బెయిల్ ఇవ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెయిల్ ఇవ్వండి

బెయిల్ ఇవ్వండి

Written By news on Friday, June 22, 2012 | 6/22/2012

హైకోర్టును ఆశ్రయించిన జగన్‌మోహన్‌రెడ్డి
సంబంధం లేని కారణంతో సీబీఐ కోర్టు బెయిల్ తిరస్కరించింది
ఎంపీని గనుక జైల్లోనే ఉంచాలనడం సుప్రీం తీర్పులకూ విరుద్ధమే
నా హోదాతో సాక్షుల్ని ప్రభావితం చేస్తానన్నది సీబీఐ అపోహే
కేసులో నాపై సీబీఐ చేసిన ఆరోపణల్లో వాస్తవం అసలే లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఆరోపించినట్టుగా తాను ఎలాంటి నేరమూ చేయలేదని అందులో వివరించారు. ‘‘నా బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంబంధం లేని కారణాలను చూపుతూ కొట్టేసింది. అదెంత మాత్రమూ సరికాదు. నా కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి గతేడాది ఆగస్టులో హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇప్పటి వరకు మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. 156 మందిని సాక్షులుగా పేర్కొంది. ఆ చార్జిషీట్‌లలో సీబీఐ అధికారులు నాపై చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. నేను పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి, సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను తారుమారు చేయడం చేయవచ్చనే కారణంతో కింది కోర్టు నాకు బెయిల్ నిరాకరించింది. ఇదెంత మాత్రమూ సరైన కారణం కాదు’’ అని ఆయన వివరించారు. దర్యాప్తుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని, బెయిల్ మంజూరు సమయంలో ఎలాంటి షరతులు విధించినా పాటిస్తానని హైకోర్టుకు తెలిపారు.

నా హోదాను నాకు వ్యతిరేకంగా వాడటం చట్టవిరుద్ధమే

కడప లోక్‌సభ స్థానం నుంచి తాను 5.43 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నానని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. ‘‘ఇటీవలి 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న సమయంలో, సీబీఐ అధికారులు తమ ముందు హాజరవాలంటూ హఠాత్తుగా సీఆర్పీసీ సెక్షన్ 41 ఎ(1) కింద నోటీసిచ్చారు. దాన్ని గౌరవిస్తూ 25, 26, 27 తేదీల్లో సీబీఐ ఎదుట హాజరయ్యాను. దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాను. అయినా మే 27న సీబీఐ అధికారులు నన్ను అరెస్టు చేశారు. నేను పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి, ఆ హోదా వల్ల దర్యాప్తులో జోక్యం చేసుకునే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆ సందర్భంగా జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. 

గతేడాది సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి మే 26 దాకా నేను బయటే ఉన్నాను. దర్యాప్తులో భాగంగా మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. బయట ఉన్నంత కాలం నేను దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్టు సీబీఐ ఎన్నడూ ఆరోపించలేదు. సాక్షులను ప్రభావితం చేసినట్టు నిరూపించనూ లేదు. నా కస్టడీ కోరుతూ సీబీఐ అధికారులు వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించకుండా నన్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. దాన్ని సవాలు చేస్తూ నేను, నన్ను కస్టడీకివ్వాలంటూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేశాం. హైకోర్టు నన్ను ఐదు రోజుల కస్టడీకిచ్చింది. తరవాత మరో రెండు రోజులు పొడిగించింది. మే 29న నేను పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే తోసిపుచ్చింది. 

దాంతో నేను జ్యుడీషియల్ రిమాండ్‌లోనే కొనసాగాల్సి వస్తోంది. నా హోదా వల్ల సాక్షులను ప్రభావితం చేయవచ్చనేది సీబీఐ అపోహ, ఆందోళన మాత్రమే. ఇందుకు వారిప్పటిదాకా ఎలాంటి ఆధారాలూ చూపలేదు. నా హోదాను నాకు వ్యతిరేకంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే నాటి నుంచీ నేను ఎంపీగానే ఉన్నాను. భవిష్యత్తులోనూ కొనసాగుతాను. హోదా వల్ల బెయిల్ తిరస్కరించడం, జైల్లోనే ఉండాలనటం ఏమాత్రమూ చట్టబద్ధం కాదు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకూ విరుద్ధమే. నిందితుడు దర్యాప్తులో జోక్యం చేసుకోనప్పుడు, సాక్షులను ప్రభావితం చేయనప్పుడు, దర్యాప్తు పరిధి నుంచి పారిపోనప్పుడు బెయిలివ్వచ్చని, స్వేచ్ఛగా తిరగనివ్వచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ నా విషయంలో కింది కోర్టు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అరెస్టు చేయొచ్చని సుప్రీం చెప్పింది. ఈ కేసులో అలాంటివేమీ లేవు. ఒక వ్యక్తి స్వేచ్ఛను నిరోధించడమంటే అతన్ని శిక్షించడమే అవుతుంది. సీబీఐ దర్యాప్తు కూడా దాదాపు పూర్తి కావచ్చినందున నాకు బెయిలిస్తే వారికి, దర్యాప్తుకు ఇబ్బందేమీ లేదు. నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. సిట్టింగ్ ఎంపీని. రాజకీయ పార్టీ అధ్యక్షుడిని. సాక్షులను ప్రభావితం చేయడం జరగనే జరగదు’’ అని జగన్ వివరించారు.
Share this article :

0 comments: