కాంగ్రెస్, టీడీపీ, సీబీఐల కుట్ర టార్గెట్ జగన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, టీడీపీ, సీబీఐల కుట్ర టార్గెట్ జగన్!

కాంగ్రెస్, టీడీపీ, సీబీఐల కుట్ర టార్గెట్ జగన్!

Written By news on Friday, June 22, 2012 | 6/22/2012

* సీబీఐ జేడీ ఫోన్ సంభాషణలే నిదర్శనం 
* వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రకటన

హైదరాబాద్, న్యూస్‌లైన్ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడిందీ పేర్కొంటూ, ఆ వివరాలను బయట పెడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం గురువారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

రాష్ట్రంలో పాలన ఉందా?
‘‘రాష్ట్రంలో పరిపాలన ఉందా? అధికార పార్టీ అయిన కాంగ్రెస్, శాసనసభలో సంఖ్యను బట్టి ప్రధాన ప్రతిపక్షం అనిపించుకుంటున్న తెలుగుదేశం పార్టీ - ఈ రెండూ కలిసి గడిచిన మూడేళ్లలో ప్రజలకు చేసిన మేలు ఇది అని చెప్పుకోవటానికి ఒక్కటి లేదు. కాబట్టే రాష్ట్రంలో పరిపాలన లేదన్న అభిప్రాయం కలుగుతోంది. ఇప్పుడు నడుస్తున్నది పోలీసు రాజ్యం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సీబీఐ- ఈ రెండింటినీ ఉపయోగించి రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. దుర్మార్గంగా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చేస్తున్నారు. ఈ మొత్తం కుట్రలో వీరి టార్గెట్ - జగన్!

పార్టీ వీడినందుకే వేధింపులు
ఓదార్పుయాత్ర విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో విభేదించి, ప్రజల్లోకి వెళ్లటానికే నిర్ణయించుకున్న జగన్‌మోహన్‌రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుతో హైకోర్టుకు లేఖ రాయించి... సీబీఐ విచారణకు ఆదేశం తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జతకలిసింది. సీబీఐ కేసులకు, ఐటీ వేధింపులకు జగన్‌మోహన్‌రెడ్డి లొంగలేదు. ఆ పథకం విఫలమైంది. అయినా ఉపఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు.

ఫలానా చోట ఈ రోజు విచారణ జరుగుతోందంటూ మీడియాకు లీకులు ఇచ్చి, ఏదో నేరం ఘోరం చేసిన వ్యక్తికి మాదిరి చిత్రించేందుకు ఒక వర్గం మీడియాతో చేతులు కలిపి చిలువలు పలువలుగా కథలు ప్రచారం చేయించారు. అయినా ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పత్తా లేకుండా పోయింది. చివరికి దిగజారుడులో పాతాళపు అంచులకు చేరి ఓటు ట్రాన్స్‌ఫర్ స్కీము ద్వారా తెలుగుదేశం మద్దతు తీసుకున్న కాంగ్రెస్ రెండు స్థానాలతో చావుతప్పి కన్ను లొట్టపోయిన తీరులో బయటపడింది. ఆ రకంగా జగన్‌ను నిరోధించేందుకు వేసిన అరెస్టు వ్యూహమూ విఫలమైంది.

ఫ్యాక్షనిస్టులా జేడీ వైఖరి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న విచారణ ఆస్తులకు సంబంధించినది కాదు.. ఇది కేవలం ఆదరణకు సంబంధించిన అంశమని ఈ పాటికే జాతీయ మీడియాకు కూడా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా అర్థమవుతోంది. ఇది అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు ప్రజాదరణ కరువు కావటం వల్ల, ఆ ప్రజాదరణను దండిగా సంపాదించుకున్న వైఎస్ కుటుంబంమీద నడుపుతున్న కేసు. ఈ కేసు విచారణను సీబీఐ జేడీ ఓ ప్రొఫెషనల్ పోలీసు అధికారిలా కాకుండా పాత కక్షలున్న ఫ్యాక్షనిస్టులా ప్రారంభించారు. టీవీ ధారావాహిక మాదిరిగా చార్జిషీట్లు దాఖలు చేయటం, పారిశ్రామిక సంస్థలకు విధానంలో భాగంగా ప్రభుత్వం నుంచి లభించిన అనుమతులను అక్రమంగా వక్రీకరించే ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకపోవటం.. ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా దేశం అంతటికీ ఒకే చట్టాలు, జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే వేరే సూత్రాలు వర్తిస్తాయన్నట్టు సీబీఐ ప్రవర్తిస్తోంది. ఇంకోవైపు మీడియాలో ఉన్న పోటీని, వైరాన్ని అడ్డుపెట్టుకుని, అందులో కొందరిని తన పథకంలో భాగస్వాములుగా మార్చుకోవటమో, లేక వారి పథకంలో తాను భాగం కావటమో వరకు వెళ్లిపోయారు. సీబీఐ మాన్యువల్ ప్రకారం ఆ సంస్థ తప్పుడు ప్రచారం చేయకూడదు. కేసుకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాల మీద ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలి. 

ఈ కేసులో సాక్షి అనే మీడియా సంస్థలోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు జరుగుతున్నప్పుడు... దీన్ని వ్యాపార పరంగా, విధాన పరంగా కూల్చివేయాలని కంకణం కట్టుకున్న వ్యతిరేక పత్రికలు... సాక్షి చానల్ ను ప్రత్యర్థిగా చూస్తున్న చానళ్లు... వీటన్నింటికీ అసత్యాల సరఫరాదారుగా సీబీఐయే మారటమన్నది ఈ కేసు కంటే ముందుగా దర్యాప్తు చేసి రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అంశం. భారీగా ప్రజాదరణ కలిగిన పత్రిక, చానల్‌కు వ్యతిరేకంగా... వారి వ్యతిరేకులకు అబద్ధపు సరంజామా అందించటాన్ని చట్టం పరిభాషలో ఏమంటారో గానీ, ప్రజల భాషలో అది కుట్ర.

ఎప్పట్నుంచో అనుమానాలు
ఈ అంశాల్లో రాష్ట్రంలో మేధావి వర్గం అంతటిలోనూ ఎప్పటినుంచో అనుమానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ వ్యవహార శైలిని గమనించిన సుప్రసిద్ధ పాత్రికేయుడు పి.సాయినాథ్ ఇటీవల ‘ద హిందూ’ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ.. సీబీఐ కూడా వేరే పార్టీ పెట్టుకుని ఉప ఎన్నికల బరిలోకి దిగవచ్చుకదా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ అరెస్టుకు సంబంధించిన రాజకీయ కుట్రను, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలను ఇండియా టుడే వార పత్రిక కొద్ది రోజుల క్రితమే బట్టబయలు చేసింది. 

ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని, ఈ కేసుమీద న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించిన 280 రోజుల తర్వాత.. అదీ ఉప ఎన్నికలు కచ్చితంగా 15 రోజుల్లో జరుగుతాయనగా, అది కూడా కోర్టు సమన్ల మేరకు మరికొన్ని గంటల్లో జడ్జి ముందు హాజరుకావాల్సి ఉండగా అరెస్టు చేస్తూ జేడీ తీసుకున్న నిర్ణయంపై, అరెస్టుకు ముందు మూడు గంటల పాటు జరిగిన తతంగంపై న్యాయ విచారణ జరగాల్సిన అవసరముంది.

మా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారేమో!
అంతేకాకుండా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరి ఫోన్లన్నింటినీ చట్టవిరుద్ధంగా ట్యాప్ చేయించి ఆ విషయాలను ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు చేరవేస్తున్నట్టు మేం భావిస్తున్నాం. అధికార పార్టీ, ప్రతిపక్షం చేస్తున్న కుట్రలన్నింటినీ ప్రజలు ఎక్కడికక్కడ జగన్‌కు అండగా నిలబడి ముక్కలు చేస్తున్నందువల్ల... దిక్కుతోచని ఢిల్లీ పెద్దలు, ఎల్లోమీడియా ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డికి భౌతికంగా హాని చేసే కుట్రలకు తెగిస్తున్నారు. 

అందులో భాగంగానే నార్కోటెస్టుల రూపంలోనో, మరో రూపంలోనో హానికి తెగబడుతున్నారనటానికి జేడీ ఫోన్ కాల్స్ ఒక ఆధారమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన వివరాలను మొత్తంగా దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నింటికీ మా పార్టీ తరఫున అందజేస్తాం. ఈ కుట్రమీద సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య వాదులకు ఈ వివరాలన్నింటినీ నివేదిస్తాం.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో సంయుక్తంగా సీబీఐ సాగిస్తున్న ఈ కుట్రను నిరసిస్తూ, ప్రజాస్వామ్య సంస్థల పట్ల మళ్లీ విశ్వాసాన్ని నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులుగా మా సత్యాగ్రహాన్ని ప్రకటిస్తున్నాం.’’ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నుంచి ఎక్కువసార్లు ఆయా నంబర్లతో జరిగిన మొత్తం సంభాషణల జాబితాను కూడా ప్రకటనతో పాటుగా వైఎస్సార్‌సీఎల్పీ విడుదల చేసింది. 

జగన్‌ను అంతం చేసే కుట్ర?
ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించటంగానీ, అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకోవటంగానీ అసాధ్యం అని నిరూపణ అవుతున్న మీదట, తెరవెనక శక్తులు జగన్‌మోహన్‌రెడ్డికి నేరుగా భౌతికంగా హాని తలపెడుతున్నాయని బలమైన అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కుట్రను అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వీరిద్దనీ కలుపుకొని సీబీఐ నడుపుతున్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. 

అక్రమ అరెస్టు తరవాత జగన్‌మోహన్‌రెడ్డి భద్రతను గాలికి వదిలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు సీబీఐ సంయుక్తంగా ఆయన ప్రాణహానికి తమకు తాముగా ఉద్దేశపూర్వకంగా అవకాశం కల్పించాయి. జెడ్ కేటగిరీ రక్షణ ఉన్న నాయకుడిని కావాలని భద్రత లేని బస్సులో తీసుకెళ్లటంగానీ, సీబీఐ దర్యాప్తుకు, న్యాయస్థానానికిగానీ ఏ దారిలో తీసుకువెళుతున్నదీ ముందుగా ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేయటంగానీ... ఈ రెండింటిలో జననేత భద్రత పట్ల కుట్రపూరిత ధోరణే స్పష్టంగా కనిపిస్తోంది. 

లోతైన కుట్రకు కాల్సే నిదర్శనం
సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి వెళ్లిన, దానికి వచ్చిన కాల్స్ వివరాలు మా దృష్టికి వచ్చాయి. వీటిని పరిశీలించిన తరవాత జగన్‌మోహన్‌రెడ్డి విచారణ పేరిట జరుగుతున్న తంతులో చాలా లోతయిన కుట్ర దాగి ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ ఫోన్లలో మీడియాలో ఒక వర్గం వారికి వెళ్లిన ఫోన్లున్నాయి. జడ్జీలకు వెళ్లిన ఫోన్లున్నాయి. దర్యాప్తుతో సంబంధం లేని పోలీసు అధికారులకు వెళ్లిన ఫోన్లున్నాయి. 

అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్‌కు జేడీ నుంచి.. ఆమె ఫోన్‌నుంచి జేడీకి ఒక ప్రవాహంలా ఫోన్‌కాల్స్ రావటం, వెళ్లటం కనిపిస్తోంది. అలాగే, వాసిరెడ్డి చంద్రబాల ఫోన్‌నుంచి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు, మీడియాలో ఒక వర్గం వారికి విపరీతంగా ఫోన్‌కాల్స్ వెళ్లాయి. ఇంతకీ ఎవరీ చంద్రబాల? ఈ మొత్తం వ్యవహారంలో ఈమె పాత్రమీద విచారణ జరపాలని భావిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షుడి పేరు ప్రతిష్టల్ని దెబ్బ తీసే కుట్రతో పాటు, ఆయనకు భౌతికంగా హాని చేసే కుట్రకు కూడా ఈ అంశాలన్నింటితో సంబంధం ఉందని మేం బలంగా నమ్ముతున్నాం. 

నార్కో పేరుతో సీబీఐ కుట్ర
ఇప్పుడు నార్కో టెస్టుల పేరిట సీబీఐ మరో కుట్రకు తెరతీస్తోంది. నార్కో పరీక్షలు శాస్త్రీయం కావని, వాటిని నిర్వహించరాదని సుప్రీంకోర్టు చెప్పినా, వాటివల్ల ప్రాణ హాని ఉండవచ్చని వైద్యులే ధ్రువీకరిస్తున్నా, ఇంతకు మునుపు విజయసాయిరెడ్డికి నార్కో టెస్టులు చేయాలన్న పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించినా.. మళ్లీ అవే పరీక్షలు జరపాలని సీబీఐ మొండిగా వాదిస్తోంది. కాబట్టే నార్కో పరీక్షలు చేయాలన్న సీబీఐ వాదనను జగన్‌మోహన్‌రెడ్డికి భౌతికంగా హాని చేసే కుట్రలో భాగంగానే భావించాల్సివస్తోంది. సీబీఐ జేడీగా వ్యవహరిస్తున్న లక్ష్మీనారాయణ వ్యవహార శైలి ఈ కుట్రలకు సంబంధించిన అనుమానాలన్నింటికీ బలాన్ని చేకూరుస్తోంది.
Share this article :

0 comments: