీసుకున్న స్థలం నుంచి 517 చదరపు మీటర్లను రోడ్డు వెడల్పు నిమిత్తం ప్రభుత్వానికి రామోజీ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా రేసపువానిపాలెం సర్వే నెంబర్ 52లోని 872 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని రామోజీ 1985 జనవరి 17న అప్పటి విశాఖ కలెక్టర్ ఎస్వీ ప్రసాద్‌ను కోరారు. రామోజీ అభ్యర్థనపై ఎస్వీ ప్రసాద్ స్పందించారు. రామోజీ లేఖ ఆధారంగా భూమి స్వాధీనానికి ప్రతిపాదనలు, స్కెచ్‌లను సిద్ధం చేయాలని అదే ఏడాది ఫిబ్రవరి 21న ఎస్.వి ప్రసాద్ అప్పటి తహసీల్దార్ వి.సత్యనారాయణమూర్తిని రాతపూర్వకంగా ఆదేశించారు. ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన తహసీల్దార్ అదే ఏడాది ఏప్రిల్ 6న కలెక్టర్ ప్రసాద్‌కు ఓ నివేదిక ఇచ్చారు. ఈనాడు యాజమాన్యం కోరుతున్న భూమిలో కొంత ఖాళీ స్థలం పురపాలకశాఖకు చెందినదని, మిగిలినది నాదని అందులో స్పష్టంగా చెప్పారు. 

అంతేకాక.. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తికి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని స్పష్టం చేశారు. ఆ భూమిని రామోజీకి అప్పగించేందుకు కలెక్టర్ కార్యాలయానికి ఎటువంటి అధికారం లేదని, సర్వే నంబర్ 52లోని 872 చదరపు మీటర్ల భూమి కావాలంటే, ఈనాడు యాజమాన్యం పురపాలక శాఖను సంప్రదించాలని కూడా తహసీల్దార్ స్పష్టం చేశారు. అయితే, తహసీల్దార్ నివేదికను ఎస్.వి.ప్రసాద్ పట్టించుకోలేదు. రామోజీ కోరిన భూమిని అప్పగిస్తూ కలెక్టరే ఆదేశాలు జారీ చేశారు. రామోజీ కోరిన భూమి అప్పటికే ఈనాడు కార్యాలయం స్వాధీనంలో ఉన్నందున, ఆ భూమి నిర్వహణ, పరిరక్షణ కోసం ‘ఈనాడు’కు స్వాధీనం చేయాలని, ఈ ప్రక్రియ వెంటనే పూర్తవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ ఎస్.వి.ప్రసాద్ అదే ఏడాది ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్ తరువాత కలెక్టర్‌గా వచ్చిన కె.వి రావు వద్దకు ఈ వ్యవహారం చేరింది. తాము ఇచ్చిన స్థలానికి చదరపు గజానికి మార్కెట్ ధర రూ.300 చొప్పున చెల్లించాలని ఈనాడు డెరైక్టర్‌ను 1986 అక్టోబర్ 25న కె.వి.రావు ఆదేశించారు. అయితే, చదరపు గజానికి రూ.200 మాత్రమే చెల్లించేందుకు రామోజీ, ఆయన కుమారుడు సిద్ధపడ్డారు. అందుకు కలెక్టర్ హోదాలో కె.వి.రావు సైతం ఒప్పుకున్నారు. ఆ తరువాత ఈ వ్యవహారం కోర్టుకు చేరినప్పుడు కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులంటూ కొన్ని డాక్యుమెంట్లను రామోజీ కోర్టుకు సమర్పించారు. రామోజీ సమర్పించిన కలెక్టర్ ఉత్తర్వుల్లో ‘నిర్వహణ, పరిరక్షణ కోసం’ అనే పదాలు ఎగిరిపోయాయి. 

అంటే స్థలం తమదేనని చెప్పుకునేందుకు రామోజీ, ఆయన కుమారుడు ఈ తప్పుడు డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇలాగే కొన్ని రికార్డులను తారుమారు చేశారు. పురపాలక శాఖ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తికి కేటాయించడం అధికార దుర్వినియోగమే. ఎస్వీ ప్రసాద్, కె.వి.రావు పూర్తిస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అందుకే వారిపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశాను. ప్రభుత్వ అధికారుల హోదాలో ఫోర్జరీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే విషయంలో స్పష్టమైన ఆరోపణలు ఉన్నందున, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోర్టు ఏసీబీ అధికారులను ఆదేశించింది. 

ఈ ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి రామోజీ, ఆయన కుమారుడు కిరణ్, అప్పటి కలెక్టర్లు ఎస్వీ ప్రసాద్, కె.వి.రావులపై కేసు నమోదు చేశారు. దీంతో రామోజీ, ఆయన కుమారుడు హైకోర్టును ఆశ్రయించి, ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై స్టే ఉత్తర్వులు పొందారు. రామోజీ, కిరణ్‌లు వారు చేసిన మోసాల గురించి కనీస స్థాయిలో కూడా హైకోర్టుకు నివేదించలేదు. ప్రభుత్వ స్థలాన్ని ఎలా పొందిందీ.., ప్రభుత్వాధికారుల హోదాలో ఎస్వీ ప్రసాద్, కె.వి.రావు ఏ విధంగా సహకరించిందీ కోర్టుకు చెప్పలేదు. వారికి నోటీసు ఇవ్వకుండానే ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని మాత్రమే కోర్టుకు చెప్పారు. ఈ ఒక్క కారణంతోనే ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. వాస్తవాలను చెప్పి ఉంటే, కోర్టు జోక్యం చేసుకుని ఉండేది కాదు. అంతేకాక, వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ కలిపేసి, కోర్టును గందరగోళానికి గురి చేశారు. అనుకూల ఉత్తర్వులు పొందగలిగారు’’ అని వర్మ అనుబంధ పిటిషన్‌లో వివరించారు. ఈ కేసులో వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, స్టే ఉత్తర్వులు ఎత్తివేసి, ఏసీబీ దర్యాప్తు కొనసాగేలా చూడాలని అభ్యర్థ్ధించారు.
Share this article :

0 comments: