ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వైఎస్ విజయమ్మ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వైఎస్ విజయమ్మ లేఖ

ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వైఎస్ విజయమ్మ లేఖ

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012


* దర్యాప్తు సంస్థలు ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచిస్తూ.. దాన్ని తమ తప్పుడు పనులకు ఆపాదిస్తున్నాయి
* జగన్ ఎంపీ కనుక, పార్టీ అధ్యక్షుడు కనుక సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ అంటోంది
* గత తొమ్మిది నెలలుగా ఆయన ఎంపీగా లేరా? పార్టీ అధ్యక్షుడిగా లేరా?
* కోర్టు ఉత్తర్వుల్లో ‘ప్రభుత్వం’ అని ఉంటే.. సీబీఐ దాన్ని తొలగించి వైఎస్ పేరు చేర్చింది
* నిర్ణయాలకు కేబినెట్ మొత్తం బాధ్యత వహించాల్సి ఉన్నా.. నెపం వైఎస్‌పైకి నెట్టేస్తోంది
* ఇప్పటికైనా జోక్యం చేసుకుని సీబీఐని నిబంధనల ప్రకారం నడచుకోవాలని చెప్పండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు మరో లేఖ రాశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, తన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం, అంతకుముందు నుంచే పలు రకాలుగా వేధింపులకు గురిచేయడంలాంటి వివరాలను ఆమె ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ప్రధానికి రాసిన ఈ లేఖను ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత జగన్‌పై ఒక పథకం ప్రకారం ఎలా వేధింపులు కొనసాగుతున్నాయన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజకీయంగా కక్ష సాధింపు కోసం సీబీఐని సాధనంగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్‌పై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై గత ఏడాది ఆగస్టు 20న ఒకసారి, ఆ తర్వాత జనవరి 12న మరోసారి రాసిన లేఖల విషయాన్ని ప్రధానికి రాసిన తాజా లేఖలో గుర్తుచేశారు. ఈ తరుణంలో ప్రధాని తమకు న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని సీబీఐని ఆదేశించాలని విన్నవించారు. లేఖ పూర్తి పాఠమిదీ..

గౌరవనీయులైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి,
అయ్యా!

కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో సృష్టిస్తున్న అడ్డంకుల గురించి మీ దృష్టికి మళ్లీ ఒకసారి ఈ లేఖ ద్వారా తీసుకొస్తున్నాను. ఇక్కడ దర్యాప్తు సంస్థలు ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచిస్తూ తాము చేసే తప్పుడు పనులకు ఆపాదించుకుంటున్నాయి. వ్యక్తుల కదలికలను, వారి భావ ప్రకటనా స్వేచ్ఛను నిరోధించే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఒక మౌన సాక్షిగా నిలుస్తోంది.

ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి భార్యగా పులివెందుల నియోజకవర్గం శాసనసభ్యురాలిగా నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. అంతేకాదు, ఈ నెల 12వ తేదీ వరకూ ప్రజల మధ్య ఉండే అవకాశాన్ని నష్టపోయిన ఒక పార్లమెంటు సభ్యుని తల్లిగా ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

సార్, రాష్ట్రంలో నేడు సీబీఐ సృష్టించిన జటిలమైన పరిస్థితిపై నేను మిమ్మల్ని కొన్ని సాధారణమైన ప్రశ్నలు అడగదలిచాను. వాటికి మీరూ, మీ మంత్రివర్గమూ సమాధానం చెప్పాలి. రాజకీయ కుట్ర, వేధింపులతో కూడుకున్న సీబీఐ ఉద్దేశం ఏమిటనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. 9 నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ జగన్‌ను ఒక్కసారి కూడా విచారణకు పిలువలేదు. కానీ 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న కీలకమైన సమయంలో మే 25వ తేదీన ఆయనను విచారణ కోసం సీబీఐ పిలిచింది. అది కూడా సీబీఐ కోర్టు తన ముందు వ్యక్తిగతంగాగానీ, ప్లీడరు ద్వారాగానీ హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిన తర్వాత, హాజరు కావాల్సిన తేదీకి మూడు రోజులు ముందుగా మాత్రమే! సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లలో అరెస్టు చేయాలన్న ఉద్దేశం ఏ మాత్రం లేదని తెలుస్తోంది. సీబీఐ నోటీసు ప్రకారం మూడు రోజుల ఉప ఎన్నికల ప్రచారాన్ని వదిలేసి వచ్చి వారికి ఆయన సహకరించారు. గత నెల 27న ఆదివారం రోజున కూడా రమ్మంటే వెళ్లి వారికి అన్నివిధాలా సహకరించారు. అయితే ఆయనను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.

జగన్ ఒక ఎంపీ కనుక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కనుక తన హోదాలతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సాకుతో అరెస్టు చేశారు. నేనిక్కడ మిమ్మల్ని ఒక్కటే అడగదలుచుకున్నాను. సీబీఐ దర్యాప్తు చేస్తున్న గత తొమ్మిది నెలలుగా జగన్ ఈ పదవుల్లో లేరా? ఆయన గత తొమ్మిది నెలలుగా ఎంపీగా లేరా? పార్టీ అధ్యక్షుడిగా లేరా? ఇక భవిష్యత్తులో కూడా ఆయన ఈ పదవుల్లో ఉంటారు కదా? అంటే ఎంపీ, ఒక పార్టీకి అధ్యక్షుడు అన్న కారణంగా తమకు ఇష్టం వచ్చినట్లు ఆయన్ను అరెస్టు చేసే స్వేచ్ఛ వారికి ఉందనుకుంటున్నారా? దేవుడికే తెలియాలి.. ఆయనను ఎంత కాలం జైల్లో పెడతారో.. ఇదేనా మన ప్రజాస్వామ్యం? ఆయన అధికార పార్టీ ఎంపీకాదు, పైగా అధికార పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. అప్రజాస్వామికంగా ఇలాంటి వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. జైలులో సందర్శకులనూ, కుటుంబ సభ్యులనూ కలిసే పరిస్థితి కూడా లేకుండా భయానకమైన వాతావరణాన్ని నెలకొల్పారు.

జగన్ ఎంపీగానూ, పార్టీ అధ్యక్షుడిగానూ ఉన్నందువల్ల సాక్షులను ప్రభావితం చేస్తారు కనుకనే అరెస్టు చేశామని సీబీఐ కారణం చూపుతోంది. విచారణ ప్రారంభం అయినప్పటి నుంచీ ఒక్క సాక్షిని కూడా ఆయన ప్రభావితం చేయలేదు. పైగా ఆయన ఇప్పటికీ అవే పదవుల్లో ఉన్నారు కూడా. ఈ సాకుతో ఎంత కాలం సీబీఐ ఆయనను నిర్బంధిస్తుంది? ఈ పదవుల్లో భవిష్యత్తులో కొనసాగినంత కాలానికి జైలులోనే ఉంచుతారా?

ఉప ఎన్నికల ప్రచారంలో జగన్‌ను ప్రజల మధ్య లేకుండా చేసి ఆయన ప్రత్యర్థులకు మేలు చేసే విధంగా సీబీఐ వ్యవహరించడం అన్యాయం, అక్రమం. మీ ప్రభుత్వం కింద ఉంటూ సీబీఐ దురుద్దేశాలతో పనిచేస్తున్నందుకు మందలించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. జూన్ 12వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో మమ్మల్ని ఇరకాటమైన పరిస్థితుల్లోకి నెట్టడమే కాకుండా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు మాపై కక్ష సాధింపు వైఖరిని అవలంబించాయి. జగన్ స్థాపించిన ‘సాక్షి’ మీడియా గ్రూపు బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపజేసింది. ఆ వెంటనే ‘సాక్షి’ టీవీ చానల్, పత్రికకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఆపివేసింది.

సార్, ప్రస్తుత కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ క్లుప్తంగా మీకు ఇక్కడ మళ్లీ గుర్తు చేస్తున్నాను. జగన్ సంస్థల్లో పెట్టుబడులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టుకు లేఖ రాశారు. టీడీపీ నేతలు అందులో వేరే పిటిషన్ ద్వారా ఇంప్లీడ్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన 26 జీవోల ఫలితంగానే ప్రజాధనం లూటీ జరిగిందని, తద్వారా లబ్ధిపొందిన వారు ‘సాక్షి’ మీడియా గ్రూపులో పెట్టుబడులు పెట్టారని అందులో ఆరోపణలు చేశారు. ఇదంతా ‘క్విడ్ ప్రో కో’ (ఫలానికి ప్రతిఫలంగా)గా జరిగినట్లు ఆరోపించారు. ఇదంతా కూడా జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొద్ది రోజులకే జరిగింది.

కానీ సీబీఐ చాలా తెలివిగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి ‘ప్రభుత్వం’ అనే పదాన్ని తొలగించి దానికి బదులుగా జగన్ తండ్రి, నా భర్త అయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆ స్థానంలో చేర్చింది. అంతే కాదు, నా కుమారుడు తన తండ్రిని ప్రభావితం చేసి ఇదంతా చేయించాడనే వాదనను లేవనెత్తింది. తీసుకున్న నిర్ణయాలన్నిటికీ బాధ్యత 45 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర మంత్రివర్గానిదే తప్ప వైఎస్ ఒక్కరిదే కాదు అనే విషయాన్ని పక్కన బెట్టారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో కూడా నివసించే వారు కాదు. ఆయన తన కుటుంబంతో బెంగళూరులో నివసించే వారు. తన తండ్రి మృతి చెందే వరకూ కూడా ఆయన అక్కడే ఉండే వారు. పైగా ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయం గతంలో అనుసరించిన విధానాల ప్రకారమే మంత్రివర్గ సహచరులందరి నిర్ణయం మేరకే జరిగింది.

జగన్ ఒక్కసారైనా రాష్ట్ర సచివాలయం లేదా కనీసం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోకి అడుగుపెట్టాడని గానీ, తమను ప్రభావితం చేశాడని గానీ - ఏ మంత్రీ లేదా ఐఏఎస్ అధికారి చెప్పలేదు. అటువంటప్పుడు మంత్రివర్గాన్ని ప్రభావితం చేశాడని ఎలా చెప్పగలరు? అవన్నీ మంత్రివర్గ సమష్టి నిర్ణయాలే తప్ప ముఖ్యమంత్రి ఒక్కరే తీసుకున్న నిర్ణయాలు కావు. అయినా మంత్రివర్గ సమావేశం ఎలా జరుగుతుందో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు!

గత కొన్నేళ్లుగా నడుస్తున్న ఫ్యాక్టరీకి మంచినీటి సరఫరా మంజూరు లాంటి అతి మామూలు నిర్ణయాలు, లీజులు లేదా అనుమతుల మంజూరు లాంటి ఇతరేతర నిర్ణయాలను ఏదైనా ఆశించి చేస్తారా? ఇటువంటి ప్రయోజనాలు సమకూర్చినందుకు క్విడ్ ప్రో కో కింద దేశంలోనే 8వ అతిపెద్ద సర్క్యులేషన్ ఉన్న ‘సాక్షి’ దినపత్రికలో పెట్టుబడులు పెట్టారని అనడం వాస్తవాన్ని పరిహసించడం, తప్పుడు వాదన చేయడం కాదా! సాక్షిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న పెట్టుబడిదారులు - ఈ పత్రిక ప్రారంభానికి ముందే - అన్ని విషయాలు తెలిసిన వారు. ‘సాక్షి’కి పోటీగా ఉన్న ‘ఈనాడు’ దినపత్రిక అంచనా విలువ 6,800 కోట్ల రూపాయలని, అది 1,800 కోట్ల నష్టాలతో ఉన్నదని, అయినా ఆ పత్రిక తన వంద రూపాయల ముఖవిలువున్న షేర్‌ను 5,28,000 రూపాయల చొప్పున అమ్మిన విషయం - సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ - ఏడు నెలల ముందే తెలుసు. అటువంటప్పుడు వారు క్విడ్ ప్రో కో కింద దేశంలో భారీ సర్క్యులేషన్ ఉన్న ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని అనడం ఎలా సమంజసమవుతుంది?

సుదీర్ఘ కసరత్తు, పక్కా ప్రణాళిక అనంతరం ప్రపంచంలోనే అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభమైంది. పత్రికా ప్రపంచంలోనే ఖ్యాతి గాంచిన మారియో గార్షియో దీనికి రూపకర్తగా ఉన్నారు. అంతేగాక ‘ఈనాడు’ దినపత్రిక షేర్స్‌లో సగం కంటే తక్కువ విలువకే ‘సాక్షి’ వాటాలు అందుబాటులో ఉన్నాయి. పది రూపాయల ముఖవిలువ గలిగిన ‘సాక్షి’ వాటాలను 350 రూపాయలకు విక్రయించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో వాటాలు కొనడం పెద్ద లాభసాటిగా పెట్టుబడిదారులు భావించారు. ఇక్కడ తాము కొనుక్కున్న వాటాలపై వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారు తమ ఇష్టమొచ్చిన వారికి అమ్ముకోవచ్చు. దానిపై కంపెనీ నియంత్రణేమీ ఉండదు. అటువంటప్పుడు వాళ్లందరూ తమ బినామీలని ఎవరైనా ఎలా అంటారు? ‘సాక్షి’ వాటాల వ్యవహారంలో సీబీఐ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోంది.

ఓ పక్క సాక్షి వాటాలకు ఎటువంటి విలువా లేదంటూనే మరోపక్క జగన్‌మోహన్‌రెడ్డి ఈ షేర్ల వల్ల అపార లబ్ధిపొందారని చెబుతోంది. ‘సాక్షి’ దినపత్రిక ప్రస్తుతం దేశం మొత్తం మీదున్న పత్రికల్లో 8వ స్థానంలో ఉంది. కోటీ 42 లక్షల 29 వేల మంది పాఠకులతో (సోర్స్ - ఐఆర్‌ఎస్ క్యూ4, 2011) 14.57 లక్షల సర్క్యులేషన్ (సోర్స్ - ఏబీసీ జూలై-డిసెంబర్)తో ప్రస్తుతం సాక్షి పత్రిక ప్రజల్లో ఉంది. పత్రిక పెరుగుదలతో పాటే దాని వాటా విలువ కూడా పెరుగుతున్నందున పెట్టుబడిదారులు కూడా సహజంగానే లాభపడతారు.

ఏబీసీ చైర్మన్‌గా ‘ఈనాడు’ గ్రూప్‌కు చెందిన సీహెచ్ కిరణ్ ఉన్నప్పుడు ‘సాక్షి’ రేటింగ్‌ను తిరస్కరించారు. అతికష్టంమీద ఆ తర్వాత ఏబీసీ రేటింగ్‌ను ‘సాక్షి’ సాధించడం గమనించాలి. ఈ వ్యవహారమై మేం కోర్టుకు వెళ్లాం. చివరకు కిరణ్ దిగిపోయిన తర్వాతగానీ మాకు ఈ రేటింగ్ రాలేదు. ఇంత జరిగినా, మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా లేకున్నా ‘సాక్షి’ దినపత్రిక విజయపథంలో కొనసాగుతోందంటే దీని వెనుకుండే కష్టమేమిటో ఒక ఆర్థిక వేత్తగా మీకు తెలియంది కాదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టుఐ క్యాపిటల్, ప్లూరీ ద్వారా మారిషస్, తదితర దేశాల నుంచి పెట్టుబడులు తరలించారని సీబీఐ ఆరోపిస్తున్నది. వాస్తవానికి సీబీఐ ప్రస్తావిస్తున్న కంపెనీలు ఆర్‌బీఐ ఆమోదం ఉన్నవి. సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగినవి. ఇవే కంపెనీలు ఐడియా సెల్యులార్, గాయత్రీ ప్రాజెక్టులు తదితర అతిపెద్ద కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవే. సీబీఐ చెబుతున్నట్టుగా ఆ కంపెనీలు పెట్టిన 124 కోట్ల రూపాయలు తనవే అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నిధులకు తానే అత్యధిక రేటు పెట్టి వాటాల రూపంలో కొనుక్కుంటారా?

మరో విస్మయకర విషయమేమంటే ఆస్తుల వ్యవహారంలో ఒకే ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైతే సీబీఐ మాత్రం బహుముఖ చార్జిషీట్లను దాఖలు చేయడం. సీబీఐ దురుద్దేశంతో వ్యవహరిస్తోందనే దానికిది నిదర్శనం. ఇలా పలు చార్జిషీట్లను దాఖలు చేయడం ద్వారా వీలైనంత ఎక్కువగా వేధించాలని, సుదీర్ఘ కాలం విచారణ కొనసాగేలా చూడాలన్న దుర్బుద్ధితో సీబీఐ వ్యవహరిస్తోంది.

సార్, మనకున్న అత్యుత్తమ వ్యవస్థల్లో ప్రజాస్వామ్యం ఒకటి. అటువంటి ప్రజాస్వామ్య దేశానికి మీరు సర్వోత్తమ కార్యనిర్వహణాధికారి. ఈ కుట్రలు, కుతంత్రాలు మీకు తెలియవని అనుకోలేను. అయినప్పటికీ, దురదృష్టవశాత్తూ మీరు ఈ అరాచక చర్యలను అరికట్టడంలో మిన్నకుండిపోయారు. మీ నీతినిజాయతీలను, చిత్తశుద్ధిని ఈ దేశంలో ఎవరూ శంకించలేరు. కానీ మేం మీ నుంచి ఆశిస్తున్నదీ, కోరుతున్నదీ న్యాయం.

ఈ దశలో దయచేసి మీరు జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందిగా సీబీఐని ఆదేశించాల్సిందిగా కోరుతున్నాను.
ఇట్లు,
వైఎస్ విజయమ్మ

Share this article :

0 comments: