ఇక డీజిల్, గ్యాస్ బాదుడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక డీజిల్, గ్యాస్ బాదుడు!

ఇక డీజిల్, గ్యాస్ బాదుడు!

Written By news on Wednesday, July 25, 2012 | 7/25/2012

ఉపరాష్ట్రపతి ఎన్నిక కాగానే ముహూర్తం?

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరను లీటర్‌కు 70 పైసలు పెంచిన కేంద్ర ప్రభుత్వం,... డీజిల్ ధరను, గృహ వినియోగం కోసం వాడే వంటగ్యాస్ ధరను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్, వంటగ్యాస్‌ల ధరలనే కాక, కిరోసిన్ ధరను కూడా పెంచాలన్న అంశంపై పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమైందని, హెచ్చింపు ఎప్పుడు? ఎలా? అన్నదే ఇంకా నిర్ణయం కాలేదని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రజా వ్యతిరేకంగా పరిణమించే ఈ నిర్ణయానికి సంబంధించి, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి రాజకీయపరమైన మద్దతు లభించే అవకాశాలు లేనప్పటికీ, ధరల పెంపు ప్రతిపాదన తెరమీదకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రిటైల్ వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) అనుమతించకపోవ డం, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్‌లపై సబ్సిడీలకు కోత విధించడం ప్రభుత్వం ఇకపై తీసుకోబోయే ముఖ్యమైన సంస్కరణలని చమురు మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. 

ఆగస్ట్ 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగవలసి ఉన్నందున ఉపరాష్ట్రపతి ఎన్నిక లోగా, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశించే అవకాశాలున్నాయని, అయితే ఆ తర్వాత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమవుతాయని అయినప్పటికీ, అప్పుడైనా ధరలు పెంచడం తమకు తప్పనిసరి కావచ్చని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్ ధరలను గత ఏడాది జూన్ 25వ తేదీ తర్వాత ఇప్పటివరకూ పెంచలేదు. ముడిపదార్థమైన చమురు ధరలు పెరిగినా, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ తగ్గి, దిగుమతుల వ్యయం పెరిగినా, డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్ ధరలను మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకూ పెంచలేదు. తాజా పరిస్థితులలో లీటర్ డీజిల్‌ను రూ. 11.26 నష్టంతో, గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్(14.2 కేజీలు)ను రూ. 319 రూపాయల నష్టంతో విక్రయిస్తున్నామని ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు చెబుతున్నాయి. కిరోసిన్‌పై తాము లీటర్‌కు రూ. 28.56 దాకా నష్టపోతున్నట్టు ఆ కంపెనీలు పేర్కొంటున్నాయి. 

ఈ నేపథ్యంలో దరలు పెంచని పక్షంలో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంధనం అమ్మకాలపై లక్షా 60 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తుందని చెబుతున్నారు. ఈ అంశంపై సంబంధిత మంత్రుల సాధికార బృందం ఇంకా ఏర్పాటుకాని ప్రస్తుత పరిస్థితుల్లో, ధరల పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘానికి నివేదించాలని, నిర్ణయాన్ని ప్రధానమంత్రికి వదిలి వేయాలని చమురు మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్టు ఆ శాఖ అధికారి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరలు, రూపాయి విలువ పతనం నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్ ధరను 70 పైసలు పెంచాయి. తాజా పెంపు తర్వాత కూడా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 71 పైసల చొప్పున నష్టపోతున్నాయని, అయినప్పటికీ, మళ్లీ ధర పెంచి వినియోగదారులకు మరో షాక్ ఇవ్వదలచుకోలేదని ఆ అధికారి చెప్పారు. డీజిల్‌ను ధరల నియంత్రణనుంచి తప్పించాలని కేంద్ర మంత్రుల సాధికార బృందం 2010 జూన్ నెలలోనే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, విస్తృత వినియోగంలో ఉన్న డీజిల్ ధరపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతూ వస్తోందని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: