పేదల చదువు పెద్ద భారమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదల చదువు పెద్ద భారమా?

పేదల చదువు పెద్ద భారమా?

Written By news on Wednesday, July 25, 2012 | 7/25/2012

* ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సర్కారు తూట్లు
* భారాన్ని వీలైనంతగా తగ్గించుకునేందుకు యత్నం
* కొత్తగా పెరిగే ఫీజులను పేద విద్యార్థులపైనే మోపే వ్యూహం
* ఏటా 26 లక్షల మందికి లబ్ధి.. నాలుగేళ్లలో 28 లక్షలకు చేరే అవకాశం
* అలాంటి పథకంపై ఈ ఏడాది అదనంగా రూ.90 కోట్లు భరించలేరట
* నాలుగేళ్ల తర్వాత భారం రూ.1,930 కోట్లు.. అంటే బడ్జెట్‌లో ఒక్క శాతం!
* అయినా ఏదోలా తప్పించుకునే యత్నమే
* మార్గాంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి మల్లగుల్లాలు
* సామాజిక పెట్టుబడిగా భావించాల్సింది పోయి ఫక్తు ఖర్చు కోణం
* అర్హుడైన ప్రతి విద్యార్థీ చదువుకోవాలన్న వైఎస్ ‘శాచురేషన్’ లక్ష్యానికీ తూట్లు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్. ప్రతిభ ఉండి కూడా కేవలం ఆర్థిక లేమి కారణంగా ఉన్నత చదువులకు దూరమయ్యే దుస్థితి రాష్ట్రంలో ఒక్క విద్యార్థికి కూడా పట్టకూడదనే ఉదాత్త లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మహోన్నత పథకం. పేద కుటుంబంలో ఒక్కరు పెద్ద చదువు చదవగలిగినా ఆ కుటుంబపు తలరాతే శాశ్వతంగా మారిపోతుంది. అలా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పెద్ద చదువులకు నోచుకుంటే మొత్తంగా సమాజపు స్థాయే సర్వవిధాలా మెరుగుపడుతుంది. ఇంతటి అమూల్య వనరైన విద్యావంతులను అందించే కీలకమైన ఉన్నత విద్యపై చేసే వ్యయం సామాజిక పెట్టుబడి అవుతుందే తప్ప ఏ కోణం నుంచి చూసినా ఖర్చు మాత్రం కానేకాదు. 

సరిగ్గా ఈ దృష్టితోనే ఆలోచించి.. రాష్ట్రంలో అర్హుడైన ప్రతి నిరుపేద విద్యార్థీ ఉన్నత చదువుకు నోచుకునేందుకు వీలు కల్పిస్తూ, శాచురేషన్ (సంతృప్త స్థాయి) పద్ధతిన ఈ పథకానికి రూపకల్పన చేశారు వైఎస్. ఫలితంగా ఆయన హయాంలో లక్షలాది నిరుపేద విద్యార్థులు ధీమాగా ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. కానీ ఆయన తదనంతరం ఈ పథకం కూడా క్రమేపీ కష్టాల సుడిగుండాల్లో కూరుకుపోతోంది. ఒకవైపు ఫీజులు నానాటికీ పెరుగుతున్న తరుణంలో రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కూడా పెంచి ఆదుకోవాల్సిన సర్కారే.. పథకాన్ని అనవసరపు భారమనే కోణంలో చూస్తున్న దుస్థితి ప్రస్తుతం నెలకొంది. 

కోర్టు తీర్పుల కారణంగా వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజులు పెరగనున్న నేపథ్యంలో.. రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకు ఈ ఏడాది అదనంగా అవసరమయ్యే మొత్తం కేవలం రూ.90 కోట్లు. అంటే రూ.1.28 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో కేవలం 0.07 శాతం. మూడేళ్లలో అది రూ.1,930 కోట్లకు పెరుగుతుందని అంచనా. అప్పటికి బడ్జెట్ రూ.1.60 లక్షల కోట్లకు చేరుతుందనుకున్నా పెరిగే మొత్తం అందులో 1.2 శాతం కన్నా ఉండదు. వెనకబడ్డ, పేద వర్గాల విద్యార్థుల చదువుల కోసం ఈ మాత్రం మొత్తాన్ని వెచ్చించేందుకు కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఆ భారాన్ని వీలైనంతగా విద్యార్థుల నెత్తినే రుద్ది చేతులు దులుపుకునేందుకు క్రమంగా రంగం సిద్ధం చేస్తోంది. అదే జరిగితే లక్షలాది మంది పేద విద్యార్థులకు పెద్ద చదువులు కలగానే మిగిలిపోయే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది.

సమస్య ఇలా మొదలైంది..
వృత్తి విద్యా కోర్సుల ఫీజులు పెంచుకునేందుకు తమకు అనుమతినివ్వాలంటూ పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. తాము చేస్తున్న ఖర్చుకు, ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజుకు పొంతనే లేదని, వాటిని పెంచనిదే తమ మనుగడ కష్టమని వాదించాయి. దాంతో వృత్తివిద్యా కాలేజీల్లో ఫీజులను కన్వీనర్ (ఎ), మేనేజ్‌మెంట్ (బి) కోటాల్లో కాకుండా ఒకే రూపంలో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వచ్చే మూడేళ్లకు ఫీజులను ఏఎఫ్‌ఆర్సీ ఖరారు చేయాలని పేర్కొంది. 

దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా, చివరిదాకా పూర్తి ఉదాసీనంగా వ్యవహరించింది. దాంతో ఫీజుల పెంపునకు సుప్రీం కూడా అనుమతినిచ్చింది. అయితే అధ్యాపకులకు చెల్లిస్తున్న వేతనాల వ్యయం ఆధారంగా ఫీజులను రూపొందించాలని ఆదేశించిందే తప్ప.. ఎ, బి కేటగిరీలకు ఒకే ఫీజుండాలన్న హైకోర్టు తీర్పుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే రాష్ట్రంలోని 133 కాలేజీలు ఇప్పటికే ఏఎఫ్‌ఆర్సీకి ఫీజుల పెంపు ప్రతిపాదనలు పంపాయి. ఒక్కో కాలేజీలో 3 నుంచి 150 శాతం దాకా ఫీజుల పెంపునకు సిఫార్సు చేయించుకోగలిగాయి. రాష్ట్రంలోని అన్ని వృత్తివిద్యా కాలేజీల్లోనూ 2012-13 తర్వాత వచ్చే మూడేళ్ల కాలంలో అన్ని కోర్సులకూ ఇదే పద్ధతిలో ఫీజులు పెరగనున్నాయి. 

కోర్టు తీర్పులను కచ్చితంగా అమలు చేస్తే ప్రస్తుతానికి కొన్ని కాలేజీల్లోనే ఫీజులు పెరుగుతున్నందున ఈ ఏడాదికి ఖజానాపై రూ.90 కోట్ల భారమే పడ్డా, తర్వాత బాగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అన్ని కాలేజీలూ ఫీజులను పెంచుతూ పోతే వచ్చే ఏడాది 483 కోట్లు, రెండేళ్లలో 966 కోట్లు, మూడేళ్లలో 1,449 కోట్లు, ఆ తర్వాత నుంచి ఏటా 1,932 కోట్ల చొప్పున భారం పడుతుందని సాంఘిక సంక్షేమ శాఖ లెక్కలు కట్టింది. ఎ, బి కోటాల్లేకుండా ఏకీకృత ఫీజు విధానం అమలు చేస్తే భారం మరింత పెరుగుతుందని ప్రభుత్వానికి నివేదించారు.

ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది?
కోర్టు తీర్పులు అమలు చేయాల్సిన పక్షంలో పెరిగే ఈ ఫీజుల భారాన్ని భరించేందుకు ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. నిజానికి ఈ పథకం వల్ల ఏటా దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. కుటుంబ సభ్యులను కూడా కలిపితే ఏటా కోటి మందికి లబ్ధి చేకూరుతున్నట్టు. వీరిలో లక్షలాది మందికి ప్రైవేటుదో, ప్రభుత్వోద్యోగమో.. ఏదో ఒక జీవనాధారం ఏర్పడుతుంది. ముఖ్యంగా వృత్తివిద్యా కోర్సులు చదివే వారయితే జీవితంలో దాదాపుగా స్థిరపడిపోతారు. ఇలా ఏటా లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న పథకంపై కాస్త అదనపు వ్యయాన్ని భరించేందుకు కూడా ప్రభుత్వం ఎందుకనో తీవ్రంగా మల్లగుల్లాలు పడుతోంది. 

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గంటల తరబడి మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఖజానాపై భారం పడకుండా ‘ప్రత్యామ్నాయ మార్గాలను’ అన్వేషిస్తున్నారు. అంటే, విద్యార్థులపై కచ్చితంగా భారం మోపేలా పథక రచన చేస్తున్నారు. పెరిగిన ఫీజును నిర్ధారిత శ్లాబు వరకు మాత్రమే ప్రభుత్వం భరించి, మిగతాది విద్యార్థులపైనే మోపడం ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. వృత్తివిద్యా కళాశాల ఫీజులు పెరిగితే ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సు ఫీజు రూ.31,837 నుంచి రూ.78,740 దాకా చేరుతుందని ప్రభుత్వ అంచనా. సగటున చూసుకుంటే ఒక్కో విద్యార్థి ఫీజు రూ. 50 వేలకు చేరుతుందని లెక్కగట్టింది. అందులో రూ.32 వేలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లిస్తోంది. 

శ్లాబ్ పెట్టినా, పెరిగే ఫీజులో కనీసం రూ.40 వేల దాకా ప్రభుత్వం చెల్లించక తప్పకపోవచ్చు. అలా చూస్తే మిగిలేది.. కేవలం రూ.10 వేలు! ఆ మొత్తాన్ని విద్యార్థులే భరించాలంటూ ఇకపై సర్కారు చేతులు దులుపుకుంటుందన్నమాట! కానీ ఏడాదంతా కష్టపడ్డా రూ.10 వేల నికర ఆదాయం కూడా కళ్లజూడలేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేద కుటుంబాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ప్రస్తుతం కేవలం రీయింబర్స్‌మెంట్ పథకం కారణంగా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇకపై ఏ 10 వేలో సొంతగా సమకూర్చుకోవాల్సిందేనంటే వారు ఉన్నత విద్యకు దూరం కావడం అనివార్యం! 

ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా కనీసం 2 నుంచి 3 లక్షల మంది చదువుకు దూరమవుతారని అంచనా అదే జరిగితే రీయింబర్స్‌మెంట్ పథకం స్ఫూర్తి పూర్తిగా దెబ్బతిన్నట్టే. ఎస్సీ,ఎస్టీల ఫీజులను కేంద్రమే చెల్లించినా.. పథకం లబ్ధిదారుల్లో 80 శాతం దాకా ఉండే బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీరుతో అయోమయంలో పడేలా కన్పిస్తోంది. శ్లాబ్ పద్ధతి వీలవని పక్షంలో మార్కుల ప్రాతిపదికన స్కాలర్‌షిప్ ఇవ్వడం.. మౌలిక సౌకర్యాలు, సాధించే ఫలితాల ప్రాతిపదికన కాలేజీలకు గ్రేడ్‌లిచ్చి, వాటిని సాధించే కాలేజీల విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లించడం వంటివి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి! 

అసలు కోర్టు తీర్పుల సాకుతో విద్యార్థుల సంఖ్యను కుదించేందుకో, వారిపై ఆర్థిక భారం మోపేందుకు ప్రభుత్వం ఇన్ని మార్గాల్లో ఎందుకు తలబద్దలు కొట్టుకుంటోందంటే.. నాలుగేళ్ల తర్వాత నుంచి తనపై పడవచ్చని భావిస్తున్న దాదాపు రూ.2,000 కోట్ల భారాన్ని వీలైనంతగా తగ్గించుకోవడం కోసమే! సమాజానికి అమూల్య వనరులను తయారు చేసే ఉన్నత విద్యా రంగంపై వెచ్చించే మొత్తాన్ని ఇలా ఖర్చు కోణం నుంచి ఎలా చూస్తారన్న ప్రశ్న రాష్ట్రంలోని పేద విద్యార్థులందరినీ వేధిస్తోంది. అష్టకష్టాలు పడి ఉన్నత చదువుల దాకా వచ్చిన తమ పిల్లలు.. కేవలం పెరిగే ఫీజు కట్టలేని కారణంగా చదువుకు ఎక్కడ దూరమవుతారోనంటూ నిరుపేద తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

ఆంక్షలే ఆంక్షలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు ఆంక్షల పర్వం నిర్నిరోధంగా కొనసాగుతోంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగినా విద్యార్థుల గుండెల్లో దడే! ఎలాంటి ఆంక్షలు విధిస్తారో, ఎందరిని పథకం నుంచి తప్పిస్తారోనన్న అందోళనే! సర్కారీ ఆంక్షల పర్వానికి తార్కాణాలు..

* సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను పథకం నుంచి తొలగించడంతో ఆంక్షలను మొదలు పెట్టారు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు వైఎస్ హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్ కాగా, ప్రస్తుతం కోర్సు ఫీజు ఎంత ఉన్నా గరిష్టంగా రూ.20 వేలే రీయింబర్స్ చేస్తున్నారు.

* డబుల్ పీజీలకు కూడా గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వగా, ఇప్పుడు డిగ్రీ తర్వాత కేవలం పీజీకే వర్తింపజేయాలని నిర్ణయించారు.

* వయో పరిమితిని కుదించారు. 70 సంవత్సరాల వయసున్న వారు కూడా ఫీజురీయింబర్స్‌మెంట్ కింద చదువుకుంటున్నారని, ఉపాధి కోసం ఉద్దేశించిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం వయోపరిమితి నిబంధన విధిస్తామంటూ కోర్సుల వారీగా వయసును వర్గీకరించారు.

* మైనార్టీ కళాశాలల్లో చేరిన నాన్ మైనార్టీలు కన్వీనర్ కోటాలో సీటు పొందినా రీయింబర్స్‌మెంట్ ఉండదు.
* గతేడాది వరకు పారా మెడికల్ విభాగంలో 26 కోర్సులకు పథకం వర్తిస్తుండగా, దానిని 17కు కుదించారు. ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్ (వృత్తి విద్య), కలినరీ ఆర్ట్ వంటి సర్టిఫికెట్ కోర్సులను కూడా ఎత్తివేశారు.

* ఏకంగా పీజీ కోర్సులన్నింటినీ పథకం నుంచి ఎత్తివేయాలని, డిగ్రీ కోర్సులకే పరిమితం చేయాలని సర్కారు పాచిక వేసినా పారలేదు. పత్రికలు ముందే పసిగట్టి వెలుగులోనికి తీసుకురావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో తాత్కాలికంగా ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

* గేట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరిన వారిని మినహాయించారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధి పొందిన వీరి నుంచి సొమ్మును రికవరీ చేస్తున్నారు. పీహెచ్‌డీ కోర్సునూ తొలగించనున్నారు. కొందరు పీహెచ్‌డీ విద్యార్థులకు ఫెలోషిప్ వస్తుందనే సాకుతో అందరినీ మినహాయించారు!

* అఫిడవిట్, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ ఉంటేనే అర్హులని నిబంధనలు విధించారు. గత మార్చి 31 కల్లా ఆధార్ కార్డు పొందిన వారినే అర్హులుగా పరిగణిస్తామని ప్రకటించారు.

* ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల్లో అక్రమాల నిరోధం సాకుతో ఫీజుల పథకంపై విజిలెన్స్ తనిఖీలు చేయనున్నారు. జిల్లాకో విజిలెన్స్ సెల్‌తో ధ్రువీకరణ పత్రాలను నిరోధించి లబ్ధిదారులను తగ్గించడం సర్కారు వ్యూహం.

నిపుణులేమంటున్నారు?
విద్యపై చేసే వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలన్న సహజ సూత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని విద్యారంగ నిపుణులంటున్నారు. ‘‘వృత్తి విద్యా కాలేజీలకు అన్ని సౌకర్యాలు కల్పించాక మాత్రమే అనుమతివ్వాల్సి ఉంటుంది. అలాంటిది.. అనుమతులొచ్చి, ఏళ్లు గడిచిన తర్వాత.. పలు కాలేజీల్లో మౌలిక సౌకర్యాల్లేవని, వాటిలో చదివే వారికి ఫీజులు చెల్లించబోమని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తోంది. ఇది నిజంగా విడ్డూరం’’ అని అభిప్రాయపడుతున్నారు. 

ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మా వంటి కోర్సులు చదవాలంటే ప్రయోగశాలలు, అత్యుత్తమ అర్హతలతో కూడిన అధ్యాపక బృందం తప్పనిసరే అయినా.. వీటన్నింటినీకల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప పేద విద్యార్థులది ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘కావాలంటే ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం రద్దు చే సుకోవచ్చు. అంతే తప్ప యాజమాన్యాలపై ఝళిపించాల్సిన కొరడాను విద్యార్థులపైకి ఎత్తడమేమిటి? ఇది రాష్ట్ర విద్యా వ్యవస్థకు కీడు చేసే పరిణామమే’’ అని నిపుణులంటున్నారు.

గతంలోనూ ఎత్తివేత యత్నమే..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉన్నంత కాలం ఫీజుల పథకం సజావుగా సాగిపోయింది. ప్రభుత్వం వైపు నుంచి చెల్లించాల్సిన బకాయిలు కాస్తో కూస్తో ఉన్నా.. విద్యార్థులకు గానీ, వారి తల్లిదండ్రులకు గానీ ఫీజుల భారం గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏనాడూ తలెత్తలేదు. రోశయ్య పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ పథకం అమలు గాడి తప్పింది. బకాయిలు భారీగా పేరుకుపోయాయి. విద్యార్థులను ఈ పథకం నుంచి దూరం చేసేందుకు ఎన్నో రకాల ఆంక్షలూ పుట్టుకొచ్చాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు శ్లాబ్ ఫీజును ప్రకటించడం నుంచి, చదువుకు వయో పరిమితి విధించే దాకా వెళ్లాయి. 

ఈ నేపథ్యంలో ఒక్క గతేడాదే ఫీజుల పథకానికి దాదాపుగా లక్ష మంది దూరమయ్యారని అంచనా. ఫీజుల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 18 నుంచి వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. తర్వాత ఒంగోలులోనూ ఒక రోజు దీక్ష నిర్వహించారు. ఇలా వైఎస్సార్‌సీపీతో పాటు అటు ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఒత్తిడి చేయని పక్షంలో అసలు ఈపాటికే ఫీజుల పథకం పూర్తిగా అటకెక్కేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది
Share this article :

0 comments: