కార్మికుల హక్కులు కాపాడతాం -వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్మికుల హక్కులు కాపాడతాం -వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్

కార్మికుల హక్కులు కాపాడతాం -వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్

Written By news on Sunday, July 29, 2012 | 7/29/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కృషిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నిర్ణయించింది. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో యూనియన్ కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కార్మికుల ప్రధాన సమస్యలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించారు. కార్మికులకు కనీస వేతనాలతో పాటు బోనస్ యాక్టును సవరింపజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ట్రేడ్ యూనియన్ నిర్ణయించింది. 

ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అధికార ప్రతిపక్షాలు కుట్రచేసి జైలుకు పంపడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ట్రేడ్ యూనియన్‌ను బలోపేతం చేసేందుకు ఐదు లక్షల మంది అసంఘటిత, రెండున్నర లక్షల మంది సంఘటిత కార్మికులకు సభ్యత్వం అందచేయాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాలకమండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎస్.రామకృష్ణారెడ్డిలు ‘ట్రేడ్ యూనియన్ లోగో’ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: