సామాన్యునికి పట్టపగలే చుక్కలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సామాన్యునికి పట్టపగలే చుక్కలు

సామాన్యునికి పట్టపగలే చుక్కలు

Written By news on Wednesday, July 11, 2012 | 7/11/2012

చుక్కలనంటిన నిత్యావసరాలు
ఏడిపిస్తున్న కూరగాయల ధరలు 
తొలకరితో పాటే తగ్గాల్సింది పోయి.. పైపైకి
గుడ్లు తేలేస్తున్న సామాన్యుడు
ఏడాదిలోనే భారీగా పెరిగిన వైనం
రూ.21 పెరిగిన వేరుశనగ నూనె
పామాయిల్, రైస్‌బ్రాన్‌దీ అదే తీరు
రూ.5 పెరిగిన పొద్దుతిరుగుడు నూనె
క్వింటాలు రూ.600 పెరిగిన సన్న బియ్యం
రూ.37 నుంచి రూ.70కి చేరిన శనగపప్పు
రూ.15 ఉన్న టమాట ఇప్పుడు రూ.30
రూ.20 నుంచి రూ.50కి చేరిన పచ్చి మిర్చి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వండుకునే బియ్యం నుంచి వంట నూనెల దాకా. కూరగాయల నుంచి పప్పులూ చక్కెర దాకా. అన్నింటి ధరలూ చుక్కలనంటుతున్నాయి. సామాన్యునికి పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. అన్నదాతల నుంచి అతి చవగ్గా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు, వ్యాపారులు ఆ తర్వాత ప్రదర్శించిన మాయాజాలంతో రాష్ట్రంలో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ధరల నియంత్రణపై సర్కారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వాటికి మరింతగా ఆజ్యం పోసింది. దాంతో బియ్యం ధరలకు మూడేళ్లుగా ఎన్నడూ లేనంతగా రెక్కలొచ్చాయి. సన్నరకం ధరయితే ఏడాదిలోనే క్వింటాలుకు ఏకంగా రూ.600 దాకా పెరిగిపోయింది. శనగపప్పు ధర కూడా ఏడాదిలోనే రెట్టింపైంది. ఇక వేరుశెనగ నూనె కూడా ఏడాదిలోనే 21 రూపాయలు పెరిగింది. మిగతా నూనెలదీ అదే దారి. వీటన్నింటినీ మించి కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యునికి ఏమాత్రమూ అందుబాటులో లేకుండా పోయాయి. ఏ నెలకు ఆ నెల భారీగా పెరిగిపోతూ సగటు జీవి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేసి వదులుతున్నా సర్కారుకు మాత్రం పట్టడం లేదు.

వామ్మో సన్నాలు..

గతేడాదితో పోలిస్తే సన్న బియ్యం ధరలు క్వింటాలుకు సగటున రూ.600 పెరిగాయి. ఏడాది క్రితం రూ.2,600-2,800 ఉన్న మేలు రకం సన్న బియ్యం ప్రస్తుతం గరిష్టంగా రూ.3,200-3,400 పలుకుతోంది. దాంతో రెండో రకం సన్న బియ్యం, సాధారణ బియ్యం ధరలు కూడా ఇదే తీరుగా పెరుగుతున్నాయి. వ్యాపారుల పేరాశే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. కారుచౌకగా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వారు భారీగా నిల్వ చేసినా, కొంచెం కొంచెగా బియ్యంగా మార్చి మార్కెట్లోకి వదులుతూ ధరలను ఇష్టానికి పెంచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

‘పప్పులు’డకటం లేదు..

పప్పుల ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఏడాది క్రితం కిలో రూ.36 ఉన్న శనగ పప్పు ఇప్పుడు ఏకంగా రూ.70కి చేరింది. బాగా డిమాండ్ ఉండే కందిపప్పు కూడా రూ.62 నుంచిరూ.67కు పెరిగింది. పెసర పప్పు రూ.65 నుంచి 70కి, మినప్పప్పు 64 నుంచి 70కి పెరిగాయి. ఈ రెండింటి ధరలు గత నెల రోజుల్లోనే కిలోకు రూ.5 నుంచి 6 దాకా పెరిగి గుబులు రేపుతున్నాయి. కరువు వల్ల గతేడాది పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. 2010-11లో 15 లక్షల టన్నులు ఉత్పత్తవగా గతేడాది 12 లక్షల టన్నులకే పరిమితమైంది. ఉత్పత్తి తగ్గుతుందని ముందే అంచనాలున్నా ధరల నియంత్రణ పర్యవేక్షణను పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పూర్తిగా పక్కన పెట్టారు. దాంతో వ్యాపారులు ‘ముందు’చూపుతో వ్యూహాలకు పదును పెట్టారు. భారీగా పప్పు నిల్వలను అక్రమంగా పోగు చేశారు. చాలామంది నేరుగా రైతుల నుంచి పప్పు ధాన్యాలను కొనుగోలు చేసి, వాటిని పప్పుగా మార్చి అక్రమంగా నిల్వ చేశారు. వాటినిప్పుడు కొద్ది కొద్దిగా మార్కెట్‌లోకి విడుదల చేస్తూ ధరలను ఇష్టానికి పెంచుతున్నారు. ఈ అక్రమాలకు అధికారులు కూడా యథాశక్తి తోడ్పడుతున్నారు.

మంట నూనెలు..

వంట నూనెల ధరలు వంటింట్లో ఏకంగా మంటలే రాజేస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ నివేదిక ప్రకారం చూసినా అవి నెలనెలా పెరగడమే గానీ తగ్గడమన్న మాటే లేదు. ప్రభుత్వరంగంలోని నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఆయిల్‌ఫెడ్) మార్కెటింగ్ చేసే ‘విజయ’ వేరుశనగ నూనె ఏడాది క్రితం లీటరు రూ.93 ఉండగా ఇప్పుడు రూ.114కు పెరిగింది. డిమాండ్ బాగా ఉండే వేరుశనగ నూనె ధర పెరగడంతో మిగతా నూనెల ధరలూ ఎగబాకాయి. ఏడాదిలో పొద్దుతిరుగుడు నూనె కిలోకు రూ.5.5, పామాయిల్ నూనె రూ.6.5, రైస్ బ్రాన్ నూనె రూ.7 పెరిగాయి. మనం పామాయిల్ దిగుమతి చేసుకునే మలేసియా, సింగపూర్, ఇండోనేసియాల్లో వరదల వల్ల గతేడాది దిగుబడి తగ్గడం కూడా ప్రతికూలంగా మారింది. మన దగ్గర కరువు వల్ల వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల దిగుబడీ గతేడాది ఏకంగా 7 లక్షల టన్నులు తగ్గింది! ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకున్న వ్యాపారులు సరుకును గోదాముల్లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధరలు పెరిగేలా చేస్తున్నారు. ఇలాంటప్పుడు సామాన్యుడిని ఆదుకోవాల్సిన ఆయిల్‌ఫెడ్ కూడా ఫక్తు వ్యాపార దృక్పథం ప్రదర్శిస్తూ ప్రైవేటుకు పోటీగా ధరలు పెంచుతోంది.

కూర‘గాయాలు’..

ఇతర నిత్యావసరాలతో పోలిస్తే కూరగాయల ధరలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అదీ ఇదీ అని కాకుండా అన్నింటి ధరలూ ఇటీవల అమాంతంగా పెరిగాయి. కూరగాయల ధరలు వేసవిలో పెరిగినా వర్షాలు మొదలయ్యే సమయంలో కాస్త తగ్గడం పరిపాటి. కానీ సర్కారు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయకపోవడం, బహిరంగ మార్కెట్‌లో వాటి ధరలు భగ్గుమంటుండటంతో కూరగాయల సాగుపై రైతులు అనాసక్తంగా ఉన్నారు. ఈ ఏడాది వాటిని పెద్దగా సాగు చేయలేదు. కరెంటు కోత వంటివి కూడా ఇందుకు తోడయ్యాయి. దాంతో ఖరీఫ్‌లో కూరగాయల పంటల సాగు ఆశించిన స్థాయిలో లేక, డిమాండ్‌కు సరిపడా దిగుబడి రాక వాటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
Share this article :

0 comments: