సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు

సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు

Written By news on Thursday, July 12, 2012 | 7/12/2012

చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్
నియంతలా సంజాయిషీ కూడా అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తావ్?
నాపై సస్పెన్షన్ ఎత్తివేసి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకెళతా
నాడు నీ స్వార్థం కోసం ఎన్టీఆర్‌ను గెంటేశావ్
ఇప్పుడు నీ కొడుకు కోసం నాలాంటి ఎన్టీఆర్ అభిమానులను గెంటేస్తున్నావ్
టీడీపీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేసిన నువ్వు అతిపెద్ద అవినీతిపరుడివి
ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని, హోంమంత్రి చిదంబరాన్ని ముసుగేసుకుని కలిశావ్
రూ. 300 కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్మేశావ్
గాలి జనార్ధనరెడ్డిపై ఆరోపణలు చేయడానికి రూ.300 కోట్లు తీసుకున్నావ్
చంద్రబాబు ఉంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదు

గుడివాడ (కృష్ణా), న్యూస్‌లైన్: ‘‘పార్టీ నీ బాబు సొత్తా.. నీ ఇష్టం వచ్చినట్లు నియంతలా వ్యవహరిస్తున్నావు.. నాడు నీ స్వార్థం కోసం అన్న ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి గెంటేశావు.. నేడు నీ కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న నాలాంటివారిని పార్టీ నుంచి గెంటేస్తున్నావు.. నేనేం తప్పు చేశానని గెంటేశావు? తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేస్తున్న అతిపెద్ద అవినీతిపరుడివి నువ్వు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ధ్వజమెత్తారు. కుళ్లు రాజకీయాలు, వెన్నుపోట్లు, కుతంత్రాలు, కుట్రలు, స్వార్థ రాజకీయాలు చంద్రబాబుకు పేటెంటు హక్కు అని, అవి ఇంకెవరికీ చెందవని అన్నారు. పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేసిన 
తనను చంద్రబాబు, ఆయన అనుచరులు బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీలో చేర్చుకోవాలని.. లేకుంటే కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. గుడివాడలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

వ్యక్తిగత స్వేచ్ఛలేదా?

‘‘నాకు పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? మీరు కాంగ్రెస్ వాళ్ల ఇంటికి వెళ్లొచ్చా.. అవేమో వ్యక్తిగత సంబంధాలా? నేను వెళితే తప్పా? వ్యక్తిగత సంబంధాల మేరకు నేను వైఎస్ జగన్‌ను పరామర్శించడానికి వెళదామనుకున్నా. అలా వెళితే నువ్వు పిల్ల చచ్చిన కోతిలాఏడుస్తావని ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయమ్మను కలిసి మాట్లాడాను. అలా కలిసి బయటకు వచ్చేటప్పటికే.. రెండు నిమిషాల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటించారు. వ్యక్తులతో మాట్లాడినంత మాత్రాన సస్పెండ్ చేయడమేనా? అధినేత అనేవాడు పిలిచి మాట్లాడాలి. నా సంజాయిషీ కోరాలి.. కనీసం నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న నాలాంటివారిని బయటకు గెంటేయాలనే కుట్రతోనే ఇలా చేశారు. సస్పెండ్ చేసిన వెంటనే హైదరాబాద్ కార్యాలయంలో చంద్రబాబు.. తన భజనపరులుగా ఉన్న జిల్లాకు చెందిన నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నన్ను రకరకాలుగా తిట్టించారు. రాజకీయ వ్యభిచారినని.. డబ్బుకు అమ్ముడుపోయానని, పార్టీకి ద్రోహం చేశానని.. రాళ్లతో కొట్టాలని ఊరకుక్కలతో మొరిగించారు. నేనేం తప్పు చేశానని రాళ్లతో కొడతారు? ఎందుకు సస్పెండ్ చేశావు? అయినప్పటికీ చంద్రబాబు తన తప్పు తెలుసుకుని మారతాడనుకుని మీడియావారికి కూడా రెండు రోజులు కనిపించకుండా ఉన్నాను. రెండో రోజు కూడా జిల్లాకు చెందిన బీసీ ఎంపీతో గుడివాడలో సమావేశం ఏర్పాటుచేసి తిట్టించారు. సాయంత్రం చంద్రబాబే నేరుగా దాడికి దిగారు. అందుకే నేడు మాట్లాడాల్సివస్తోంది’’ అని నాని అన్నారు.

ఇంకా అధ్యక్షుడిగా ఉండడానికి సిగ్గులేదా?

‘‘గుడివాడ నియోజకవర్గం ప్రజలు నన్ను రాళ్లు, చెప్పులతో కొట్టాలని చెప్పిన నీకు(చంద్రబాబు) ఏమాత్రం సిగ్గులేదు. నిన్ను చంద్రగిరిలో తరిమేస్తే పారిపోయి కుప్పంలో తలదాచుకున్నవాడివి.. ప్రజాస్వామ్యంలో రాళ్లు, చెప్పులతో కొట్టనవసరం లేదు.. డిపాజిట్లు రాకుండా చేస్తే అదే తిరస్కరించడం. ఇటీవల దాదాపు 60 చోట్ల పోటీచేస్తే.. సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు. మొన్న జరిగిన 18 నియోజకవర్గాల ఉపఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారు. అయినా సిగ్గులేకుండా ఇంకా నువ్వు పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నావ్. నువ్వు దౌర్భాగ్యుడివని తెలిసినా.. అన్న ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఇంకా పార్టీలో కొనసాగుతున్నాం.. కానీ అన్న కుటుంబాన్ని అభిమానించేవారందరినీ నువ్వు బయటకు పంపేస్తున్నావ్’’ అని నాని విమర్శించారు.

జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ చేసి నాకు సీటు ఇప్పించారు

‘‘నేనేమీ నీ దయా దాక్షిణ్యం వల్ల రాజకీయాల్లోకి రాలేదు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే నాకు ఎనలేని అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ చేసి నాకు రెండుసార్లు టికెట్ ఇప్పించారు. ఎక్కడా లేని విధంగా పార్టీని మున్సిపాల్టీలో గెలిపించాను. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల్లో 80 శాతం గెలిపించాను. కానీ నీవు.. నీ కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేదు. నీపై పోటీ చేసిన వ్యక్తి జెడ్పీ చైర్మన్ అయ్యాడు. ఇది నిజంకాదా? నీలా కుళ్లు, కుతంత్రాలు నాకు తెలియదు. నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన గల్లా అరుణకుమారి తండ్రిని వెన్నుపోటు పొడిచావు. అది మరిచిపోయావు. ప్రజలు రాళ్లు, చెప్పులతో నన్ను కొట్టాలని చెప్పావు.. కానీ నిన్ను రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొట్టకుండా చూసుకో.. నువ్వుండగా నీ పార్టీ రాష్ట్రంలో గెలవదు. గుడివాడలో పోటీచేద్దాం.. రా.. నీ పార్టీ గెలుస్తుందో, నేను గెలుస్తానో చూద్దాం...’’ అని నాని సవాలు విసిరారు.

మరణించిన వ్యక్తిపై నిందలు తగదు..

‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక ఆయనపై నిందలు వేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. చిన్నకుర్రాడు జగన్‌పై అవినీతి ఆరోపణలు ప్రచారం చేశావు. కానీ జనం నీ మాటలు నమ్మలేదు. నువ్వు దొంగవని నమ్ముతున్నారు. చనిపోయిన వ్యక్తిని తిట్టే సంస్కృతి మనది కాదు. అయినా రాజశేఖరరెడ్డిని అవినీతిపరుడని చనిపోయాక దూషించావు. నాకు జగన్‌తో వ్యక్తిగత పరిచయాలున్నాయి. ఆయన్ను నాలుగైదుసార్లు కలిశాను. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచి పరిచయాలున్నాయి. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉంది. అలాగే వైఎస్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. వైఎస్‌ను పేదలు దేవుడిగా కొలుస్తున్నారు. గుడివాడలో పేద ప్రజలకు ఇళ్లస్థలాలు కావాలని అడిగితే వైఎస్ 100 ఎకరాలు భూసేకరణ చేశారు..’’ అని నాని చంద్రబాబుకు గుర్తు చేశారు.

సోనియాకు పార్టీని తాకట్టు పెట్టావు..

‘‘అన్న ఎన్టీఆర్ బడుగు, బలహీనవర్గాల వారికోసం పార్టీని పెట్టారు.. నీలాంటి పందికొక్కుల కోసం కాదు. నువ్వేమో టీడీపీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేశావు.. సోనియా, చిదంబరంలను ముసుగేసుకుని కలుస్తున్నావు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది వాస్తవం కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? నేను రూ. 30 కోట్లకు అమ్ముడుపోయానని చెప్పించావు. నీవు రాజ్యసభ సీట్లను రూ. 300 కోట్లకు అమ్మేశావు. గాలి జనార్దనరెడ్డిని అల్లరి చేయటానికి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వద్ద రూ.300 కోట్లు తీసుకున్నావు. అవినీతిపరుడివి నువ్వా... నేనా? రూ.100 నుంచి వందల కోట్ల వరకు అవినీతికి పాల్పడేది నువ్వే. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. నీ విషపు రాజకీయాలకు నీతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు బలయ్యాయి..’ అంటూ నాని చంద్రబాబుపై మండిపడ్డారు.

బాబుపైనే నా రాజకీయ భవితవ్యం..

తన రాజకీయ భవితవ్యం చంద్రబాబుపైనే ఆధారపడి ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి రాజకీయంగా తనను ముంచుతాడో, సస్పెన్షన్ అలాగే ఉంచి తనకు రాజకీయ భవిష్యత్‌ను ఇస్తాడో తేల్చాలని వ్యంగ్యంగా అన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం నిర్ణయిస్తానని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్ పార్టీలోకి రమ్మంటే వెళతానన్నారు. అయితే తనపై పార్టీ సస్పెన్షన్ ఎత్తకపోతేనేనని చెప్పారు. జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉంటే, ఆయన్ను పరామర్శించడానికి ఎలా వెళ్లారని విలేకరులు నానిని ప్రశ్నించగా, ‘‘జగన్ చాలా మంచివారు. ఆయనపై లేనిపోని అభియోగాలు మోపి కేసుల్లో ఇరికించారు. అవన్నీ కోర్టులో త్వరలోనే తేలతాయి. నేను పార్టీ మారాలనుకుంటే వైఎస్ ఉన్నప్పుడే వెళ్లేవాడిని’’ అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: