రక్షణ స్టీల్స్‌తో బ్రదర్ అనిల్‌కు సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించినా ఉద్దేశపూర్వకంగా విస్మరించిన వైనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రక్షణ స్టీల్స్‌తో బ్రదర్ అనిల్‌కు సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించినా ఉద్దేశపూర్వకంగా విస్మరించిన వైనం

రక్షణ స్టీల్స్‌తో బ్రదర్ అనిల్‌కు సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించినా ఉద్దేశపూర్వకంగా విస్మరించిన వైనం

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012



* టీడీపీ కరపత్రంలోని తప్పుడు సమాచారంతో ‘ఈనాడు’ కథనాలు
* రక్షణ స్టీల్స్-ఏపీఎండీసీ మధ్య ఒప్పందం రద్దంటూ సీఎంవో లీకు
* రక్షణ స్టీల్స్ వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్‌దేనంటూ విషప్రచారం
* ఉప ఎన్నికలకు ముందు వైఎస్ కుటుంబంపై బురదజల్లేందుకు ఎల్లో చానళ్ల పన్నాగం
* షర్మిలకు ప్రజాదరణ లభించడం ఓర్వలేక కుట్ర
* రక్షణ స్టీల్స్‌తో బ్రదర్ అనిల్‌కు సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించినా ఉద్దేశపూర్వకంగా
విస్మరించిన వైనం
* ఏపీఎండీసీకి ఇచ్చిన ఇనుప గనుల రిజర్వేషన్‌ను 2010లోనే రద్దు చేసిన ప్రభుత్వం
* విలువలేని ఒప్పందం రద్దుకు తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కీలకమైన 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికలకు ముందు బయ్యారం ఇనుప గనుల పేరిట ప్రభుత్వం, ఎల్లో సిండికేట్ వ్యూహాత్మకంగా కొత్త విషపు నాటకానికి తెరలేపాయి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)- రక్షణ స్టీల్స్ కన్సార్టియం మధ్య ఇనుప ఖనిజ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) లీకు ఇవ్వగా.. వెంటనే ఎల్లో సిండికేట్‌కు చెందిన చానళ్లు దానిని వైఎస్ కుటుంబానికి ఆపాదిస్తూ విష ప్రచారం మొదలుపెట్టాయి.

ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ కుటుంబానికి రూ.14 లక్షల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని అప్పగించారని ఆరోపిస్తూ శాసనమండలిలో టీడీపీ పక్ష నేత దాడి వీరభద్రరావు పోస్టర్ విడుదల చేయగా అందులోని తప్పుడు అంశాలతోనే ‘ఘోరీ+గజనీ=జగన్’ అంటూ ఈనెల తొమ్మిదో తేదీన ఈనాడు కథనాలు ప్రచురించింది. తాజాగా ఏపీఎం డీసీ - రక్షణ స్టీల్స్ కన్సార్షియం చేసుకున్న ఒప్పందం రద్దుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటూ సోమవారం మధ్యాహ్నం సీఎంవో లీకు ఇచ్చింది. ముందు టీడీపీ ఆరోపణలు చేయడం, తర్వాత సర్కారు నిర్ణయం పేరిట సీఎంవో లీకు ఇవ్వడం, ‘తెలుగు కాంగ్రెస్’, దాని కొమ్ముకాసే పక్షాల నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకటనలు ఇవ్వడాన్ని పరిశీలిస్తే మొత్తం వ్యవహారమంతా ముందస్తు స్కెచ్ ప్రకారమే సాగినట్లు సుస్పష్టమవుతోంది.

షర్మిల ప్రచారానికి స్పందన భరించలేకే...
ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున దివంగత నేత వైఎస్ కుమార్తె షర్మిల చేసిన ప్రచారానికి వచ్చిన స్పందన చూసి సహించలేకే అధికార, ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో లక్షల కోట్ల విలువైన ఇనుప గనులను షర్మిల కుటుంబానికి కేటాయించారంటూ టీడీపీ నేత దాడి వీరభద్రరావు ఎలాంటి ఆధారాలు లేకుండా విడుదల చేసిన కరపత్రంలోని అంశాలతోనే ఎల్లోమీడియా అసత్య కథనాలు ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీఎండీసీ - రక్షణ స్టీల్స్ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు సీఎంవో లీకు ఇవ్వడం ఈ కుట్రకు కచ్చితంగా కొనసాగింపేనని అధికారవర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.

‘గత నెల రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు ఉప ఎన్నికల ప్రచారం, సంబంధిత వ్యూహాల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఫైళ్లన్నీ పెండింగులో మగ్గుతున్నాయి. పాలన కుంటుపడింది. అనేక పట్టణాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి సమస్యతో అలమటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చిన తర్వాతైనా తక్షణం ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించి క్లియర్ చేయాల్సిన ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోకుండా ఏమాత్రం ప్రాధాన్యం లేని రక్షణ స్టీల్ ఒప్పందం రద్దుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయడం అర్థంలేని వ్యవహారం. ఇప్పటికిప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసినా, చేయకపోయినా ఒకటే. వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ ఒప్పందానికే విలువ లేదు.

బయ్యారం ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏపీఎండీసీకి ఇనుప గనుల లీజులను కొత్తగా మంజూరు చేస్తే తప్ప ఈ ఒప్పందానికి విలువే ఉండదు. ఇప్పట్లో ఏపీఎండీసీకి కేంద్ర ప్రభుత్వం ఇనుప గనులు ఇచ్చే అవకాశం లేదు. ఒక వేళ ఇవ్వాలన్నా హీనపక్షం ఏడాది పైగానే పడుతుంది. మరిలాంటప్పుడు ఒప్పందం రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఫైలును ఇంత అత్యవసరంగా చూడాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ చేయాలంటే ఏడాదిన్నర కాలంగా ఎందుకు చేయలేదు. ఉప ఎన్నికలకు కేవలం ఒక్కరోజు ముందే ఎందుకు హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనిని బట్టే ఇది రాజకీయ లబ్ధికోసం తీసుకున్న నిర్ణయంగా చెప్పాల్సి వస్తోంది’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.

షర్మిల కుటుంబంపై బురదజల్లే యత్నం..
సీబీఐని పావుగా వాడుకుని వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్రం అరెస్టు చేయించిన తర్వాత ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్ కుమార్తె షర్మిల ప్రసంగాలకు అత్యంత జనాదరణ లభించింది. దీనిని ఓర్వలేకే ఎల్లో సిండికేట్, ప్రభుత్వం కుమ్మక్కై రక్షణ కన్సార్షియం వ్యవహారాన్ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చాయి. వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌తో తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని గతంలోనే రక్షణ కన్సార్టియం రాతపూర్వకంగా తెలియజేసింది.

బ్రదర్ అనిల్‌కు తమ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే తామే ఒప్పందం నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతామని రక్షణ కన్సార్షియం ప్రతినిధులు కొండలరావు, సతీష్‌లు 2010 ఆగస్టులో పత్రికాముఖంగా సవాల్ విసిరారు. వీటికి సమాధానం ఇవ్వకుండానే మళ్లీ కాంగ్రెస్, టీడీపీ నేతలు రక్షణ కన్సార్షియంను బ్రదర్ అనిల్‌కు చెందినదిగా విష ప్రచారం చేస్తున్నారు. అసలు బయ్యారం ప్రాంతంలో ఏపీఎండీసీకి ఇచ్చిన ఇనుప గనుల రిజర్వేషన్‌ను ప్రభుత్వం 2010లోనే రద్దు చేసింది. అయినా రక్షణ స్టీల్స్‌కు రూ. 14 లక్షల కోట్లు కట్టబెట్టినట్లు టీడీపీ విడుదల చేసిన పోస్టర్‌లో పేర్కొనడంలో ఉన్న ఔచిత్యమేమిటో ఆ పార్టీ నేతలకే తెలియాలి.

ఇదీ అసలు విషయం
ఖమ్మం జిల్లాలోని బయ్యారం ప్రాంతంలో లక్షల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు వైఎస్ సర్కారు కట్టబెట్టిందంటూ టీడీపీతోపాటు ఎల్లో సిండికేట్, దాని కొమ్ముకాసే రాజకీయ పక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో ఇనుప గనులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బయ్యారం, నేలకొండపల్లి, గార్ల మండలాల పరిధిలోని 56,690 హెక్టార్లను కేంద్ర ప్రభుత్వం ఏపీఎండీసీకి రిజర్వు చేసింది.

తర్వాత ఎక్స్‌ప్లోరేషన్ లెసైన్సు (భూగర్భంలో నిల్వ ఉన్న ఖనిజ పరిమాణాన్ని అంచనా వేసేందుకు అనుమతి) ఇచ్చింది. ఇక్కడున్న ఖనిజాన్ని తవ్వి విక్రయించేం దుకు నమ్మకమైన సంస్థను ఎంపిక చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిచింది. వెనుకబడిన ఖమ్మం జిల్లాల్లో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తామని ముందుకు రావడంతో ఏపీఎం డీసీ రక్షణ కన్సార్షియంతో ఇనుప ఖనిజం సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఖనిజాన్ని వ్యాపారపరంగా విక్రయించేందుకు అవసరమైన మైనింగ్ లెసైన్సు ఏపీఎండీసీకి అసలు రాలేదు. ఇది వస్తేగానీ ఖనిజాన్ని తవ్వి విక్రయించడానికి వీలుకాదు.

ఏపీఎండీసీకి ఇచ్చిన లెసెన్సు, గనుల రిజర్వేషన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు రద్దు చేస్తూ రోశయ్య ప్రభుత్వం (2010 డిసెంబర్ 9న) జీవో 126 జారీ చేసింది. దీంతో ఏపీఎండీసీ - రక్షణ స్టీల్ కన్సార్షియం మధ్య ఒప్పందానికి విలువ లేకుండా పోయింది. ఏపీఎండీసీకి చేసిన గనుల రిజర్వేషన్‌ను, లెసైన్సును రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ రక్షణ స్టీల్స్ కోర్టుకెళ్లింది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది.

బయ్యారం గనుల లీజు రద్దు వార్తలపై ఎవరేమన్నారంటే...
హైదరాబాద్, న్యూస్‌లైన్: బయ్యారం ప్రాంతంలో రక్షణ స్టీల్స్‌కు ఇచ్చిన భూముల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్న లీకు వార్తలపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. ఈ భూముల్లో ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేయగా ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల్ని తిరిగి వారికే స్వాధీనం చేయాలని బీజేపీ కోరింది. తమ కరపత్రానికి భయపడే సర్కారు లీజులను రద్దు చేసిందని టీడీపీ చెప్పగా, బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు చెప్పారు.
Share this article :

0 comments: