హోరాహోరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోరాహోరీ

హోరాహోరీ

Written By news on Friday, June 8, 2012 | 6/08/2012

 ఉపఎన్నిక ప్రచారంతో పరకాల యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. మూడు రోజులే ప్రచార గడువు ఉండడంతో ప్రధాన పార్టీ నేతల్లో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు అధినేతల సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ గెలుపు కోసం ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ, వైఎస్ కుమార్తె షర్మిల శుక్రవారం గీసుకొండ, పరకాలలో రోడ్‌షో, ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి తరఫున మరోసారి ప్రచారం నిర్వహించేందుకు ఈనెల 9న కేసీఆర్ పరకాలకు వస్తున్నారు. పాలమూరు స్ఫూర్తితో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ అభ్యర్థి డాక్టర్ విజయచందర్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేయడానికి ఆ పార్టీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్‌ను రప్పిస్తున్నారు. ఈనెల 9న హన్మకొండ బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సమ్మారావుకు మద్దతుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రచారం చేపట్టారు. ఈ రెండు పార్టీలు మరోమారు ముఖ్య నేతలను ప్రచారానికి రప్పించేందుకు యత్నాలు సాగిస్తున్నాయి. బలాబలాలు..

పరకాల నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1.87లక్షలు. ఇందులో మహిళా ఓటర్లు 93,800లకు పైగా ఉన్నారు. మొత్తం ఓట్లలో 1.35లక్షల నుంచి 1.45లక్షల వరకు ఓట్లు పోల్ కాగలవని పార్టీలు అంచనా వేస్తున్నాయి. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పరకాలలో కాంగ్రెస్, మహాకూటమి, బీజేపీ బరిలో నిలిచాయి. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కొండా సురేఖకు 69వేలకుపైగా ఓట్లు రావడంతో విజయం సాధించారు. శాయంపేట, పరకాల కలుపుకొని వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన కొండా సురేఖ విజయం నల్లేరుపై నడకేనని చెబుతున్నారు. మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసిన మొలుగూరు భిక్షపతి 56వేలకుపైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ సీపీఐతోపాటు జాక్ మద్దతు ఇవ్వడం వల్ల భిక్షపతి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీకి గతంలో ఇక్కడ 4వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే, పాలమూరు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న బీజేపీ ఇక్కడ సైతం గెలుపు కోసం ఆరాటపడుతోంది. డాక్టర్ల జాక్‌లో కీలకంగా వ్యవహరించిన విజయచందర్‌రెడ్డిని బీజేపీ బరిలోకి దించడంతోపాటు ఆ మేరకు జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహిస్తోంది. 

దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ.. 

పరకాల ప్రచారంలో వైఎస్సార్ సీపీ ముందంజలో ఉంది. అభ్యర్థి కొండా సురేఖ మిగతా పార్టీలకు దీటుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. గురువారం సంగెం మండలంలో ప్రచారం చేశారు. ఇదే మండలంలో ఆ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్దన్, గట్టు రాంచందర్‌రావు, జనక్‌ప్రసాద్, పరకాలలో ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్, పుట్ట మధు, విజయ్‌కుమార్, గీసుకొండ మండలంలో ఆది శ్రీనివాస్, రఘుపతిరావు, సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఆత్మకూరులో నిరంజన్‌రెడ్డి సురేఖకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

టీఆర్‌ఎస్ విస్తృత ప్రచారం..

పరకాలలో గెలుపుకోసం టీఆర్‌ఎస్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సంగెం మండలంలో అభ్యర్థి భిక్షపతితోపాటు ఎంపీ విజయశాంతి ప్రచారం నిర్వహించారు. మహారాజ్‌తండాలో హరీష్‌రావు రాత్రి నిద్ర చేశారు. ఆత్మకూరులో ఎర్రోళ్ల శ్రీనివాస్, గీసుకొండలో విజయశాంతి, తుల ఉమ రోడ్‌షో నిర్వహించారు. పరకాలలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంటింటి ప్రచారం చేశారు. 

వంద రోజుల్లో తెలంగాణ నినాదంతో బీజేపీ

కేంద్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో తెలంగాణ వస్తుందనే నినాదంతో బీజేపీ గ్రామాల్లో ప్రచారం చేస్తోంది. నర్సక్కపల్లి, నడికుడ, ముస్త్యాలపల్లి, చౌటుపల్లి, చర్లపల్లిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. అభ్యర్థి విజయచందర్‌రెడ్డి మొగిలిచర్ల, కీర్తినగర్, ఊకల్, గొర్రెకుంట, జాన్‌పాక గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. 

టీడీపీ కోసం ఎర్రబెల్లి..

టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి చింతలపల్లి, ఎల్గూరు రంగంపేట, మొండ్రాయి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు మండలంలో మాజీ మంత్రి ఎ.ఉమామాధవరెడ్డి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి టీడీపీ తరఫున ప్రచారం చేశారు. 
కాంగ్రెస్ అభివృద్ధి జపం

అభివృద్ధి జపంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అభ్యర్థి సాంబారి సమ్మారావు ఇంటింటి ప్రచారంలో తలమునకలై ఉన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రచారంలో పాల్గొన్నారు. పరకాల మండలంలో కరీంనగర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహించారు.
Share this article :

0 comments: