బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ దావా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ దావా

బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ దావా

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

* విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యానిస్తున్నారు
* శిక్షల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
* బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): న్యాయ విచారణను ప్రభావితం చేసేలా... కేసు గురించి, శిక్షల గురించి ముందే మాట్లాడుతున్నందుకు.., విచారణకు హాజరయ్యేటప్పుడు తాము చేయి ఊపినా, నవ్వినా కూడా తప్పుబడుతూ వ్యాఖ్యానిస్తున్నందుకు తక్షణం క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ఆడిటర్ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో క్రిమినల్ దావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఇద్దరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డి, బాబూ రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలకు కూడా సాయిరెడ్డి నోటీసులు పంపించారు. 

‘‘మన న్యాయ వ్యవస్థలో కోర్టు ద్వారా నేరం రుజువయ్యేవరకూ ఎవ్వరైనా నిర్దోషే. అప్పటిదాకా వారి దోషిత్వం గురించి 
వ్యాఖ్యలు చేయటం ఏమాత్రం తగదు. కానీ, ఈ న్యాయ ప్రక్రియలో ఏం జరుగుతుందో మీకు ముందే తెలిసినట్లుగా కేసులో జీవిత ఖైదు పడుతుందని, అన్నేళ్లు శిక్ష పడుతుందని మీరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది తీవ్రమైన బాధ్యతారాహిత్యం. మీకున్న అధికార పదవుల్ని దుర్వినియోగం చేయటమే. దీనికి తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా కొన్ని కంపెనీలు, వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారని, అందుకే ఆ సంస్థలు, వ్యక్తులు జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ ఆరోపణల్ని మేం మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. కోర్టులో పోరాడుతున్నాం. కానీ మీరు న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారు. ఇది సరికాదు’’ అని సాయిరెడ్డి తన నోటీసుల్లో పేర్కొన్నారు. 

కోర్టుకు హాజరయ్యేటప్పుడు తాను చేయి ఊపటం, నమస్కారం పెట్టడం వంటివి చేయటాన్ని కూడా వీరు తప్పుబడుతున్నారని సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇది న్యాయ వ్యవస్థపై మాకున్న నమ్మకాన్ని, ప్రజలపై మాకున్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. మేం ఎలాంటి తప్పూ చేయలేదని, కోర్టుల్లో అదే తేలుతుందని భావిస్తున్నాం. అందుకే.. ఆ నమ్మకంతోనే అలాంటి సంజ్ఞలు చేస్తున్నాం. అది కూడా తప్పన్నట్లు మాట్లాడటం నేరం’’ అని అన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేకే రాజకీయ దురుద్దేశాలతో మీడియా ముందు ఇలాంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారని, బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Share this article :

0 comments: