హాస్టళ్లలో నిద్రిస్తూ పత్రికలకు పోజులా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హాస్టళ్లలో నిద్రిస్తూ పత్రికలకు పోజులా?

హాస్టళ్లలో నిద్రిస్తూ పత్రికలకు పోజులా?

Written By news on Monday, July 30, 2012 | 7/30/2012

సీఎం కిరణ్, మంత్రులపై మండిపడ్డ కృష్ణయ్య

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు సంక్షేమ హాస్టళ్లలో బస చేస్తున్నా మెస్ చార్జీలు పెంచాలనే ఆలోచన వారి బుర్రలకు తట్టకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. పూటకు రూ. 5.77 ఇస్తూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో హైదరాబాద్’ సందర్భంగా ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం కిరణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సంక్షేమ హాస్టళ్లలో రాత్రి పూట నిద్రిస్తూ పత్రికలకు పోజులిస్తున్నారని మండిపడ్డారు. 

వీరి రాక గురించి ముందే తెలియడంతో బాస్మతి బియ్యంతో రుచికర వంటకాలు వడ్డిస్తూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు రోజూ ఇలాగే అన్నం పెడతారనే భావం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి భోజనం తిని చూడాలన్నారు. లేదంటే నెల రోజులపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల పిల్లలను హాస్టళ్లలోనే ఉంచాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల జీవితాలు జైళ్లలో ఖైదీల కంటే దుర్భరంగా మారాయన్నారు. ‘ఖైదీలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తుంటే రూ.1800 కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ.990 మంజూరు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు డిగ్రీ చదివే విద్యార్థులకు నెలకు రూ. 520 ఇవ్వటం ధర్మమా?’ అని కృష్ణయ్య ప్రశ్నించారు. 

కళాశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1500కు పెంచాలన్నారు. 3 నుంచి 7వ తరగతి వరకు పాఠశాల హాస్టల్ విద్యార్థులకు రూ.800 ఇవ్వాలన్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాస్టల్ విద్యార్థులకు రూ.900 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లోగా మెస్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వబోమని, రాళ్లతో తరిమి కొడతారని హెచ్చరించారు. 
Share this article :

0 comments: