ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడింది

ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడింది

Written By news on Wednesday, July 25, 2012 | 7/25/2012

వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదం
టెండర్లలో పెరిగిన రూ.477 కోట్లు ప్రభుత్వానికి ముడుపుల కోసమే
సీఎం కార్యాలయంలోనే ప్రభుత్వేతర వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారు
సోమాతో కలిసిన చైనా కంపెనీపై ఉగ్రవాద శిక్షణ ఆరోపణలున్నాయి
ఆ కంపెనీ అవకతవకల వల్ల సూడాన్‌లో నిషేధించారు కూడా
వెంటనే ఆ టెండర్లు రద్దు చేయాలి లేదా ఫైళ్లు అఖిలపక్ష కమిటీ ముందుంచాలి
సీఎం స్వయంగా తనపై విచారణ జరిపించుకోవాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నందున వాటిని రద్దు చేసి తాజాగా పిలవాలని, లేదా ఫైళ్లను అఖిలపక్ష కమిటీ ముందుంచి పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిది నెలల కాలంలోనే రూ.477 కోట్ల మేరకు వ్యయాన్ని పెంచి టెండర్లను వేయడమంటే ఆ పెరిగిన మొత్తం ప్రభుత్వానికి ముడుపులు చెల్లించడానికేననేది స్పష్టమవుతోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్టీలు, సిమెంటు ధరలు గత తొమ్మిది నెలల్లో ఒక్క శాతం కూడా పెరగలేదని, డిజైన్ కూడా మారలేదని, అలాంటిది వ్యయం 477 కోట్ల రూపాయలు ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఇలా అక్రమాలకు పాల్పడ్డం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఎం కార్యాలయంలోనే: ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు నాన్ స్టేట్ ప్లేయర్లు(ప్రభుత్వానికి సంబంధంలేని వ్యక్తులు) ఇందులో జోక్యం చేసుకుని అంచనా వ్యయాన్ని పెరిగేలా చేశారని, ఆ డబ్బును కచ్చితంగా ముడుపులుగా చెల్లించడానికే పెంచారన్నది నిర్వివాదాంశమని మైసూరా అన్నారు. టెండర్లపై ముఖ్యమంత్రి, హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటారని సాగునీటి శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని వ్యక్తులే రింగ్ కుదిర్చినట్లుగా ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నపుడు ఆయనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి ప్రకటించడం సరికాదన్నారు. కేవలం ఒక కంపెనీకి సాయం చేసేందుకే ఇలా జరుగుతోందనే అనుమానాలున్నాయని అన్నారు. తొమ్మిది నెలల క్రితం ‘సూ-పటేల్’ కంపెనీ రూ.4,122 కోట్ల వ్యయంతో ఈ టెండర్లను చేజిక్కించుకున్నపుడు వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతాయని ఆరోపణలు వస్తే వాటిని రద్దు చేశారని, ఇపుడు అవే పనులను రూ.477 కోట్ల ఎక్కువ వ్యయానికి ఇవ్వాలనుకోవడం అసంబద్ధమని ఆయన అన్నారు.

ఆ చైనా కంపెనీపై ఎన్నో ఆరోపణలు..

పలు కంపెనీలు టెండర్లు వేస్తే కేవలం సాంకేతిక అర్హత సాధించాయనే పేరుతో ‘సోమా-సీజీజీఎస్’, ‘సూ-పటేల్’ కంపెనీల టెండర్లను మాత్రమే తెరవడంలో ఔచిత్యమేంటని మైసూరా ప్రశ్నించారు. సోమాతో జత కలిసిన చైనా కంపెనీ సీజీజీఎస్‌పై అనేక ఆరోపణలున్నా, లోపాలున్నా అర్హత ఇచ్చారన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పనులు చేపట్టిన ఈ సంస్థ అక్కడ టైస్టులకు శిక్షణ ఇచ్చిందనే ఆరోపణలున్నాయని ఆయన అన్నారు. నేపాల్‌లో వందలాది కోట్ల రూపాయల వ్యాట్‌ను ఎగవేసిందని, సూడాన్‌లో చేసిన అవకతవకల వల్ల ఈ కంపెనీని అక్కడ నిషేధించారని మైసూరా వివరిస్తూ అందుకు సంబంధించిన పత్రాలను విడుదల చేశారు. పైగా ఈ కంపెనీ సాల్వెన్సీ సర్టిఫికెట్ కూడా చైనా బ్యాంకు నుంచి తెచ్చుకున్నదన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ బ్యాంకుల నుంచి పొందాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం రెండు కంపెనీల టెండర్లనే కాకుండా అన్ని టెండర్లు తెరిస్తే పారదర్శకంగా ఉంటుందన్నారు. మిగతా కంపెనీల ధరలు కూడా చూసి వాటి సాంకేతికతను పరిశీలించాల్సి ఉందన్నారు.

సీఎం విచారణకు సిద్ధపడాలి: ఇలా రింగ్ జరగడం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలున్నపుడు ముఖ్యమంత్రి తనకు తానే విచారణకు సిద్ధపడాలని మైసూరా డిమాండ్ చేశారు. అసలు సోమా, సూ కంపెనీల్లో ఎవరికి టెండర్లు లభించినా సగం, సగం పనులు చేపట్టేలా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒప్పందం కుదిరిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయన్నారు. అందువల్ల ఈ విషయంలో ముఖ్యమంత్రి తనంతట తానుగా తనపై విచారణకు ఆదేశించుకుంటే మంచిదన్నారు. సిరిసిల్ల సభకు విజయమ్మ తనవెంట బయటి నుంచి గూండాలను తీసుకువెళ్లారన్న ఆరోపణలో అర్థం లేదన్నారు. కొందరు అభిమానులు, తమ పార్టీ నాయకులే ఆమెతో వెళ్లారని మైసూరా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డికి నటుడు మోహన్‌బాబు బంధువు కనుక ఆయన్ను జైలులో పరామర్శించారని, ఒకవేళ ఆయన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని కూడా ఆయన ఇంకొక ప్రశ్నకు జవాబిచ్చారు. ఆరోపణలు, కోర్టు నోటీసులు ఎదుర్కొంటున్న రాష్ట్రమంత్రులు తమంతట తాముగానైనా నైతిక బాధ్యత వహించి వైదొలగాలని, లేకుంటే ముఖ్యమంత్రే వారిపై చర్య తీసుకోవాలని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని మరవడంతోపాటుగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైందన్నారు.
Share this article :

0 comments: