జగన్ మీ మధ్యే ఉంటారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ మీ మధ్యే ఉంటారు..

జగన్ మీ మధ్యే ఉంటారు..

Written By news on Tuesday, July 24, 2012 | 7/24/2012

* రూ.312 కోట్ల రుణాల మాఫీకి వైఎస్ నాడే జీవో ఇచ్చారు
* ఆయన మరణించాక ఈ ప్రభుత్వం ఇంతవరకు నిధులివ్వలేదు
* నేతన్నలకు వైఎస్ ప్రకటించిన ప్యాకేజీలను సక్రమంగా అమలు చేయట్లేదు
* ప్రతిదానిపైనా పన్నుల బాదుడుతో పేదవాడి పరిస్థితి దుర్భరం
* పనులు దొరక్క చాలా మంది పట్టణాలకు, పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు
* పరిశ్రమలు నడవక.. కార్మికులను తీసేస్తున్నారు
* ఆత్మగౌరవం తాకట్టుపెట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
* నేతన్నలకు రూ.700 పెన్షన్.. షెడ్డు నిర్మాణానికి స్థలం... జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తాడని భరోసా ఇస్తున్నా

సిరిసిల్లనుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేత కార్మికుల రుణాలు మాఫీ చేయడం కోసం బడ్జెట్‌లో రూ.312 కోట్లు కేటాయించి జీవో కూడా జారీ చేశారని.. కానీ ఈ ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేక వాటిని ఇంతవరకు విడుదల చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. నేత కార్మికుల కోసం మహానేత ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని ప్రకటించారని, ఆయన మరణించాక వచ్చిన పాలకులు దాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. ఫలితంగా చేనేత పరిస్థితి కూడా అన్నదాత దుస్థితిలాగానే తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆమె సోమవారం ధర్నా నిర్వహించారు. నేతన్నలకు వైఎస్ ప్రకటించిన ప్యాకేజీని తక్షణం సక్రమంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో 20 నిమిషాల పాటు సాగిన విజయమ్మ ప్రసంగం.. ఆమె మాటల్లోనే.. 

రైతు దుస్థితిలోనే నేతన్నలూ
‘‘ఇవాళ సిరిసిల్ల నేతన్నలు కష్టంలో ఉన్నారని తెలిసి, వారికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించి వచ్చింది. మహానేత మన మధ్య నుంచి పోయినప్పటి నుంచి మన రాష్ట్రం ఎంత కష్టంలో ఉందో అందరికీ తెలుసు. భారతదేశంలో రైతుల తర్వాతి స్థానం నేతన్నదే. రైతుకు మేలు రకమైన విత్తనం లేక, నీళ్లు లేక, గిట్టుబాటు ధర లేక, అతివృష్టి, అనావృష్టితో ఈ రోజు అనేక కష్టాలతో సతమతమవుతున్నాడు. రైతులకు మళ్లీ 2004 ముందు నాటి పరిస్థితులు కనపడుతున్నాయి. అన్నం పెట్టే రైతు ఆపదలో ఉన్నాడు. అలాగే నేతన్నలు కూడా అదే దుస్థితిలో ఉన్నారు.

నూలు ధరలు కొండెక్కుతున్నాయి
ఇవాళ చూస్తే పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కారు. అది నేతన్నకు కూడా ఇబ్బంది అయ్యింది. ముడి నూలు దొరక్క,నేసిన వాటికి గిట్టుబాటు దొరక్క ఇవాళ నేతన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు నూలు ధరలు రెట్టింపు అవుతున్నాయి. మే నెలలో 25 కౌంటు నూలు ధర రూ.860 ఉంటే జూలై నెలకొచ్చేసరికి రూ.930 అయ్యింది. అలాగే 60 నెంబరు గలది రూ.1,100 నుంచి రూ.1,350కు పెరిగింది. ఇలా మూడు నెలల కాలంలోనే రూ.250 పెరిగింది. అలాగే పాలిస్టర్ ధర రూ.30 పెరిగింది. వీటన్నింటికీ కారణం కేంద్రం కాటన్ ఎగుమతికి అనుమతి ఇవ్వడమే. దీని వల్ల భారీ పరిశ్రమలకే మేలు జరుగుతుంది. కానీ మగ్గం నేసే నేతన్నను చూస్తే అధిక రేటుకు కొని ఉత్పత్తి చేస్తే కూలి కూడా రావడం లేదు. ఈ రోజు నష్టం ఎంత అంటే 1 మీటరు బట్ట నేస్తే నేతన్నకు వచ్చేది కేవలం 75 పైసలు. అదే వ్యాపారులకు 3 రూపాయలు వస్తుందట. ఒక చీర నేసేందుకు రూ.300 ఖర్చయితే, దాన్ని మార్కెట్‌లో రూ.230కే అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.

వలస పోయినా పని లేదు..
ఈ రోజు నేతన్నకు ఎక్కడా పని దొరకడంలేదు. పని ఇచ్చే నాథుడు లేడు. సొంత మగ్గాల మీద నేసుకోవాలంటే కరెంటు కొరత దారుణంగా ఉంది. పక్కనున్న రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్రలకు వలస పోవాల్సి వస్తోంది. నేతన్నలు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ చూస్తే నేతన్న ఎలా బతుకుతున్నాడంటే కనీసం పట్టణాలకు పోయి పరిశ్రమల్లో ఏదైనా పని దొరకుతుందేమో చూద్దామంటే అక్కడ కూడా పని లేదు. కరెంటు కోతల వల్ల పరిశ్రమకు కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నడూ లేనిది నెలకు 12 రోజులు సెలవు ప్రకటిస్తున్నారు. అక్కడ పనిచేసే రోజువారీ కార్మికులను తీసేస్తున్నారు. 

ఇక పట్టణాలకు వలస వెళ్లేవారికి పని ఎవరిస్తారు? ఇలాగైతే నేతన్న ఎలా బతకాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు రావాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ఈనాటి ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా ఉండడంలేదు. ఖజానా పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. అన్నింటి రేట్లూ పెంచేసింది. విద్యుత్ సర్‌చార్జీల పేరిట కరెంటు రేట్లు పెంచింది. ఆర్టీసీ చార్జీలతో వాతలు పెట్టింది. ఎరువుల ధరలైతే మూడు రెట్లు పెరిగాయి. మున్సిపల్ పన్నులు, నీటిపన్నులు ఇవన్నీ కూడా ఎడాపెడా వడ్డించారు.

వైఎస్ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూశారు..
పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలనే రాజశేఖరరెడ్డి నిరంతరం తపించేవారు. భారతదేశ చరిత్రలో ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి పన్ను పెంచకుండా పాలించడమంటే అది రికార్డట. అలాంటిది వైఎస్ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు భరోసా కల్పిస్తూ ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. ఆయన పాలనలో ఆరోగ్య భద్రత ఉంది. చదువులు, పెద్ద వాళ్లకు పెన్షన్లు పెంచారు. మహిళలను లక్షాధికారులు చేయాలని పావలావడ్డీ రుణాలు ఇచ్చారు. అలా ఆయన ఒక తండ్రిగా అందర్నీ ఆదుకున్నారు. మహానేత పరిపాలన ఒక సువర్ణయుగం. మరీ ముఖ్యంగా నేతన్నలకు చాలా రకాలుగా అందులో సిరిసిల్ల నేతన్నకు ఒక ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీలో చూస్తే ఎన్నో ఉన్నాయి. 

గత ప్రభుత్వం.. అంటే టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 200 మందికి లక్షన్నర రూపాయల పరిహారం అందజేశారు. అంతేకాకుండా మరో 143 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.25 వేలు ఇచ్చారు. ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ముఖ్యంగా నేతన్నలు మగ్గాల మీద గంటల తరబడి పనిచేసి నడుములు పోగొట్టుకుని, కళ్లు కూడా కనబడని పరిస్థితిని గుర్తించి వారికి 50 ఏళ్లకే పెన్షన్లు అందజేశారు. అంతేకాకుండా అంత్యోదయ యోజన కింద 35 కేజీల బియ్యం అందించి ఆకలి తీర్చారు. ఆప్కోలో రూ. 32 కోట్ల టర్నోవర్ ఉండేది. దాన్ని వైఎస్ రూ.250 కోట్లకు పెంచారు. 

అదే విధంగా టెక్స్‌టైల్స్ పార్కు పెట్టి 15 ఎకరాలు నేతన్నల కోసం కేటాయించారు. అయితే ఈ ప్రభుత్వం వాటిని కార్యకర్తలకు ఇచ్చిందట. నేతన్న మరమగ్గాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తానని వైఎస్ హామీ ఇచ్చారు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం కట్టిస్తానని చెప్పారు. 50 శాతం విద్యుత్ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా కార్మికులకు జీతాలు పెంచితే అదనంగా మరో 25 శాతం ఇస్తానని చెప్పారు. ఈ విధంగా ప్రతీ విషయంలోనూ ఆలోచించి ప్యాకేజీ ప్రకటించారు. ఇవాళ ప్యాకేజీలను ప్రభుత్వం సరిగ్గా అమలు జరపలేకపోతుంది.

బాబు హయాంలో..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సీఎంలలో ఎవరైనా నేతన్నకు సహాయం, మేలు చేశారంటే అది ముందు ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డే. ఎన్టీఆర్ హయాంలో పెట్టిన జనతా వస్త్రాలను చంద్రబాబు తన హయాంలో తీసేశారు. అప్పుడు నేతన్నలు మార్కెటింగ్ జరుపుకోలేక ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో 200 మంది చనిపోతే వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం అందజేయలేదు. పైగా పరిహారం ఇస్తే ఆత్మహత్యలు ఇంకా ఎక్కువ చేసుకుంటారని చంద్రబాబు అవహేళన చేశారు. అప్కోను నిర్వీర్యం చేశారు. ఏపీ టెక్స్‌టైల్ కార్పొరేషన్ కూడా రద్దు చేశారు. బాబు హయాంలో నేత కార్మికులకే కాకుండా గ్రామీణ వృత్తులన్నీంటినీ సర్వనాశనం చేశారు. 

జగన్ మీ మధ్యే ఉంటారు..
రాజశేఖరరెడ్డి తర్వాత ఆయన కుమారుడు జగన్‌బాబు కూడా తండ్రి ఆశయాలకు అనుగుణంగా మీ మధ్యలోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజులపాటు ధర్మవరంలో మీ కోసం దీక్ష చేశారు. అప్పుడు జగన్ బాబుకు చాలా జ్వరం వచ్చింది. అయినా దీక్ష చేశారు. అయితే జగన్‌పై ఈ రోజు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కోర్టుకెళ్లి సీబీఐ చేత విచారణ అంటూ అన్యాయంగా జైల్లో బంధించారు. జగన్‌బాబు బయట ఉండుంటే ఆయనే వచ్చుండేవారు. న్యాయం, ధర్మం మన పక్షాన ఉన్నాయి. జగన్‌బాబు తొందరలో వస్తారు. మీ మధ్యలోనే ఉంటూ మీతోనే ఉండి మీ సమస్యలపై స్పందిస్తారు. 

నేతన్నకు జగన్ ఇచ్చిన హామీలను వైఎస్సార్ కాంగ్రెస్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే కచ్చితంగా అమలు చేస్తారు. పెన్షన్‌లను రూ.700కు పెంచడంతోపాటు పిల్లలను బడికి పంపితే ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా తల్లి అకౌంట్‌లో నెలనెలా డబ్బులు వేస్తారు. అంతేకాదు దేశంలో నూతనంగా చేనేత విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రతీ కార్మికుడికి షెడ్డు పెట్టుకోవడానికి స్థలం ఇస్తామని కూడా జగన్ చెప్పారు. జగన్‌బాబు సీఎం అయిన తర్వాత పూర్తిగా రుణమాఫీ చేయడంతో పాటు మళ్లీ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకొస్తారు. ఇవాళ తెలంగాణలో ఎవరు ఏ విధంగా బాధలుపడినా, ఏ కష్టంలో ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ స్పందిస్తుంది. జగన్‌బాబు వచ్చి అండగా ఉంటారు.

నీటి ప్రాజెక్టులపై అంత నిర్లక్ష్యం ఎందుకు?
వైఎస్సార్ అధికారంలోకి వచ్చినప్పుడు తొలి సంతకం ఉచిత విద్యుత్తుపైనే చేశారు. అప్పుడే రూ.1259 కోట్లు కరెంటు బకాయిలు మాఫీ చేశారు. అప్పుడు 70 శాతం తెలంగాణకే మేలు జరిగింది. వైఎస్ హయాంలో రూ.51 వేల కోట్లతో జలయజ్ఞం చేపడితే.. రూ.25 వేల కోట్లు తెలంగాణలోనే ఖర్చుపెట్టారు. అలీసాగర్, గుత్ప, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులు పూర్తిచేశారు. వైఎస్సార్ చేయతలపెట్టిన పథకాలన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. నీటిప్రాజెక్టులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్ శరవేగంగా అనుమతులు తెచ్చారు. ఈ ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దం పాటిస్తోంది. జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తారు. ఈ ప్రభుత్వం మిడ్ మానేరు నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.’’

వైఎస్‌కు నేత వస్త్రాలంటే చాలా ఇష్టం
‘గాంధీజీ స్వదేశీ వస్త్రాలు కట్టుకోవాలి అని, ఇంగ్లీషు వాళ్ల బట్టలు కట్టుకోవద్దని చెప్పారట. కాంగ్రెస్ నేతలు ఖద్దరు బట్టలే ధరించాలని గాంధీజీ చెబితే ఇవాళ దాన్ని చాలా మంది మరిచిపోతున్నారు. మహానేత కూడా గాంధీజీ స్పూర్తితో ఖద్దరు బట్టలనే ధరించేవారు. ఆయనకు నేత వస్త్రాలంటే చాలా ఇష్టం. అలాగే ఇందిరమ్మ కూడా ఖద్దరు చీరలనే కట్టుకునేవారట. వైఎస్‌ను చూస్తేనే పంచెకట్టు గుర్తుకొస్తుంది. ఆయన అమెరికాలో వ్యవసాయ సదస్సుకు పోయినప్పుడు సూట్ వేసుకోమని అధికారులు చెప్పారట. అయితే ఆయన.. నేను రైతు బిడ్డను అని చెప్పి పంచెకట్టుతోనే వెళ్లారు. ఆయన పంచెకట్టును అబ్దుల్‌కలాం, జార్జిబుష్ తోపాటు ఎంతో మంది అభినందించారట. ఆయన చేనేతకే వన్నె తెచ్చారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక రోజు నేత బట్టలు కట్టుకొని హాజరు కావాలని కచ్చితంగా చెప్పి జీవో కూడా జారీ చేశారు’ అని విజయమ్మ చెప్పారు’.
Share this article :

0 comments: