మార్గదర్శి ఎండీ శైలజపై కేసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మార్గదర్శి ఎండీ శైలజపై కేసు

మార్గదర్శి ఎండీ శైలజపై కేసు

Written By news on Saturday, July 7, 2012 | 7/07/2012

శైలజా కిరణ్, విజయవాడ బ్రాంచి మేనేజర్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఐపీసీ 406, 420, 509 సెక్షన్లు నమోదు చేసి విచారించాలని సూచన

విజయవాడ, న్యూస్‌లైన్: మార్గదర్శి చిట్స్ ఎండీ శైలజా కిరణ్‌పైన, ఆ సంస్థ విజయవాడ నగర బ్రాంచి మేనేజరు బండారు శ్రీనివాసరావుపైన కేసు నమోదు చేసి విచారించాలని విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నూతలకంటి జయరాజ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఓ భవనం కొనుగోలు విషయంలో నమ్మక ద్రోహం, మోసం చేయడమేకాక పరుష పదజాలంతో దూషించారంటూ గుణదలకు చెందిన వేమూరి హషిత చేసిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఐపీసీ 406, 420, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించాలని మాచవరం పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

ఫిర్యాదు ఇదీ.. 

విజయవాడ నగరంలోని పొట్టిస్వామి వీధికి చెందిన కూరపాటి సుభాషిణి భవనాన్ని కొనుగోలు చేసేందుకు హషిత 2007 జూన్ 17న ఆమెను సంప్రదించారు. ఈ ఆస్తి మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తనఖాలో ఉండటంతో వారిద్దరూ మార్గదర్శి చిట్‌ఫండ్ నగర బ్రాంచి మేనేజరును కలిశారు. సుభాషిణి తమ కంపెనీకి రూ.29,95,000 బాకీ ఉన్నట్లు మేనేజరు తెలిపారు. ఆ మొత్తాన్ని సుభాషిణి తరఫున నాలుగుదఫాలుగా చెల్లించేందుకు హషిత సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి 2007 ఆగస్టు 9న సుభాషిణితో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారు. కోర్టులో వివాదం పరిష్కారమైన వెంటనే ఆస్తిని తనకు అందజేసేలా కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నారు. 31-3-2008లోపు హషిత రెండు దఫాలుగా మార్గదర్శి చిట్‌ఫండ్‌కు రూ.20 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.9.95 లక్షలకు గవర్నర్‌పేట విజయాబ్యాంక్‌కు చెందిన ఖాళీ చెక్కు (331663) ఇచ్చారు.

దూషించిన మేనేజర్

తర్వాత 28-3-2009న రూ.3 లక్షలు చెల్లించిన హషిత ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ టైటిల్ డీడ్స్ తనకు ఇచ్చేస్తే మిగిలిన రూ.6,95,000 వెంటనే చెల్లిస్తానని బ్రాంచి మేనేజర్ శ్రీనివాసరావుకు చెప్పారు. తొలుత అందుకు అంగీకరించిన ఆయన తర్వాత మాటమార్చి రూ.8 లక్షలు చెల్లిస్తే టైటిల్ డీడ్స్ ఇస్తామన్నారు. దీనికి అంగీకరించని హషితను.. ఆస్తిని వేలం వేయిస్తామని బెదిరించటమేగాక దూషించారు. తర్వాత చిట్‌ఫండ్ నిర్వాహకులు రెండో అదనపు జిల్లా జడ్జి (మెట్రోపాలిటన్ సెషన్‌‌స జడ్జి) కోర్టులో సివిల్ దావా ఓఎస్ నం.55/2000, ఈపీ నం.8/2008 వేసి ఆస్తిని వేలం వేయించేందుకు సన్నద్ధమవుతున్నట్లు హషితకు తెలిసింది. దానికిముందే చిట్‌ఫండ్‌కు చెల్లించాల్సిన రూ.6,95,000ను హషిత కోర్టులో సుభాషిణి పేరుతో డిపాజిట్ చేశారు. అంటే.. సుభాషిణి చిట్‌ఫండ్‌కు చెల్లించాల్సిన రూ. 29,95,000ను ఒప్పందం ప్రకారం హషిత చెల్లించారు. తనకు నమ్మక ద్రోహం చేయడమేకాకుండా, మోసానికి పాల్పడి పరుష పదజాలంతో దూషించి, బెదిరించారని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చెరుకూరి శైలజాకిరణ్, విజయవాడ బ్రాంచి మేనేజర్ బండారు శ్రీనివాసరావులపై హషిత ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి నిందితులపై కేసు నమోదుచేసి విచారించాలని మాచవరం పోలీసులను ఆదేశించారు.
Share this article :

0 comments: