సాయంత్రానికి ప్రచారం బంద్: సీఈవో భన్వర్‌లాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయంత్రానికి ప్రచారం బంద్: సీఈవో భన్వర్‌లాల్

సాయంత్రానికి ప్రచారం బంద్: సీఈవో భన్వర్‌లాల్

Written By news on Friday, June 8, 2012 | 6/08/2012



ఆ తర్వాత ప్రచారం నిబంధనల ఉల్లంఘనే
బల్క్ ఎస్సెమ్మెస్‌లు కూడా పంపకూడదు
ఓటరు స్లిప్పులు అందనివారు పోలింగ్ రోజు కూడా తీసుకోవచ్చు
పోలింగ్ రోజున నమూనా బ్యాలెట్‌లతో ప్రచారం చేయరాదు
విస్తృతంగా ద్విచక్ర వాహనాల తనిఖీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికలకు సంబంధించి ఈనెల 10వతేదీ సాయంత్రం ఐదు గంటల తరువాత ఎలాంటి ప్రచారం చేసినా అది ఎన్నికల నిబంధన ఉల్లంఘనే అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. బల్క్ ఎస్సెమ్మెస్‌లు, టీవీల్లో చర్చలు కూడా నిషేధం అని చెప్పారు. పోలింగ్ రోజున పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు నమూనా బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడానికి వీల్లేదని తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాజకీయ పార్టీల నుంచి ఓటర్లకు ఎస్సెమ్మెస్‌లు వస్తే విచారణ జరిపిస్తామని, ఒకవేళ పార్టీ నుంచి వచ్చినట్లు తేలితే అందుకయ్యే ఖర్చును అభ్యర్థుల ఖాతాలో వేస్తామని వెల్లడించారు. నేర ప్రవృత్తితో పంపించే ఎస్సెమ్మెస్‌లకు సంబంధించి పోలీసులు ఎలాగూ కేసులు నమోదు చేస్తారన్నారు. పోలింగ్ రోజున కేవలం పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఓటర్లు, ఓటర్ల క్యూలను మాత్రమే చూపించాలని ఈ సందర్భంగా మీడియాకు సూచించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎవరికైనా ఓటరు స్లిప్పులు అందని పక్షంలో.. పోలింగ్ రోజున బూత్ లెవల్ అధికారి(బీఎల్‌ఓ)ని అడిగి తీసుకోవచ్చని చెప్పారు. ఎన్నికల అధికారులిచ్చిన ఫోటోతో కూడిన స్లిప్పులు చూపిస్తేనే ఓటు వేయడానికి అర్హులని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి దగ్గర్లో ఎలాంటి టెంట్లు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 16 కంటే ఎక్కువగా ఉన్నందున, బ్యాలెట్ యూనిట్లు అదనంగా 600 కావాల్సి ఉందని, వాటిని ఇప్పటికే సర్దుబాటు చేసినట్లు ఆయన చెప్పారు.

రూ. 46 కోట్లు సీజ్: ఉపఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు రూ.35.47 కోట్ల నగదు, రూ.10.77 కోట్ల విలువైన బంగారు, వెండి ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్‌లాల్ చెప్పారు. ఇవి కాకుండా దాదాపు 1.82 లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యధికంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 7.17 కిలోల బంగారం, నర్సాపురం/పోలవరంలలో 3.98 కిలోలు, రాయదుర్గం/అనంతపురంలలో 15.72 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతపురం, కడప జిల్లాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల నియోజకవర్గాల్లోనే దాదాపు రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి..

ఉప ఎన్నికలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని 8897000401 - 405 నంబర్లకు ఎవరైనా సమాచారం పంపించవచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, వారి పేర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోమని ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: