నగదు బదిలీపై రౌండ్‌టేబుల్ ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నగదు బదిలీపై రౌండ్‌టేబుల్ ఆందోళన

నగదు బదిలీపై రౌండ్‌టేబుల్ ఆందోళన

Written By news on Wednesday, July 25, 2012 | 7/25/2012

 ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి పేదల కడుపుకాల్చేందుకే ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్నీ ప్రవేశపెడుతోందని పలు పార్టీ లు, ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ పథకం ప్రజావ్యతిరేక చర్య అని, ఆహారభద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), పట్టణ పౌర సంఘా ల సమాఖ్య మంగళవారమిక్కడ నగదు బదిలీపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాయి. 

ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కె.స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీవీ రాఘవులు (సీపీఎం), కె. రామనరసింహా రావు (సీపీఐ), ఆంజనేయులు (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్), బాలాజీ (లోక్‌సత్తా), కేఆర్ వేణుగోపాల్ (రిటైర్డ్ ఐఏఎస్ అధికారి), సంధ్య, ఝాన్సీ (పీఓడబ్ల్యూ), రామకృష్ణ (రైతు సంఘం), వి.శ్రీనివాస్ (పట్టణ పౌరసంఘాల సమాఖ్య), బి.వెంకట్ (వ్యవసాయకార్మిక సంఘం) తదితరులు ప్రసంగించారు. ప్రభుత్వం పేదల్ని మభ్యపెట్టి బ్యాంక్ ఖాతాలను తెరిపిస్తోందని, నగదు బదిలీ వస్తే ఎఫ్‌సీఐ, ప్రజాపంపిణీ వ్యవస్థ రద్దవుతాయని చెప్పారు. నగదు వద్దనుకుంటే రేషన్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 

రైతులు, నిరుపేదల నోట మట్టికొట్టడానికే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు. డబ్బుకన్నా ఆహార ధాన్యానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రణాళికాసంఘం పేదరికానికి ఇచ్చిన నిర్వచనాన్ని తప్పుబట్టారు. సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి బదులు ఉన్నవాటికే ఎసరు పెడుతున్నారని ఆక్షేపించారు. కిరోసిన్‌తో మొదలుపెట్టే ఈ పథకం క్రమేణా బియ్యానికీ, గోధుమలకు, ఎరువులకూ వర్తింపచేస్తారని వివరించారు. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి బొక్కబోర్లాపడ్డారని గుర్తుచేశారు. 

ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతిని అరికట్టే పేరిట తీసుకువస్తున్న నగదు బదిలీ అన్యాయమైన పథకమని బీవీ రాఘవులు చెప్పారు. ప్రజలు పవిత్రంగా భావించే తిరుపతి వెంకటేశ్వరస్వామికే పంగనామాలు పెడుతున్నప్పుడు దీనికి తూట్లు పొడవడం మన అధికారులకు పెద్దలెక్క కాదని ఎద్దేవా చేశారు. రేషన్ వ్యవస్థలోని సబ్సిడీని వస్తురూపంలోనే చెల్లించాలన్నారు. పీడీఎస్ జోలికి పోకుండా దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపిచ్చారు.
Share this article :

0 comments: