రిజర్వాయర్లు నిండుకున్నాయి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిజర్వాయర్లు నిండుకున్నాయి!

రిజర్వాయర్లు నిండుకున్నాయి!

Written By news on Wednesday, July 11, 2012 | 7/11/2012

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
మధ్యభారతంలోని రిజర్వాయర్లకు మినహాయింపు
84 ప్రధాన రిజర్వాయర్ల సామర్థ్యంలో 16 శాతం నీరు!
24 రిజర్వాయర్లలో సగానికంటే తక్కువ నీటి మోతాదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం... అరకొరవర్షాలతో దేశంలోని రిజర్వాయర్లు నిండుకుంటున్నాయి. ఖరీఫ్ పంట పనులు జోరందుకోవాల్సిన ఈ తరుణంలో రిజర్వాయర్లలో గత ఏడాదితో పోలిస్తే సగం కంటే తక్కువ నీరు నిల్వ ఉండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర జలవనరుల సంఘం లెక్కల ప్రకారమే ఈ ఏడాది దేశంలోని 84 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఒక్క గంగ, మాహీ, సబర్మతి నదీ పరీవాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో మాత్రమే సాధారణ నీటి మోతాదుకు మించి నీరు నిల్వ చేరగా, నర్మద, తపతి, మహానది పరీవాహక ప్రాంతాల్లోని డ్యాముల్లో నీటి నిల్వలు సాధారణ స్థితిలో ఉన్నాయి. ఇక కృష్ణా, గోదావరి, సింధు, కావేరీలతోపాటు దక్షిణాదిలో పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తున్న నదులపై నిర్మించిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోని మొత్తం 84 ప్రధాన రిజర్వాయర్ల పూర్తిస్థాయి నీటి నిల్వల మోతాదు 15,442.1 కోట్ల ఘనపు మీటర్లు (ఒక ఘనపు మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) కాగా ఈ నెల అయిదవ తేదీ నాటికి వీటిల్లో ఉన్న నీరు కేవలం 2,519 కోట్ల ఘనపు మీటర్ల మాత్రమే. ఇది మొత్తం నిల్వ సామర్థ్యంలో కేవలం 16 శాతం మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఇది సగం కంటే కొంచెం ఎక్కువ మాత్రమేనని అధికారులు అంటున్నారు. 

దక్షిణాది రాష్ట్రాలకు జీవనాధారమైన గోదావరి, కృష్ణ, కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు గత ఏడాది ఇదే సమయానికి ఉన్న నిల్వల్లో సగానికిపైగా తక్కువ ఉండటం ఆందోళన కలిగించే అంశం. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్ల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1,509 కోట్ల ఘనపు మీటర్లు ఉండగా జూలై అయిదవ తేదీ నాటికి కేవలం 140.5 కోట్ల ఘనపు మీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. కృష్ణా నదిపైని రిజర్వాయర్లలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ రిజర్వాయర్ల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 3,154.8 కోట్ల ఘనపు మీటర్లు. గత గురువారం నాటికి కేవలం 406.7 కోట్ల ఘనపు మీటర్ల నీళ్లు మాత్రమే చేరినట్లు కేంద్ర జల వనరుల సంఘం గుర్తించింది. గత ఏడాదితో పోలిస్తే గోదావరిలో సగం, కృష్ణాలో 70 శాతం వరకూ నీళ్లు తక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, తాగు, సాగు నీటికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని జల వనరుల సంస్థ రాష్ట్రాలను హెచ్చరించినట్లుగా వార్తలొస్తున్నాయి. భూగర్భ జలాల వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టాలని కూడా సూచించింది.
Share this article :

0 comments: