రక్షణ స్టీల్స్ అనిల్, బ్రదర్ అనిల్ వేర్వేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రక్షణ స్టీల్స్ అనిల్, బ్రదర్ అనిల్ వేర్వేరు

రక్షణ స్టీల్స్ అనిల్, బ్రదర్ అనిల్ వేర్వేరు

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012



* వైఎస్ కుటుంబాన్ని కావాలనే రచ్చకీడుస్తున్నారు
* బయ్యారం గనులతో షర్మిల భర్తకు ఎలాంటి సంబంధంలేదు
* రక్షణ స్టీల్స్ అనిల్, బ్రదర్ అనిల్ వేర్వేరు
* అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా
* రక్షణ స్టీల్స్-ఏపీఎండీసీకి మధ్య జరిగింది కేవలం సర్వే ఒప్పందమే..అయితే ఇనుము తవ్వినట్లు, ఎగుమతులు జరిగినట్లు అసత్య ప్రచారం

హైదరాబాద్, న్యూస్‌లైన్ : నా తండ్రిని ఏం చేశారు? నా అన్నను ఎందుకు జైలుకు పంపారు? అని ఉప ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం రక్షణ స్టీల్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి... దానిని షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఆపాదించాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... షర్మిల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం, ప్రతిపక్షం, ఈనాడు, ఎల్లోమీడియా వైఎస్ కుటుంబీకులను రచ్చకీడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందులో భాగంగానే పోలింగ్‌కు ఒక్క రోజు ముందుగా రక్షణ స్టీల్స్ ఒప్పందం రద్దు అనే పేరుతో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ ఓ వింత నాటకానికి తెర లేపాయని ఎద్దేవా చేశారు.

ఈ రెండు పార్టీలకూ దమ్ముంటే ప్రజా క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలి గానీ ఇలాంటి ఎత్తుగడలకు పూనుకోరాదని విమర్శించారు. రక్షణ స్టీల్స్ యాజమాన్యంలో ఉన్న టి.అనిల్, షర్మిల భర్త అనిల్ వేర్వేరని జూపూడి స్పష్టంచేశారు. రక్షణ స్టీల్స్ అనిల్... బ్రదర్ అనిల్‌కుమారేనని నిరూపించగలరా? అని సవాలు విసిరారు. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై బ్రదర్ అనిల్‌కుమార్ పరువు నష్టం దావా వేస్తున్నారని చెప్పారు. గతంలో ఇదే విషయమై శాసనమండలిలో చర్చ జరిగినప్పుడూ తాను అనిల్‌కు సంబంధం లేదనే విషయం చెప్పానని జూపూడి తెలిపారు.

అసలక్కడ జరిగింది సర్వే ఒప్పందమే
బయ్యారం గనుల విషయంలో రక్షణ స్టీల్స్-ఏపీఎండీసీకి మధ్య జరిగింది కేవలం సర్వే ఒప్పందమేననీ జూపూడి స్పష్టంచేశారు. ఈ 1.4 లక్షల ఎకరాల్లో ఏదో ఒక చోట 5 లేదా 6 వేల ఎకరాల్లో ఖనిజం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే సర్వేకు ఇచ్చిన భూమి అంతటా ఇనుము దొరికిందనీ, అక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయనీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య కూడా బయ్యారం గనుల సర్వే కోసం ఏపీఎండీసీ, రక్షణ స్టీల్స్ మధ్య జరిగిన ఒప్పందమేనని అంగీకరిస్తూ దీనిని రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారనీ గుర్తు చేశారు.

వాస్తవాలిలా ఉండగా... 1.4 లక్షల ఎకరాల్లో నుంచి రూ.14 లక్షల కోట్ల విలువైన ఇనుప ఖనిజం దోచేసినట్లుగా... అదంతా వైఎస్ కుటుంబీకులకు ఆపాదిస్తూ టీడీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధాలని కొట్టిపారేశారు. ‘‘అసలు రూ.14 లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసా? తెలిసే మాట్లాడుతున్నారా...! రిలయన్స్ ఇండియా లిమిటెడ్ ఆస్తుల విలువ రూ. 2.75 లక్షల కోట్లు, పేరుమోసిన ఓఎన్‌జీసీ సంస్థ ఆస్తుల విలువ రూ. 2.2 లక్షల కోట్లు, వందకుపైగా అత్యుత్తమమైన గనులున్న ఎన్‌ఎండీసీ ఆస్తులు 60 వేల కోట్లు, టాటా, టీసీఎస్ సంస్థ ఆస్తులన్నీ కలిపితే 2.14 లక్షల కోట్లు, విప్రో సంస్థ విలువ 1.4 లక్షల కోట్ల రూపాయలు... దేశంలోని పేరుమోసిన ఇలాంటి సంస్థల ఆస్తులన్నింటినీ కలిపితే గానీ 14 లక్షల కోట్ల రూపాయలుండవు. అలాంటిది ఒక్క బోడి బయ్యారంలో... పెద్దగా ఇనుప ఖనిజం కూడా లేని ప్రదేశంలో రూ.14 లక్షల కోట్ల ఆదాయం వస్తుందా? ఎందుకీ అర్థం లేని ఆరోపణలు!’’ అని ధ్వజమెత్తారు.

చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా అనంతపురం జిల్లాలో 4 లక్షల ఎకరాలు వజ్రాల సర్వే కోసం ఒక సంస్థతో ఒప్పందం చేయించారనీ... అంటే సర్వేకు ఇచ్చిన ప్రాంతమంతా వజ్రాలున్నట్లూ లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లూ అనుకోవాలా అని జూపూడి ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత భద్రతపై పోలీసులు ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం దారుణమని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా ఎదిగిన జగన్‌ను ఏ మాత్రం భద్రత లేని ఒక వ్యాన్‌లో కోర్టుకు తరలించడం దారుణమని ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: