ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసింది

ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసింది

Written By news on Monday, July 9, 2012 | 7/09/2012

సర్కారు ఆంక్షలతో తగ్గిపోతున్న వైద్య సేవలు 
రోజూ 800 సర్జరీలు దాటరాదని నియంత్రణ 
వ్యయం రూ. 3 కోట్లు మించరాదని నిబంధన 
ఆరోగ్యశ్రీ అధికారులకు మౌఖిక ఆదేశాలు 
రెండేళ్లలో 20 శాతం తగ్గిపోయిన సర్జరీలు 
కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సల జాబితా
కుదింపుతో పేద రోగులకు నానాతిప్పలు 
‘గ్రీవెన్స్ సెల్’కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: నిరుపేదల సంజీవని ఆరోగ్యశ్రీ పథకం అమలులో నీరుగారిపోతోంది. వైద్యం కోసం పేద రోగుల కష్టాలు మళ్లీ మొదటికొస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 133 జబ్బులకు చికిత్సలను కార్పొరేట్ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించటం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయా చికిత్సలు అందించే సౌకర్యాలు లేకపోవటం.. రోజుకు 800 సర్జరీల కంటే ఎక్కువ అనుమతులు ఇవ్వకూడదని సర్కారు షరతులు పెట్టటం.. వ్యయం రూ. 3 కోట్లకు మించకూడదని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇవ్వటం.. సర్జరీలకు చెల్లించే ధరలు పెంచితే కానీ సర్జరీలు చేయలేమని కార్పొరేట్ ఆస్పత్రులు తిరస్కరిస్తుండటం.. వెరసి పేద రోగులకు ఆరోగ్యశ్రీ ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. రోగాల జాబితా తగ్గించినప్పటి నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయటం తగ్గిపోయింది. ప్రభుత్వమే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ఎంపానల్‌మెంట్ నుంచి తొలగించింది. దీంతో ఆయా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకోవటం తగ్గించేశాయి. మరోవైపు రోగులు చికిత్స చేయించుకోవటానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. వైద్యులు ఉంటే వైద్య పరీక్షలకు, శస్త్రచికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. సదుపాయాల కల్పనకు వైఎస్ హయాంలో విడుదల చేసిన నిధులు మూడేళ్లుగా మురిగిపోతున్నాయి. దీంతో తీవ్రమైన జబ్బులకు గురైన పేద రోగులు ఆస్పత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆస్పత్రుల గేట్ల వద్దే పడిగాపులు పడుతున్నారు. 2009కి ముందున్న పరిస్థితికి ఇప్పడు అమలవుతున్న ఆరోగ్యశ్రీకి ఎంతో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఈ పథకంపై పెద్దగా ఫిర్యాదులు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ గ్రీవెన్స్ సెల్‌కు రోజూ వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో డబ్బులు అడుగుతున్నారని, అప్రూవల్స్ ఇవ్వడంలేదని, ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు లేక ఆపరేషన్ చేయడం లేదన్న ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 

శస్త్రచికిత్సలపై నియంత్రణ... 

ఆరోగ్యశ్రీ పథకంలోని లోపాలను సరిచేసి మరింత పటిష్టవంతంగా అమలు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలే దానికి తూట్లు పొడుస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద సర్జరీలపై నియంత్రణ విధించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులకు పైనుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. వైఎస్ హయాంలో 2007లో మూడు జిల్లాల్లో ప్రారంభమైన ఈ పథకం 2008 చివరి నాటికి అన్ని జిల్లాల్లో అమలవుతోంది. 2009 చివరి వరకూ బాగానే కొనసాగింది. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల వల్ల ఒక్కసారిగా పథకం అమలులో స్తబ్దత మొదలైంది. రోజూ 800 శస్త్రచికిత్సలకంటే ఎక్కువ జరగకూడదని, రోజూ రూ. 3 కోట్లకు మించి వ్యయం రాకుండా చూడాలన్న ఆదేశాలు అందిన కారణంగానే సర్జరీలపై సీలింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. నిర్దేశించిన సంఖ్య దాటితే ఆపరేషన్లకు అనుమతి ఇవ్వడం లేదు. 2009 నాటికి రోజుకు 1,200 పైగా శస్త్రచికిత్సలు జరిగేవి. రోజుకు ఐదు కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చయ్యేవి. 

కార్పొరేట్ ఆస్పత్రుల వైఖరిలో మార్పు... 

ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసే జాబితాను తగ్గించటంతో పాటు.. చికిత్సలు, వ్యయంపై నియంత్రణ విధించటం వల్ల.. ఈ పథకం కింద వస్తున్న పేద రోగుల పట్ల కార్పొరేట్ ఆస్పత్రుల దృష్టికోణం మారింది. రోగులు రోజులకు రోజులు పడిగాపులు కాయడం, డబ్బులు చెల్లిస్తే తప్ప వారికి వైద్యం లభించని సంఘటనలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. క్యాన్సర్, గుండె జబ్బులు మినహా ఇతర జబ్బులతో బాధపడుతున్న రోగులను కార్పొరేట్ ఆస్పత్రుల్లో పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆర్థోపెడిక్, న్యూరో సంబంధిత వ్యాధుల బాధితులు అనేక కష్టాలు పడాల్సివస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స చేయిస్తామని ఆర్భాటం చేసి 133 జబ్బులను కార్పొరేట్ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించటంతో ఆ జాబితా పరిధిలోకి వచ్చే రోగుల బాధ వర్ణనాతీతంగా మారింది. పలు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను చేర్చుకోవడానికి తిరస్కరిస్తోంటే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక సర్జరీలు జరగడం లేదు. 

గ్రామీణుల నరక యాతన... 

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 263 ప్రైవేటు ఆస్పత్రులు, 145 ప్రభుత్వ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు చేసే ప్యానెల్ జాబితాలో ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కార్పొరేట్ ఆస్పత్రులు 70 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. క్యాన్సర్, ట్రామా, గుండె జబ్బులు వంటి పెద్ద వ్యాధులకు 80 శాతం మంది ఇక్కడికే వస్తారు. కానీ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కేసులు అనగానే హైదరాబాద్‌లోని ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో తిరస్కరిస్తున్నారు. రోజూ 30 శాతం కేసులు తిరస్కరణకు గురవుతున్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. డాక్యుమెంట్లు లేవని, బెడ్లు లేవని, పైనుంచి అప్రూవల్స్ రాలేదని ఇలా రకరకాల కారణాలతో రోగులను వెనక్కు పంపుతున్నారు. కొన్ని చోట్లయితే 15 రోజులకు గానీ బెడ్ దొరకటం లేదు. బెడ్ దొరికిన 10 రోజులకుగానీ ఆపరేషన్ జరగడం లేదు. నిమ్స్, ఉస్మానియా లాంటి ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో రోగాలకు చికిత్స కోసం రాజధాని నగరానికి వస్తున్న పేద రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోజూ సుమారు నాలుగు వేల మంది రోగులు ఏదో రకమైన ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నారు. గతంలో 360 ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో ఉండగా.. వివిధ కారణాలతో ఆ జాబితా నుంచి 97 ఆస్పత్రులను ప్రభుత్వం తప్పించింది. 

సర్కారు ఆస్పత్రుల్లో సౌకర్యాలేవీ..? 

ఇంతకాలం కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం వైద్యం చేయించుకునే వీలున్న 133 జబ్బులకు ఇకనుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయించుకోవాలన్న నిబంధన వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించలేదు. దాదాపు 125 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేవు. ఐసీయూలు, సీటీ స్కానర్లు, ఎక్స్‌రే యంత్రాలు సైతం లేవన్న విషయం వైద్యఆరోగ్య శాఖ నివేదికలే చెబుతున్నాయి. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏసీటీ మెషీన్స్, హెడ్‌లైట్స్, మైక్రోడిబ్రైడర్స్, అల్ట్రాసౌండ్ మెషీన్స్, న్యూరో ఎండోస్కోప్స్, హైస్పీడ్ స్టెరిలైజర్స్, ఈసీజీ మెషీన్స్, నెబులైజర్స్, ఆక్జినేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ తదితర కనీస పరికరాలు కూడా లేని ఆస్పత్రులు 108 ఉన్నాయని వైద్య అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దాంతో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 

మూడేళ్లుగా మురిగిపోతున్న నిధులు... 

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 2009లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా రివాల్వింగ్ ఫండ్ కింద రూ. 55 కోట్లు ఇచ్చారు. ఆ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉండగా ఇప్పటికీ సంబంధిత యంత్రపరికరాలను కొనుగోలు చేయలేదు. దానికి సంబంధించిన టెండర్లు ఇప్పటికీ తుది దశకు చేరుకోలేదు. కేటాయించిన ఆ నిధులు ఇప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఖాతాల్లోనే మురిగిపోతున్నాయి. 

ఆ రూ. 829 కోట్లు ఎక్కడ? 

ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వాస్పత్రుల్లో 3.31 లక్షల శస్త్రచికిత్సలు చేశారు. ఇందుకు రూ. 829 కోట్లు ప్రభుత్వాస్పత్రులకు వచ్చింది. ఇందులో 20 శాతం నిధులు రివాల్వింగ్ ఫండుకూ, 35 శాతం నిధులు సిబ్బందికి ఇన్సెంటివ్‌ల కింద వెళ్లినా మిగతా 45 శాతం నిధులు వైద్య ఖర్చులు, ఆస్పత్రి అభివృద్ధి పనులకు వెచ్చించాలి. 45 శాతం నిధులంటే సుమారు రూ. 400 కోట్లు ఉండాలి. ప్రస్తుతం 145 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ వైద్య సేవలందిస్తున్నాయి. ఇందులో ఒక్క ఆస్పత్రి కూడా ఆరోగ్యశ్రీ నిధులతో మౌలిక వసతులు సమకూర్చుకున్న దాఖలాలు లేవు. ఈ నిధులు ఎలా ఖర్చు చేయాలి, దీనికి బాధ్యులెవరు అన్నదానిపై ఇప్పటి వరకూ సర్కారు వద్దే సరైన సమాధానం లేదు. 

మందులు లేవు.. ఫాలో అప్ లేదు... 

ఆరోగ్యశ్రీ కింద రోగికి వైద్యం మొదలైనప్పటి నుంచీ వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకూ ప్రభుత్వ మందులు అందించాలనేది పథకం ఉద్దేశం. కానీ ఇప్పుడు శస్త్రచికిత్స సమయంలోనే మందులు అందించడం లేదు. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లోనే మందులు సరిగా అందడం లేదని రోగుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇకపోతే కొన్ని వ్యాధులకు ఫాలోఅప్ మెడిసిన్స్ అంటే శస్త్రచికిత్స పూర్తయ్యాక ఏడాది వరకూ మందులివ్వడంతో పాటు ఉచితంగా ఓపీ పేషెంట్లలో చూసి, అవసరమైతే వైద్య పరీక్షలు చేయాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక్కసారి ఆస్పత్రి నుంచి రోగి వెళ్లిపోతే మళ్లీ వస్తే పట్టించుకోవడమన్నది బహు అరుదుగా జరుగుతోంది. ఇదిలావుండగా.. కార్పొరేట్ ఆస్పత్రులు చేసిన చికిత్సలపై నిధులు కూడా సక్రమంగా విడుదల చేయడం లేదని ఆస్పత్రుల యజమానులు పలువురు ఆరోపించారు. 

గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ... 

ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయానికి రోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పథకంపై సరైన అవగాహన లేని సమయంలోనే ఎప్పుడూ అన్ని ఫిర్యాదులు రాలేదు. ఇప్పుడు వైద్యం అందక వస్తున్న ఫిర్యాదులు కోకొల్లలు. వారం రోజులైనా తమకు బెడ్ ఇవ్వడం లేదని, ఆ కారణంగా అక్కడే పడిగాపులు కాస్తున్నామని కరీంనగర్ నుంచి ఓ రోగి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా తమకు వచ్చిన జబ్బుకు చికిత్స చేయలేమని, వేరే ఆస్పత్రికి వెళ్లమంటున్నారి పేర్కొంటూ ప్రకాశం జిల్లా నుంచి మరో వ్యక్తి ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారుల దృష్టికి తెచ్చారు. గతంలో ఇలాంటి ఫిర్యాదులు రోజూ 30 నుంచి 40 కూడా వచ్చేవి కావు. ఇప్పుడు ఇలా రోజూ వచ్చే ఫిర్యాదుల సంఖ్య 250కి చేరింది.

20 శాతం తగ్గిన సర్జరీలు... 

ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం విధించిన నియంత్రణ ఫలితంగా ఆపరేషన్లు తగ్గాయి. ఈ పథకంలో మొత్తం 932 జబ్బులుండగా అందులో 133 జబ్బులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలన్న నిబంధన విధించింది. ఈ 133 జబ్బుల్లో ప్రధానమైన అపెండిసైటిస్, హెర్నియా, హిస్టరెక్టమీ, వాజెక్టమీ, థైరాయిడ్, బ్రాంకైల్ సెనైస్, ఎండోస్కోపిక్ సెనైస్ సర్జరీ, డిసెక్టమీ తదితర ప్రధాన జబ్బులున్నాయి. ఈ జబ్బులను ప్రభుత్వాస్పత్రులు మాత్రమే చేయాలన్న నియమం పెట్టిన తర్వాత సుమారు 20 శాతం పైన సర్జరీలు తగ్గాయి. 2010లో 133 జబ్బులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు 70 వేలకు పైనే సర్జరీలు జరిగితే 2011 నాటికి ఆ సంఖ్య 55 వేలకు పడిపోయింది. ప్రధానంగా జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు బాగా తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. 

ఖాతా తెరవని ప్రభుత్వ ఆస్పత్రులు: ఆరోగ్యశ్రీ కింద సేవలందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 బోధనాస్పత్రులు, నాలుగు రిమ్స్, 17 జిల్లా ఆస్పత్రులు, 58 ఏరియా ఆస్పత్రులు పైనే ఉన్నాయి. మొత్తం ఏరియా ఆస్పత్రుల్లో సుమారు 20 ఆస్పత్రులు ఒక్క శస్త్రచికిత్సా చేయలేదు. కొన్ని ఆస్పత్రులు ఏడాదికి 30 లేదా 40 చికిత్సలు చేశాయి. 

‘కార్పొరేట్’ జాబితా నుంచి తొలగించిన 
133 జబ్బులకు సర్జరీల వివరాలు చూస్తే
ఏడాది జరిగిన సర్జరీలు 
(తొలగించకముందు..) 
2008-09 48,500
2009-10 68,250
2010-11 69,500
(తొలగించిన తర్వాత..) 
2011-12 54,900
2012- ఇప్పటివరకు 6,800 

కార్డున్నా నా బిడ్డను ఆస్పత్రిలో చేర్చుకోలేదు! 

నా కొడుకు వినోద్‌కుమార్‌కు ఇటీవల వీపుపై వాపు వచ్చింది. ఊర్లో ఉన్న డాక్టర్‌కు చూపిస్తే నిమ్స్‌కు తీసుకెళ్లమన్నారు. నాలుగు రోజుల కిందట ఇక్కడికి వచ్చాను. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అయినా చేర్చుకోలేదు. వైద్యులు చికిత్స చేయకపోవడంతో రోగం మరింత ముదురుతోంది. మరో రెండు మూడు రోజులు ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని చిన్న డాక్టర్ చెప్పిండు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా అని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తే.. ఇక్కడ కార్డు పని చేయదు, డబ్బులు కడితే ఆపరేషన్ చేస్తామన్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. 
- ఎల్లమ్మ, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా 

పడకలు ఖాళీ లేవన్నారు.. షెడ్డు కిందే ఉంటున్నా!

ఇటీవల నా రెండు కాళ్లు వాచిపోయాయి. నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉంది. చికిత్స కోసం గత సోమవారం నిమ్స్‌కు చేరుకున్నా. తీరా వైద్యుడిని సంప్రదిస్తే.. ఆస్పత్రిలో ప్రస్తుతం పడకలు ఖాళీగా లేవు, ప్రస్తుతం అడ్మిట్ చేసుకోవడం కుదరదని కరాఖండిగా చెప్పారు. చేసేది లేక వారం రోజుల నుంచి నిమ్స్ క్యాంటిన్ పక్కన ఉన్న ఓ రేకుల షెడ్డు కింద తలదాచుకుంటున్నా. బాధను భరించలేక పోతున్నా.. అలాగని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేదు. ఏం చేయాలో.. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
-జి.యాదయ్య, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ జిల్లా

రేట్లు పెంచనిదే సర్జరీలు చెయ్యలేం 

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలకు ఇస్తున్న రేట్లు 2008లో నిర్ణయించినవి. ఇప్పటి వరకూ వాటిని సవరించలేదు. ప్రస్తుతమున్న రేట్లలో 60 శాతం పెంచితే కానీ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెయ్యడం కష్టం. రేట్లు సవరించాలని రెండు రోజుల కిందటే ఆరోగ్యశ్రీ సీఈఓను కలిశాం. నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం.
- డా. భాస్కర్‌రావు, అధ్యక్షుడు, ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసో
Share this article :

0 comments: