కాంగ్రెస్, టీడీపీల దౌర్జన్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, టీడీపీల దౌర్జన్యం

కాంగ్రెస్, టీడీపీల దౌర్జన్యం

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012



* అడ్డుకోబోయిన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులపై దాడులు
* అధికార పార్టీకి ఖాకీల వత్తాసు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం పలు నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులపై దౌర్జన్యానికి దిగాయి. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు అధికారపక్షానికే వత్తాసు పలికారు. మరికొన్ని చోట్ల ఖాకీలు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీచార్జికి తెగబడ్డాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లెలో ఏడుగురు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారు.

నెల్లూరు నగరంలోని జనార్దన్‌రెడ్డికాలనీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తను వారించడంతో ఘర్షణకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు నిరసనగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ‘‘మాకే ఎదురు తిరుగుతారా..’’ అంటూ వారిపై లాఠీచార్జి చేశారు. ఇక పోలింగ్ బూత్‌ల్లో కాంగ్రెస్ ఏజెంట్లు ఎన్నికల ప్రచారం చేసినా అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారు. దుత్తలూరు మండలం బొడ్డువారిపల్లెలో కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగుకు యత్నించారు. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డి మూలాపేటలోని ఒక పోలింగ్ బూత్‌లో హస్తం గుర్తుకు ఓటేయాలంటూ సైగలు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం తెలియజేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఒంగోలులో టీడీపీ దొంగ ఓట్లకు పాల్పడింది. అందుకు కాంగ్రెస్ పూర్తిగా సహకరించింది.

ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు దాడికి యత్నించారు. పాత మార్కెట్ సెంటర్లోని సెయింట్ థెరిస్సా హైస్కూలులో ఉన్న పోలింగ్ కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచే టీడీపీ, కాంగ్రెస్ ఏజెంట్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంటును బెదిరించి బయటకు పంపించారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి దొంగ ఓట్లు వేయించడంలో నిమగ్నమయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కొండపి ఎమ్మెల్యే జీవీ శేషులు గద్దలగుంట, ఏబీఎం కాలేజీల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. పోలీసులు వీరిని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం అడిగొప్పులలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు.

నరసాపురం నియోజకవర్గం మొగల్తూరులో కాంగ్రెస్ పార్టీ వారు దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని రామచంద్రపురంలోని స్ట్టీల్‌విల్‌పేట, ఏరుపల్లిలలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతపురంలోని రాంనగర్‌లో ఓటరు చీటి కోసం పోలింగ్ సహాయ అధికారి వద్దకు వెళ్లిన ఓ యువకుడిని పోలీసులు విచక్ష ణరహితంగా చితకబాదారు. దాంతో.. భయాందోళనకు గురైన ఓటర్లు ఓటేయకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు.

తిరుపతిలోని ఎస్‌టీవీ నగర్‌లో పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్లి బెదిరించి వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలింగ్ స్టేషన్ల సమీపంలోనే తిష్టవేసి ఓటేయడానికి వచ్చిన వారికి అదనంగా రూ.వెయ్యి ఇచ్చి హస్తానికి ఓటు వేస్తామని ప్రమాణాలు చేయించుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో కాంగ్రెస్ నేతలు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. శిరువెళ్లలో కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తుండడంతో వైఎస్‌ఆర్‌సీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని జంగిటివారిపల్లె దళితులను ఓటు వేసుకోనివ్వకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. చివరికి డీఎస్పీ ఆధ్వర్యంలో ఓటింగ్‌కు అనుమతించారు. చిట్వేలి మండలంలోని మల్లేపల్లెలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఏజెంట్లను టీడీపీ నాయకులు బయటికి లాగి ఓట్లను అనుకూలంగా మలుచుకున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని ఎర్రచెరువుపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి, నందలూరు మాజీ ఎంపీపీ సాయిబాబాలపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు.

రాయచోటి నియోజకవర్గం రామాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంటును కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేయగా.. స్థానికులు, పోలీసుల జోక్యంతో వదిలిపెట్టారు. పరకాల నియోజకవర్గంలో ఘర్షణలు చోటు చేసుకోనప్పటికీ పోలీసుల తీరుతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి సోమవారం రాత్రి కోడ్ ఉల్లంఘించి దుత్తలూరు మండలం లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Share this article :

0 comments: