ఎన్టీఆర్ ముద్ర చెరిపేద్దాం..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్టీఆర్ ముద్ర చెరిపేద్దాం..!

ఎన్టీఆర్ ముద్ర చెరిపేద్దాం..!

Written By news on Thursday, July 12, 2012 | 7/12/2012


ఆయన పురిటి గడ్డలోనే శ్రీకారం చుట్టిన బాబు 
‘నందమూరి ’ అభిమానులను సాగనంపుతున్న వైనం
నానితో బోణి... లైన్లో వంశీ 
మనస్తాపం చెందుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు



విజయవాడ, న్యూస్‌లైన్‌ప్రతినిధి: తెలుగుదేశంపై ఎన్టీఆర్ ముద్రను ఆయన పురిటిగడ్డలోనే చెరిపే ప్రయత్నాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. పార్టీ అధ్యక్షునిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) సస్పెన్షన్ వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఈ వాస్తవాల్నే రుజువు చేస్తున్నాయి. పార్టీ అధినేత ధోరణి వల్లే ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌లు ఆ పార్టీతో ఎప్పటినుంచో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా రు. వీరికి సన్నిహితంగా మెలుగుతున్న విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిల పట్ల కూడా చంద్రబాబు చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు పార్టీ నేతలు ప్రస్తుతం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించేందుకు కూడా భయపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు.

వ్యూహాత్మకంగా వంశీకి ఎంపీ టికెట్...
ఇలా తన వ్యూహాలను అమలు పరిచే చర్యల్లో భాగంగానే చంద్రబాబు 2009 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం శాసనసభ స్థానం టికెట్ ఆశించిన వల్లభనేని వంశీకి విజయవాడ పార్లమెంట్ సీటును ఒక పథకం ప్రకారం అంటగట్టారనే అభిప్రాయం లేకపోలేదు. దాదాపు అయిదేళ్లు గన్నవరం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమైన వంశీ ఆ ఎన్నికల్లో స్వతంత్రునిగా పోటీచేసినా విజయం సాధించడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అంచనావేశారు. 


పముఖ పారిశ్రామికవేత్త దాసరి జయరమేష్ సోదరుడు బాలవర్ధనరావుకు ఆ సీటును కేటాయించి అక్కడి నుంచి వంశీని తప్పించేందుకు బాబు తెరచాటు వ్యవహారం నెరిపినట్టు ఆరోపణలొచ్చాయి. సీటు రాకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి వంశీ సిద్ధంగా ఉండటంతో విజయవాడ పార్లమెంటు స్థానంలో టికెట్ ఇచ్చారు. ఎన్నికలకు పదిహేను రోజులు ముందు సీటు కేటాయించడంతో వంశీ ప్రచారం కోసం పార్టీ నేతలపైనే ఆధారపడ్డారు. అధినేత మనసు తెలుసుకున్న కొందరు వంశీ ఇచ్చిన సొమ్మును వాడుకుని ఓటమికి కారకులయ్యారని అప్పట్లో ఆ పార్టీలోనే ప్రచారం జరిగింది. 



అర్బన్ అధ్యక్షునిగా అవమానాలెన్నో...: అర్బన్ అధ్యక్షునిగా వంశీ అనేక అవమానాలకు గురయ్యారు. ఆ యనకు తెలియకుండా రాష్ట్ర నేతలు విజయవాడ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా ఆహ్వానం మేరకు వారు విజయవాడ రావడాన్ని వంశీ వ్యతిరేకించి, అధినేతకు ఫిర్యాదు చేసినా ఫలితముండేది కాదు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ)తో నెలకొన్న విభేదాల సమయంలో పార్టీ నుంచి వంశీకి సరైన మద్ధతు కూడా లభించలేదు. కార్యకర్తల కోసం నెహ్రూతో వివాదానికి దిగిన వంశీకి జిల్లా నేతలు అండగా నిలవలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధినేత చంద్రబాబు కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో వంశీ ఆభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో పార్టీలో వంశీకి అంత సీన్‌లేదనే అభిప్రాయం ప్రచారమైంది.

హరికృష్ణ పర్యటనప్పుడే....
గతేడాది మార్చి నెలలో తెలుగుదేశం నేత హరికృష్ణ చల్లపల్లిలో పర్యటించారు. అప్పుడు కూడా ఆయనను అవమానించే రీతిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ వ్యవహరించారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబానికి ఆత్మీయులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ బాహాటంగానే ఉమాపై ఆరోపణలు సంధించారు. అధినేత దృష్టికి ఘటన వివరాలు తీసుకువెళ్లారు. ఆ తరువాత టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేళ హరికృష్ణ నగరంలోనే ఉన్నారు. ఆయనతో కార్యక్రమం చేయిద్దామని కొందరు నేతలు అడిగినా ఉమా పట్టించుకోలేదు. హరికృష్ణ పర్యటన గురించి జిల్లాలో మిగిలిన నేతలకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఆయన వ్యక్తిగత పనులపై విజయవాడ వచ్చినా కలిసేందుకు నేతలు వెనుకంజ వేశారు. 

ఈ నేపథ్యంలోనే వంశీ, నానిలు అనేకసార్లు దేవినేని ఉమ నాయకత్వం కింద తాము పనిచేయలేమని తెగేసి చెప్పారు. అయితే చంద్రబాబు ఉమామహేశ్వరరావుకే అండగా నిలిచేవారు. ఏడాదిగా విభేదాలు కొనసాగుతున్నా బాబు ఏనాడూ వారిని పిలిచి మాట్లాడే యత్నం చేయలేదు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విషయంలోనూ ఉమా వైఖరి విమర్శలకు దారి తీసింది. ఆ సినిమా విడుదల రోజున పోర్టు సాధన కోసమంటూ సమ్మెకు పిలుపు ఇవ్వడంపై కొడాలి నాని, వంశీ అభ్యంతరం చెప్పారు. 

గుడివాడలో బంద్ ఉన్నా సినిమా అన్ని షోలు వేసేటట్లు నాని చూశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టేందుకే కృష్ణాజిల్లా నేతలు ఇలా వ్యవహరించారని ఆయన అభిమానులు విమర్శించారు. ఈ సినిమా చూడొద్దంటూ ఎస్‌ఎంఎస్‌లు ఇవ్వడం కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతిసే యత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన వర్గం అండగా నిలవడం ఎన్టీఆర్ అభిమానులను క్రమంగా పార్టీకి దూరం చేసింది.

ఇలా ఎన్టీఆర్ కుటుంబీకులను పార్టీకి పూర్తి దూరంగా ఉంచి ఆయన ముద్రను క్రమేణా చెరిపే యత్నం చంద్రబాబు చేస్తున్నారని, దాన్ని కృష్ణాజిల్లా నుంచే ప్రారంభించారనే వాద నలున్నాయి. ఈ పరిణామాలు ఎన్టీఆర్ అభిమానులను కలచి వేస్తున్నాయి.
Share this article :

0 comments: