లక్ష్మీనారాయణపై చర్య తీసుకోండి. హైకోర్టులో గుంటూరు వాసి పిల్ దాఖలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష్మీనారాయణపై చర్య తీసుకోండి. హైకోర్టులో గుంటూరు వాసి పిల్ దాఖలు

లక్ష్మీనారాయణపై చర్య తీసుకోండి. హైకోర్టులో గుంటూరు వాసి పిల్ దాఖలు

Written By news on Friday, June 29, 2012 | 6/29/2012

మీడియాతో మాట్లాడలేదంటూ కోర్టును తప్పుదోవ పట్టించారు
ఈనాడు, ఆంధ్రజ్యోతి లబ్ధి పొందడానికి జేడీ సహకరించారు
మీడియాతో రహస్యంగా మాట్లాడడం మాన్యువల్‌కు విరుద్ధం
జేడీ కాల్ లిస్ట్‌ను సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదేశించండి
పిల్.. సోమవారం విచారణకు వచ్చే అవకాశం

హైదరాబాద్, న్యూస్‌లైన్:సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వివరాలను సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. తను గానీ, తన సహచరులుగానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడలేదంటూ తప్పుడు ప్రకటన చేసి కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా, మోసం చేశారని, అందుకు లక్ష్మీనారాయణపై చర్య తీసుకోవాలని కోరుతూ గుంటూరు లోని పట్టాభిపురానికి చెందిన భూషణ్ బి.భవనం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఈనాడు అధిపతి రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, బీఎస్‌ఎన్‌ఎల్ జీఎంలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ వ్యాజ్యం లో జేడీ లక్ష్మీనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. సోమవారం ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశాలు ఉన్నాయి.

దర్యాప్తు మొదలైన నాటి నుంచీ లీకులు..

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు, ఇతర కేసుల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులతో జేడీ లక్ష్మీనారాయణ ఫోన్‌లో మాట్లాడుతున్నారని, అయితే ఈ విషయాన్ని కోర్టుల్లో ఎప్పటికప్పుడు సీబీఐ న్యాయవాదులు ఖండిస్తూ వచ్చారని పిటిషనర్ తెలిపారు. మీడియాలో వచ్చే కథనాలకూ జేడీకీ ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు తెలిపారని వివరించారు. లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్లు ఆయన కాల్ లిస్టే స్పష్టంగా చెబుతోందని, ఇలా దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడటం సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధమని, ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని వివరించారు. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు, జేడీ లక్ష్మీనారాయణకు మధ్య అసాధారణ సంఖ్యలో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు నడిచాయని, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయని తెలిపారు. జేడీ కాల్‌లిస్ట్ ద్వారా చంద్రబాల అనే మహిళకు సైతం పెద్ద సంఖ్య లో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు కూడా తేలిందన్నారు. ఆమె కూడా లక్ష్మీనారాయణకు అదే స్థాయిలో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపారని వివరించారు. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు కూడా వచ్చాయని, ఆ మరుసటి రోజు చంద్రబాల ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు వచ్చి లక్ష్మీనారాయణకు, తనకు మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, దానిని ప్రశ్నించేందుకు ఎవరికి అధికారం లేదని కూడా చెప్పారని పిటిషనర్ పేర్కొన్నారు.

జేడీ పనితీరుపై సందేహాలు

సీబీఐ మాన్యువల్ ప్రకారం మీడియాతో మాట్లాడే అధికారం జేడీ లక్ష్మీనారాయణకు లేదని, కేసు దర్యాప్తు గురించి ఉన్నతాధికారులతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడకూడదని పిటిషనర్ తెలిపారు. సీబీఐ మీడియాతో ఏం మాట్లాడాలన్నా అది ప్రెస్‌నోట్ ద్వారా బహిరంగంగానే మాట్లాడాల్సి ఉంటుందే తప్ప, ఫోన్‌లలో రహస్యంగా కాదని వివరించారు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులతో లక్ష్మీనారాయణ మాట్లాడిన కాల్స్‌ను బట్టి చూస్తే, ఆయన పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడినట్లు బహిర్గతమైనా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు మీడియా ట్రయిల్ నిర్వహిస్తున్నాయని తెలిపారు.

చట్టానికి అతీతుడిగా భావిస్తున్నారు

లక్ష్మీనారాయణ చట్టానికి అతీతుడిగా భావిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం అందించి లబ్ధి పొందాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తున్నాయని, ఇందుకు లక్ష్మీనారాయణ సహకరిస్తున్నారన్నారు. దర్యాప్తునకు సంబంధించి లక్ష్మీనారాయణ చెప్పే వివరాలకు కల్పనలను జోడించి ఈనాడు, ఆంధ్రజ్యోతి దారుణ కథనాలను ప్రచురించాయని, ఇంకా ప్రచురిస్తున్నాయని పిటిషనర్ తెలిపారు. లక్ష్మీనారాయణను నియంత్రించకుంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని భూషణ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ వ్యాజ్యాన్ని భూషణ్ ఈ నెల 26న దాఖలు చేశారు. అయితే హైకోర్టు రిజిస్ట్రీ దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చివరకు గురువారం దానికి పిల్ నెంబర్ కేటాయించింది.
Share this article :

0 comments: