తెలంగాణలో అరడజను దొంగలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో అరడజను దొంగలు

తెలంగాణలో అరడజను దొంగలు

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012

కేసీఆర్ కుటుంబసభ్యులందరూ దోచుకుంటున్నారు
ఊసరవె ల్లి దుష్ర్పచారాలను ప్రజలు నమ్మరు
ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ నేతల విమర్శలు
టీఆర్‌ఎస్‌తో తెలంగాణరాదు... వైఎస్సార్‌సీపీదే కీలకపాత్ర
వైఎస్సార్ పేరు ఎత్తే నైతిక అర్హత వారికి లేదు
కాళ్లు మొక్కి పదవులు పొందిన మాట మరిచారా..?
టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తిన కొండా సురేఖ

పరకాల, న్యూస్‌లైన్: తెలంగాణలో కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్, కూతురు కవిత, ఈటెల, కోదండరాం రూపంలో అరడజను దొంగలుపడి దోచుకు తింటున్నారని పరకాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ధ్వజమెత్తారు. సిగ్గూ శరం లేని టీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ వస్తుందంటూ నిత్యం మోసం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పుడు నేను, నా భార్య ఒంటరివారమంటూ ప్రచారం చేసిన కేసీఆర్, ఆ తర్వాత విదేశాల్లో ఉన్న తన కొడుకును వసూళ్ల కోసం ఇక్కడకు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కూతురు సినిమాలు, కొడుకు కార్పొరేట్ ఆస్పత్రులు, అల్లుడు కార్పొరేట్ కాలేజీల వారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

తెలంగాణ పేరుచెప్పి కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే పరకాలలో జరిగే కేసీఆర్ సభకు నయాపైసా పెట్టకుండా జనాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం పరకాల నియోజకవర్గంలో జరిగిన రోడ్‌షోలో మాట్లాడారు. నమ్ముకున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కోసం మంత్రి పదవిని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకున్నానని చెప్పారు. తన రాజీనామాపై టీఆర్‌ఎస్ నాయకులు దుష్ర్పచారం చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిని పువ్వుల్లో పెట్టి గెలిపిస్తామన్న కే సీఆర్, కోదండరాం మాటమార్చి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మూడు నెలల్లో తప్పకుండా తెలంగాణ తెస్తానని కేసీఆర్ హామీ ఇస్తే తన ఓటుకూడా టీఆర్‌ఎస్‌కే వేస్తానని చెప్పారు. తెలంగాణ పేరుతో మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కేసీఆర్ మాటలను పరకాల ప్రజలు నమ్మరన్నారు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తీర్మానం విషయంలో అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆమె తేల్చిచెప్పారు. 

వైఎస్సార్ పేరెత్తే నైతిక అర్హత లేదు

ఒకవైపు భర్తను పోగొట్టుకుని, మరోవైపు కొడుకును జైల్లో పెట్టినా పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని నమ్ముకున్న ప్రజల కోసం విజయమ్మ పరకాలకు వచ్చారని సురేఖ చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర, పల్లెబాట ప్రాంతాల్లో ఆయన సతీమణి విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. గీసుకొండలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టుకు వైఎస్సార్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ పేరెత్తే నైతిక అర్హత టీఆర్‌ఎస్ పార్టీకి లేదని ధ్వజమెత్తారు. 

వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కాళ్లు మొక్కి కేసీఆర్ మంత్రి పదవిని పొందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎలాంటి పదవి లేనప్పటికీ వైఎస్సార్ దయతోనే హరీష్‌రావు మంత్రి పదవి తీసుకున్నది నిజం కాదా అని నిలదీశారు. విజయమ్మ పరకాలకు వస్తే వైఎస్సార్‌పార్టీ బ లోపేతం అవుతుందనే భయంతోనే అడ్డుకుంటామని ప్రకటించారని విమర్శించారు. తమకు డబ్బులు వచ్చినట్లు నిరూపిస్తే జిల్లా వదిలి వెళ్తామని, లేదంటే మీ టీఆర్‌ఎస్ దుకాణాన్ని బంద్ చేస్తారా అని సవాల్ చేశారు. శవాలపై డబ్బులు ఏరుకునే విధంగా టీఆర్‌ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం యువకులు ప్రాణాలర్పిస్తుంటే, కేసీఆర్ కుటుంబ సభ్యుల పిల్లలు మాత్రం ఏసీ రూముల్లో చదువుకుంటున్నారని విమర్శించారు. 

టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతి ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీఆర్‌ఎస్‌తో రాదని, ఆ పార్టీ చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు ప్రజల కంటే పరకాల ప్రజలు తెలివైనవారన్నారు. పాలమూరులో బీజేపీ 1,800 మెజార్టీతో గెలిస్తే పరకాలలో తమకు 18 వేల మెజార్టీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 12న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేయకుండా తమ వైఖరిని అడగడం సిగ్గుచేటన్నారు. ముందు తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాతే తమ పార్టీ వైఖరి చెప్తామని సురేఖ స్పష్టం చేశారు. అంతకు ముందు గీసుకొండలో సురేఖ మాట్లాడుతూ... రేపు ఒకవేళ తెలంగాణలోని అన్నిసీట్లూ (119) టీఆర్‌ఎస్‌కు వచ్చినా... అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించలేరని, అదే తాము అధికారంలోకి వస్తే పార్టీలోని మిగతా సహచరులను ఒప్పించి తీర్మానం పెట్టించగలమని అన్నారు. భవిష్యత్తులో తమకుండే ఎంపీల బలంతో కేంద్రంపైనా తెలంగాణ కోసం ఒత్తిడి తేగలమని చెప్పారు.

ప్రభుత్వ పతనం ఖాయం: కొండా మురళి

పరకాల ఉపఎన్నికలో కొండా సురేఖను గెలిపిస్తే ఆరు నెలల్లో ప్రభుత్వం కుప్పకూలుతుందని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పారు. ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పేరుచెప్పుకుని కేసీఆర్ ఓట్లు, నోట్లు సంపాదించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యమానికి దూరంగా ఉన్న భిక్షపతిని పోటీకి దింపడం సిగ్గుచేటన్నారు. వైఎస్ కుటుంబంతో కొండా దంపతులకున్న అనుబంధమేమిటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. టీడీపీ హయాంలో తనపై పోటా కేసు పెట్టినప్పుడు వైఎస్‌కు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు తనతో చర్చించేందుకు ఇక్కడికి వచ్చారని గద్గద స్వరంతో చెప్పారు. జీవితాంతం తాము వైఎస్ కుటుంబంతోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

పరకాల ప్రచారంలో విజయమ్మ వెంట పార్టీ ముఖ్య నేతలు గట్టు రామచంద్రరావు, బాజిరెడ్డి గోవర్ధన్, జనక్ ప్రసాద్, కేకే మహేందర్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, చందా లింగయ్య, ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఆదం విజయ్‌కుమార్, నాగిరెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: