సెజ్ కాదు.. ఫుడ్‌పార్క్. లక్కంపల్లి భూములపై ‘ఈనాడు’ తప్పుడు కథనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సెజ్ కాదు.. ఫుడ్‌పార్క్. లక్కంపల్లి భూములపై ‘ఈనాడు’ తప్పుడు కథనం

సెజ్ కాదు.. ఫుడ్‌పార్క్. లక్కంపల్లి భూములపై ‘ఈనాడు’ తప్పుడు కథనం

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

కేటాయించింది 429 కాదు.. 371 ఎకరాలే 
స్మార్ట్ ఆగ్రో కంపెనీ ప్రతినిధి ఎం.వెంకట్‌రాంరెడ్డి

నిజామాబాద్,న్యూస్‌లైన్: జిల్లాలోని నందిపేట మండలం లక్కంపల్లి వద్ద ఇండస్ట్రియల్ ఫుడ్‌పార్క్‌లో తమకు కేటాయించిన భూములపై ఈనెల 9న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘కాకుల్ని కొట్టి గద్దలకా పెద్దాయనా!’కథనం పూర్తిగా వాస్తవవిరుద్ధమని స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కంపెనీ ప్రతినిధి ఎం.వెంకట్‌రాంరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘ఈనాడు’ కథనంలో పేరొన్నట్లు లక్కంపల్లి వద్ద ఏర్పాటు చేయనున్నది సెజ్ కాదని, కేవలం ఫుడ్‌పార్క్ మాత్రమేనని ఆయన వివరించారు. మారుమూలప్రాంతమైన లక్కంపల్లిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కొంత సమయం పడుతుందని, అందుకే కాస్త ఆలస్యమవుతుందని చెప్పారు. తమ కంపెనీకి ప్రభుత్వం 371 ఎకరాలు కేటాయిస్తే, 429 ఎకరాలు ధారాదత్తం చేశారని తప్పుడు రాతలు రాశారని తెలిపారు. 

ఈ భూమిని ఏపీఐఐసీ తమకు రిజిస్ట్రేషన్ చేసింది 2010 ఫిబ్రవరి 26న కాగా, అంతకు ముందే భూమి ధరను చెల్లించామని చెప్పారు. తమకు కేటాయించిన దాంట్లో రైతుల భూముల కంటే ప్రభుత్వ భూమే ఎక్కువగా ఉంద ని, ఎక్కువగా బీడు భూములే ఉన్నాయని వివరించారు. తాము ఈ భూములకు చెల్లించిన ధర మార్కెట్ రేటు కంటే ఎక్కువగానే ఉందని, పైగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారమే ఏపీఐఐసీకి డబ్బులు చెల్లించామని చెప్పారు. సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ. 1.82 లక్షల చొప్పున 121 ఎకరాలు, సాగులో లేని వాటికి ఎకరానికి రూ. 1.60 లక్షల చొప్పున 246 ఎకరాలకు, మిగిలిన భూమికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం డబ్బులు చెల్లించామన్నారు. ఈ భూమిలో సుమారు 45 ఎకరాలు రాళ్లు రప్పలతో ఉన్న గుట్టలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ఫుడ్‌పార్క్ ఏర్పాటుతో జిల్లాలోని రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడమేగాక, ఏడువేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

కేంద్ర మంత్రికి సీఎం కిరణ్ లేఖ

మెగాఫుడ్ పార్క్‌కు కేంద్ర అనుమతి కోసం తమ సంస్థ రెండేళ్లుగా ప్రయత్నాలు కొనసాగిస్తోందని వెంకట్‌రాంరెడ్డి చెప్పారు.ఈమేరకు కేంద్ర వ్యవసాయశాఖకు ప్రాజెక్టు రిపోర్టును సమర్పించామన్నారు. కేంద్రం త్వరలో మంజూరు చేయనున్న ఫుడ్‌పార్క్ తమ కంపెనీకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఫుడ్‌పార్క్‌ను మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా 2011 నవంబర్‌లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌కు లేఖ రాశారని తెలిపారు. ఫిబ్రవరి 13న అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ కూడా తన ప్రసంగంలో ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో మొట్టమొదటి, రాష్ట్రంలో రెండో ఫుడ్‌పార్క్ లక్కంపల్లిలో ఏర్పాటుకానుందని తెలిపారు. రూ.250 కోట్ల పెట్టుబడితో కూడిన ఈ పార్కులో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ యూనిట్లను స్థాపించేందుకు ముందుకొచ్చాయన్నారు.
Share this article :

0 comments: