జగన్‌ను జైలులో పెట్టినా ఎమ్మెల్యేలు వలసలకు సిద్ధపడుతుండటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను జైలులో పెట్టినా ఎమ్మెల్యేలు వలసలకు సిద్ధపడుతుండటం

జగన్‌ను జైలులో పెట్టినా ఎమ్మెల్యేలు వలసలకు సిద్ధపడుతుండటం

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012

* ఫలితాల తర్వాత పట్టున్న నేతలంతా వెళ్లిపోతారని ఆందోళన
* ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజల నాడిని గమనించిన ఎమ్మెల్యేలు
* కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్తు లేదన్న నిర్ధారణ... సన్నిహితులు, కార్యకర్తలతో మంతనాలు
* పార్టీని వీడాలని క్షేత్రస్థాయి నుంచి ఒత్తిళ్లు
* జగన్‌ను జైలులో పెట్టినా ఎమ్మెల్యేలు వలసలకు సిద్ధపడుతుండటంపై అధిష్టానం కలవరపాటు
* ఏపీలో దెబ్బ తింటే యూపీఏకు మనుగడ ఉండదని ఢిల్లీ పెద్దల ఆందోళన
* వలసల నిరోధానికి వయలార్ రవి రాక!
* పదవులిస్తాం ఉండండంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లలో బుజ్జగింపులు

హైదరాబాద్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీకి నాయకత్వ లోపం, అధిష్టానం అస్తవ్యస్త విధానాలతో ఇక కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నాయకులు ఒక అంచనాకు వచ్చేశారు. దీంతో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న సమాచారం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌లో పట్టున్న నేతలెవరూ మిగలరన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. ఉప ఎన్నికలకు ముందుగానే కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చింది. 

కాంగ్రెస్‌లో భవిష్యత్తు లేదన్న నిర్ధారణకొచ్చిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగడంపై కొద్ది రోజులుగా సన్నిహితులతో తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్‌ను వీడాలని కింది స్థాయి నుంచి కూడా పలువురు నేతలపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం కోసం వివిధ నియోజకవర్గాలకు వెళ్లిన ఎమ్మెల్యేలు అక్కడి ప్రజల నుంచి వస్తున్న స్పందనను గమనించిన తర్వాత వారిలో చాలా మంది ప్రచారం ముగియకుండానే సొంత నియోజకవర్గాలకు వెళ్లిపోయారు. దీంతో ఉప ఎన్నికల ఫలితాల తర్వాత భారీ ఎత్తున వలసలుంటాయని పార్టీ నేతలే చెబుతున్నారు.

ఉప ఎన్నికలు, ఆ తర్వాతి పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం మొదట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, రోజురోజుకు పరిస్థితి చేయి దాటుతుండటంతో అధిష్టానం రంగంలోకి దిగింది. వలసలను నిరోధించడంపై ఢిల్లీ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే వలసల ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని ఢిల్లీ పెద్దలు అంచనాకు వచ్చారని, ఆయన్ని అరెస్టు చేసి జైలులో పెట్టడం ద్వారా పార్టీని వీడాలనుకునే నేతలు కొంత వెనకడుగు వేస్తారని భావించారని కాంగ్రెస్ నేతలంతా అంగీకరిస్తున్నారు. అయితే, జగన్‌ను జైలుకు పంపిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉండటానికి సిద్ధంగా లేరన్న సమాచారం పార్టీ హైకమాండ్‌ను తీవ్రంగా కలవరపెట్టింది. 

జగన్ అరెస్టయిన తర్వాత ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు (బొబ్బిలి), ఆళ్ల నాని (ఏలూరు) వారి పదవులను సైతం వదులుకోవడానికి సిద్ధపడటం, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి, మరికొందరు ఎమ్మెల్యేలు విజయమ్మకు సంఘీభావం ప్రకటించడం కాంగ్రెస్ నాయకత్వానికి అంతుచిక్కడం లేదు. దాంతో వలసల నివారణకు చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిన ఆదివారంనాడే కేంద్ర మంత్రి వయలార్ రవి ప్రత్యేక దూతగా హైదరాబాద్ రావడం కాంగ్రెస్ ఆందోళనను తేటతెల్లం చేస్తోంది. వలసలకు అడ్డుకట్ట వేయడం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల వల్ల కావడంలేదని అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చిందని, ఆ కారణంగానే వయలార్ రవిని ప్రత్యేకంగా పంపిందని సమాచారం. 

ఎమ్మెల్యేల వలసలు పెరిగితే రాష్ట్రంలో ప్రభుత్వానికి ముప్పు తప్పదని ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ పెద్దల ఆందోళనకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్‌కు అంతోఇంతో గట్టి పట్టున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అతి కీలకమైనది. ఏ రాష్ట్రంలో రానన్ని లోక్‌సభ స్థానాలు ఆ పార్టీకి ఇక్కడే లభించాయి. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందంటే అందుకు కారణం ఏపీలో లభించిన అత్యధిక ఎంపీ స్థానాలే. ఇక్కడ కాంగ్రెస్ దెబ్బతింటే జాతీయస్థాయిలో దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని, 2014 ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు. అందుకే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలను అధిష్టానం చేపట్టిందని సమాచారం. నేరుగా ఢిల్లీ నేతలే ఎమ్మెల్యేలతో మాట్లాడి, వారిని బుజ్జగిస్తున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఓ పక్క ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే, మరోపక్క ఎమ్మెల్యేలతో ఫోన్లలో మంతనాలు జరుపుతున్నారు.

ఎమ్మెల్యేలకు పదవుల ఎర!
వలసలను నిరోధించడానికి పదవులను ఎరగా చూపాలని అధిష్టానం పార్టీ నేతలను ఆదేశించింది. ఉప ఎన్నికల తర్వాత మీకు మంచి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు ఢిల్లీ పెద్ద ఒకరు కోస్తాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఆశ చూపించారు. ప్రభుత్వం మరో రెండేళ్లు ఉంటుంది.. ఎందుకు తొందరపడతారు.. అంటూ ఆ ఎమ్మెల్యేకు చాలాసార్లు ఢిల్లీ పెద్దలు ఫోన్‌లో బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అవసరాన్నిబట్టి కొత్తగా మరికొన్ని పదవులను కూడా సృష్టించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ముఖ్యులున్నట్టు చెబుతున్నారు. 

‘‘వచ్చే రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న ప్రయత్నంలో కనీసం వంద మంది ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తాత్కాలిక పదవుల కోసం రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవడానికి సిద్ధంగా లేను. పైగా, ఈ సమయంలో ఏదో ఒక చిన్న పదవి తీసుకుని నియోజకవర్గంలో ప్రజలను, ముఖ్యంగా మద్దతుదారులను దూరం చేసుకోలేను’’ అని తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పారు.

తన వర్గానికి పెద్దపీట వే సేలా కిరణ్ వ్యూహం
ప్రస్తుత పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి పనిలో పనిగా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పదవులిస్తామని నేతలను బుజ్జగిస్తున్న తరుణంలో తన మద్దతుదారులను మంత్రివర్గంలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గం నుంచి కొందరిని తప్పించాలని కిరణ్ ఎప్పటినుంచో భావిస్తున్నారు. అలాంటి మంత్రుల విషయంలో ఆయన కొన్ని రోజులుగా తనకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ, వారిపట్ల ముభావంగా ఉంటున్నారని తెలిసింది. దాంతో వారు తమకు ఉద్వాసన తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. 

ముఖ్యంగా 26 జీవోలకు సంబంధించి సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో అయిదుగురిని తప్పించాలని కిరణ్ ఆ నోటీసులు రాక ముందునుంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆయన ప్రయత్నం ఫలించడంలేదు. సుప్రీం కోర్టు నోటీసులు, సీబీఐ విచారణ సందర్భంగా అరెస్టయిన మంత్రి మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించారు. ఈ తొలగింపు జాబితాలో మరో అయిదుగురు మంత్రులున్నారని, వారిలో నలుగురిని ఎట్టిపరిస్థితుల్లో తప్పించాలని సీఎం గట్టి పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకూ చెక్ పెట్టాలని సీఎం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఉప ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం ఒత్తిడితో రాజీకొచ్చి మద్యం సిండికేట్ల కుంభకోణం వ్యవహారంలో బొత్స బినామీలను సీఎం పూర్తిగా వదిలేశారని, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ చిట్టాను ఢిల్లీ పెద్దల ముందుంచాలని కిరణ్ భావిస్తున్నారని తెలిసింది. ఈ రకంగా మొత్తంగా మంత్రివర్గంలో 14 మంది చిట్టాను ఢిల్లీ పెద్దల ముందుంచి, వారి స్థానంలో తన వారిని తీసుకోవడానికి వీలుగా మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయడానికి అధిష్టానం అనుమతి కోరాలన్న ఆలోచనతో ఉన్నట్టు సీఎం సన్నిహిత ఎమ్మెల్సీ ఒకరు చెప్పారు. అయితే, పార్టీ నుంచి ఊహించినంతగా వలసలు ఉండవని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయ పడ్డారు. ఇంత పెద్ద పార్టీలో అసంతృప్తి సహజమేనని, అంత మాత్రాన అందరూ పార్టీని వీడి వెళ్లిపోతారని భావించనవసరంలేదని ఆయన అన్నారు.

కిరణ్‌ను తప్పించడం ఖాయం?
మంత్రివర్గంలోకి తన వారిని తీసుకొని, బలపడాలని కిరణ్ ఓ పక్క ప్రయత్నాలను కొనసాగిస్తుండగా.. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత కిరణ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆయన వ్యతిరేక వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. అధిష్టానం ఆ విషయంలో ఇప్పటికే పలువురు రాష్ట్ర నాయకులకు చూచాయగా తెలియజేసిందని వారంటున్నారు. కిరణ్‌ను తప్పించడం ఖాయమైనందునే తెలంగాణకు చెందిన ఒక సీనియర్ మంత్రిఇటీవలి కాలంలో చాలాసార్లు ఢిల్లీకి వెళ్లి పలువురు నేతలతో అనేక దఫాలుగా సంప్రదింపులు జరిపారని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణకే చెందిన మరో సీనియర్ నేతకు కూడా కిరణ్ మార్పుపై సంకేతాలు అందాయని తెలిసింది.
Share this article :

0 comments: