మళ్లీ ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్ యత్నాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్ యత్నాలు

మళ్లీ ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్ యత్నాలు

Written By news on Friday, July 6, 2012 | 7/06/2012


- సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సీబీఐ
- పిటిషన్‌పై ఒకట్రెండు రోజుల్లో విచారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్ ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ సీబీఐ మరోసారి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ ఎస్పీ హెచ్ వెంకటేశ్ ఈ మేరకు గురువారం చీఫ్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే తొలి వారంలో సీబీఐ దాఖలు చేసిన అటాచ్‌మెంట్ పిటిషన్‌ను సాంకేతిక కారణాలతో సిటీ సివిల్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో, కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ తాజాగా మళ్లీ పిటిషన్ వేశారు.

ఈ మూడు సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులతో పాటు జిల్లాల్లో ఉన్న కార్యాలయాలను కూడా అటాచ్ చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. అన్ని జిల్లాల రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి తెప్పించిన పత్రాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారు. జగతి, జనని, ఇందిరా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం గతంలో జీవో (నంబర్ 89) జారీ చేయడం తెలిసిందే. ఈ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశముంది.

కోనేరు, సునీల్ ఆస్తులూ..: ఎమ్మార్ కేసు నిందితులు కోనేరు రాజేంద్రప్రసాద్, నర్రెడ్డి సునీల్‌రెడ్డిల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా సీబీఐ మరోసారి పిటిషన్ దాఖలు చేసిన వైనం గురువారం వెలుగుచూసింది. వీరిద్దరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం గతంలోనే జీవోలు (నంబర్ 87, 88) జారీ చేయడం తెలిసిందే. ప్రసాద్, సునీల్‌రెడ్డిలతో పాటు వారి కుటుంబీకుల్లో పలువురికి చెందిన ఆస్తులను కూడా అటాచ్ చేయాలని తాజా పిటిషన్‌లో సీబీఐ కోరింది. షాద్‌నగర్ (మహబూబ్‌నగర్), భీమునిపట్నం, భోగాపురం (విశాఖపట్నం), సబ్బవరం (విజయనగరం)లతో పాటు వైఎస్సార్ జిల్లా, హైదరాబాద్‌లలో ఉన్న దాదాపు 30 ఆస్తుల అటాచ్‌మెంట్ కోరింది.

Share this article :

0 comments: