సీబీఐ తీరుతో రోడ్డున పడేలా ఉన్నాం ,హైకోర్టులో వాపోయిన ఓరియంటల్ బ్యాంక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ తీరుతో రోడ్డున పడేలా ఉన్నాం ,హైకోర్టులో వాపోయిన ఓరియంటల్ బ్యాంక్

సీబీఐ తీరుతో రోడ్డున పడేలా ఉన్నాం ,హైకోర్టులో వాపోయిన ఓరియంటల్ బ్యాంక్

Written By news on Friday, July 6, 2012 | 7/06/2012

 సీబీఐ వ్యవహార శైలి తనను రోడ్డున పడేసేలా ఉందంటూ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాపోయింది. బ్యాంకు రికార్డులు తమ వద్ద లేవని, జగతి ఓవర్‌డ్రాఫ్ట్‌ల నుంచి విదేశీ కంపెనీలకు డబ్బు చెల్లించాలని సీబీఐ చేస్తున్న వాదనలు తమ సంస్థను సైతం తీవ్ర నష్టాలకు గురిచేసేవిగా ఉన్నాయని పేర్కొంది. ‘‘మా రికార్డుల గురించి తెలియదని సీబీఐ చెప్పటం పూర్తిగా అబద్ధం. ఎందుకంటే మా రికార్డుల్ని అది ఈ ఏడాది ఫిబ్రవరి 2నే స్వాధీనం చేసుకుంది’’ అని బ్యాంకు తరఫు న్యాయవాది గురువారం హైకోర్టుకు తెలియజేశారు. బ్యాంకు ఖాతాల స్తంభనను తొలగించిన సందర్భంగా ఇటీవల జగతి సంస్థలపై హైకోర్ట్టు కొన్ని షరతులు విధించింది.

వాటిని సడలించాలంటూ జగతి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి.చంద్రకుమార్ ఎదుట గురువారం ఓబీసీ ఈ మేరకు వాదనలు వినిపించింది. ‘సాక్షి’ సంస్థల బ్యాంక్ ఖాతాల డీఫ్రీజ్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని, సీబీఐ మాత్రం ఎలాంటి కారణాలూ లేకున్నా తమకు అడ్డంకులు కలిగించాలని చూస్తోందని తెలియజేసింది. ‘‘మా బ్యాంకులో హామీగా పెట్టిన డిపాజిట్లు రూ.99 కోట్లు, హామీ లేని డిపాజిట్లు రూ.4.09 కోట్లు ఉన్నాయి. జూన్ 6వ తేదీ నాటికి 7.65 లక్షలు చెల్లించాం. విదేశీ లెటర్ ఆఫ్ క్రెడిట్‌ల (ఎఫ్‌ఎల్‌సీ) కింద బ్యాంకులో 36 ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయి. లెటర్ ఆఫ్ క్రెడిట్‌లన్నిటినీ బ్యాంకు నుంచే జారీ చేశాం. వాటిని రన్నింగ్ ఖాతాగా పరిగణిస్తున్నాం’’ అని ఓబీసీ న్యాయవాది వివరించారు. సీబీఐ మాత్రం బ్యాంకు తీరు సరిగా లేదని వాదించింది. 

‘‘హైకోర్టు ఉత్తర్వుల్ని ఓబీసీ పాటించటం లేదు. మాకు మే 23న చెప్పిన దాని ప్రకారం 36 ఎఫ్‌డీలు, రూ.49 కోట్ల హామీ గల డిపాజిట్లు ఉండాలి. దాన్లో కొంత మొత్తాన్ని ఇప్పటికే కంపెనీలకు బ్యాంకు చెల్లించింది. మిగతా రూ.38 కోట్ల మొత్తాన్ని ఇక ఏమాత్రమూ తాకకూడదు. అలాగైతేనే సీబీఐ ప్రయోజనాలు కాపాడినట్టవుతుంది’’ అని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఫారిన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ జారీ చేయటం ద్వారా ఓబీసీ తప్పు చేసిందని, దీనిపై కూడా బ్యాంకు కొన్ని నిబంధనలు విధించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాల వాదనలూ విన్న కోర్టు జగతి సంస్థల్ని కొన్ని ప్రశ్నలు అడిగింది. సెక్యూరిటీగా 50 శాతం బ్యాంకు గ్యారంటీని, 50 శాతం మూడో పక్షానికి చెందిన స్థిరాస్తుల్ని చూపించగలరా అని ప్రశ్నించింది. తదనంతరం ఉత్తర్వుల్ని శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం తీర్పు వెలువడనుంది.
Share this article :

0 comments: