చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం

చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

* చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
* కొన్ని కేంద్రాల్లో రాత్రి 7 దాకా పోలింగ్
* ఓటరు చైతన్యం వెల్లువెత్తింది
* ఉదయం నుంచే బారులు తీరిన మహిళలు
* నాలుగు కేంద్రాల్లో పోలింగ్ బహిష్కరణ
* రీ పోలింగ్‌కు ఎక్కడా ఏ పార్టీ అడగలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు మంగళ వారం జరిగిన ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలిగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. 18 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి 2009 సాధారణ ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి అది దాదాపు 80 శాతానికి చేరిందన్నారు. ఓటర్లలో పెరిగిన చైతన్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇక నెల్లూరు లోక్‌సభ స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైందని మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. 

‘‘ఇదంతా ప్రాథమిక సమాచారం మాత్రమే. ప్రిసైడింగ్ అధికారుల నుంచి లిఖితపూర్వక సమాచారం అందితే పోలింగ్ శాతం కొంత పెరగవచ్చు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఐదింటి తర్వాత కూడా ఓటర్లు క్యూలో ఉండటంతో రాత్రి 7.30 దాకా పోలింగ్ జరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసి, ఓటేయాలంటూ ఆహ్వానించడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణం’’ అని వివరించారు. 18 స్థానాల్లో రీ పోలింగ్ కోసం ఇప్పటిదాకా ఎక్కడా ఏ పార్టీ నుంచీ తనకు విజ్ఞాపనలు అందలేదన్నారు. 

‘‘బుధవారం ప్రిసైడింగ్ అధికారులు, కేంద్ర పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు ఫారం 17 (ఎ)ను అభ్యర్థుల సమక్షంలో పరిశీలిస్తారు. ఎక్కడైనా అవసరమైతే రీ పోలింగ్‌కు సిఫార్సు చేస్తారు. వారి నివేదికల ఆధారంగా దానిపై నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి రీ పోలింగ్‌పై బుధవారం స్పష్టత వస్తుంది’’ అని వివరించారు. అక్కడక్కడా స్వల్ప ఘటనలు తప్ప ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు బారులు తీరారు. వారంతా పెద్ద ఎత్తున తరలి రావడంతో మధ్యాహ్నం ఒంటి గంటకే 50 శాతం పోలింగ్ న మోదైంది. ఒక్క అనంతపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే తక్కువ పోలింగ్ శాతం నమోదైనా, అక్కడ కూడా 2009 కంటే కన్నా ఎక్కువే జరగడం విశేషం!

ఆ 4 బూత్‌లలోనూ రీ పోలింగుండదు
‘‘వామపక్షాల అభ్యర్థులు లేరంటూ పోలవరం నియోజకవర్గంలో 61, 62వ బూత్‌ల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సమస్యలను పరిష్కరించలేదంటూ కోవూరు అసెంబ్లీ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రంలో, కావలి అసెంబ్లీ పరిధిలోని మరో కేంద్రంలో పోలింగ్‌ను ఓటర్లు బహిష్కరించారు’’ అని భన్వర్‌లాల్ తెలిపారు. వీటిలో ఎక్కడా రీ పోలింగ్ ఉండబోదని ఆయన వివరణ ఇచ్చారు. 

‘‘పోలవరం సెగ్మెంట్ సీతంపేటలో 176వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల సమస్యతో చాలాసేపు పోలింగ్ నిలిచిపోయింది. తర్వాత సరిచేసి రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్ నిర్వహించాం. తొలుత 16 చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తడంతో వాటి బదులు వేరే ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించాం. రైల్వే కోడూరులో ఇరు పార్టీల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినా అరగంటలో పరిస్థితి అదుపులోకి వచ్చి పోలింగ్ కొనసాగింది. ఓటేయడమెలాగో చూపెట్టాలని ఓ వృద్ధుడు అడిగితే ఒంగోలులో మైక్రో పరిశీలకుడు, ప్రిసైడింగ్ అధికారి ఈవీఎం దగ్గరకు వెళ్లారు. అయినా వారిని మార్చాం. ఏ పోలింగ్ కేంద్రంలోనూ రిగ్గింగ్ జరిగినట్టు ఎవరి నుంచీ ఫిర్యాదు అందలేదు. పోలింగ్ ప్రక్రియను లైవ్ వెబ్ కాస్ట్ చేసినందువల్ల రిగ్గింగ్‌కు అవకాశముండదు. ఓటర్ల జాబితాలో పేర్లు లేవనే సమస్యలు కూడా తక్కువగానే తలెత్తాయి’’ అని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: