రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరు..

రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరు..

Written By news on Wednesday, August 15, 2012 | 8/15/2012

* ఏలూరులో ముగిసిన రెండు రోజుల ‘ఫీజు దీక్ష’
* విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన విద్యార్థులు
* వైఎస్ ఉండి ఉంటే ఫీజు పథకానికి ఏ అడ్డంకులూ ఉండేవి కావు
* అందరికీ అందేలా పూర్తి స్థాయిలో అమలయ్యేదని కచ్చితంగా చెప్పగలను
* లక్షా 45 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా.. ఎందుకు నిధులు ఇవ్వలేకపోతున్నారు?
* ఫీజు పథకాన్ని తానే పెట్టానని చంద్రబాబు చెప్పుకొంటున్నారు
* ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్కసారైనా కాలేజీలకు వెళ్లారా?
* అధికారంలో ఉండగా విద్యార్థుల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా?

ఏలూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఒక సామాజిక పెట్టుబడిగా చూశారు. దీన్ని ఆయన సంక్షేమంగా కూడా చూడలేదు. ఈ పథకం కింద కొన్ని లక్షల మంది విద్యార్థులు పెద్ద చదువులు చదివి.. ఉద్యోగాలు చేస్తే రాష్ట్రంలో సమాజ స్థాయి కూడా పెరుగుతుందని వైఎస్ ఆలోచన చేశారు. వ్యక్తిగతంగా విద్యార్థులు, ఆర్థికంగా వారి కుటుంబాలు ఎదుగుతాయని భావించారు. ఆయన ఈ రోజు ఉండి ఉంటే.. ఈ ఫీజుల పథకానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా అందరికీ అందేలా నిర్విఘ్నంగా అమలయ్యేలా చేసేవారని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఉద్ఘాటించారు. 

వైఎస్ మరణం తర్వాత ఫీజుల పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని విమర్శించారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అవగానే పెట్టిన మొట్టమొదటి విలేకరుల సమావేశంలోనే.. ఆ ఫీజుల పథకం వల్ల ఏదో అన్యాయం జరిగిపోతోందన్నట్లుగా అర్హులైన వారికి మాత్రమే ఆ పథకం అమలు చేస్తామని తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారని విమర్శించారు. పేదల ఫీజుల పథకం కోసం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెండురోజులపాటు ఆమె చేపట్టిన ‘ఫీజు దీక్ష’ మంగళవారం సాయంత్రం ముగిసింది. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు తనూజ, అఖిల, శాంతారావులు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 

అనంతరం విజయమ్మ ఉద్వేగంగా ప్రసంగించారు. ఒక సందర్భంలో ఫీజుల పథకంపై మహానేత ఆశలను, ఆశయాలను తలచుకుంటూ ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. ‘‘వారం రోజుల్లోగా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. వెంటనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊరికే చూస్తూ ఉండదు. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలయ్యే వరకూ పోరాడుతుంది’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా అర్హులైన అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లోనే ఈ పథకానికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇంతవరకు స్పష్టమైన ప్రకటనే లేదు..
ఈ ఫీజు దీక్షకు వచ్చేందుకు హైదరాబాదులో నేను బయల్దేరినప్పుడు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిగాయి.. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య అగ్రిమెంట్ కూడా కుదిరిందన్న వార్తలు వచ్చాయి. ఆ వార్తలు విన్నప్పుడు ప్రభుత్వం విద్యార్థుల కష్టసుఖాలు తెలుసుకుందేమో.. సంతోషం అనుకున్నా. ప్రభుత్వం సమయానుకూలంగా స్పందించిందనుకున్నా. అయితే స్పష్టమైన ప్రకటన చేయలేదని సమాచారం వచ్చి బయల్దేరి వచ్చాను. దీక్షలో కూర్చున్నప్పుడు కూడా నేను అడిగాను.. స్పష్టమైన హామీ ఏమైనా ఇచ్చారేమో అని! నిన్న సాయంత్రం వరకూ కూడా చూశాను. ఇవాళ వరకూ కూడా స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాలేదు. 

సుప్రీంకోర్టు తీర్పు వచ్చి కూడా రెండు వారాలైంది. కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. ఎటువంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు కోర్టుకు వెళ్లినట్లు విన్నాను. పిల్లల కష్టసుఖాలు కూడా తెలుసుకునేవాళ్లు లేకపోవడంతో ఇలా జరుగుతుందేమోనినపిస్తోంది. ముందుచూపు లేని ప్రభుత్వం వల్లే ఇదంతా జరుగుతోంది. మంచి మనసు, మానవత్వం ఉన్న పాలకులు లేరు. ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచన కూడా చేయడం లేదు. పక్క రాష్ట్రాల్లో ఈపాటికి చాలాచోట్ల కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మాత్రం ఇంకా కౌన్సెలింగే ప్రారంభం కాలేదు. దీంతో మన పిల్లలు ఏం చేయాలో దిక్కుతోచక తల్లడిల్లుతున్నారు. కొందరు వేరే రాష్ట్రాలకు పోయి చదువుకుంటున్నారు.

వైఎస్ పథకాలను నీరుగారుస్తున్నారు
రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంమీద, ఆయన చేసిన పనుల మీద, ఆయన మాట మీద వచ్చిన ఈ ప్రభుత్వం.. ఆయన పెట్టిన పథకాలను ఇవాళ ఎలాగోలా నిర్వీర్యం చేయాలని చూస్తోంది. వైఎస్ పథకాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన ఫొటో ఉండకూడదని, ఆయన పథకాలకు వేరే పేర్లు పెట్టాలని, రకరకాలుగా ఆ పథకాలను నాశనం చేస్తున్నారు. మూడేళ్లుగా చూస్తున్నాం. ప్రతి ఏటా కాలేజీలు తెరిచే సమయంలో విద్యార్థులు టెన్షన్‌కు గురవుతున్నారు. తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ప్రతి ఏటా కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని అదనపు భారంగా భావిస్తోంది. ఎప్పుడూ దీన్ని ఎలా తగ్గించాలి, ఎలా ఎత్తివేయాలా అని ఆలోచిస్తోంది. పైగా రాజశేఖరరెడ్డిని తప్పుబడుతోంది. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన పెట్టినప్పుడు దీనికి చాలా తక్కువ ఖర్చయిందట. ఇప్పుడు అది వేల కోట్లకు పెరిగిపోయిందట. రాజశేఖరరెడ్డి గారు ఉన్నా కూడా పథకం భారం గురించి ఆలోచన చేసేవారని అంటున్నారు. ఆయన మనసు అలాంటిది కాదు. ఆయన మనసు చాలా మంచిది. కొన్ని పథకాలు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి.. మాటిస్తే విశ్వసనీయత ఉండాలి. ఆ రెండు ఆయనలో ఉన్నాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కోర్టు తీర్పులు అలా..
వైఎస్ ఉన్నప్పుడు పిల్లలకు గాని, తల్లిదండ్రులకు గాని, యాజమాన్యాలకు కాని ఏ రోజూ ఈ పథకం ఆగిపోతుంది.. ఈ పథకానికి డబ్బులు రావనే భయం ఉండేది కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఈ మూడేళ్లలో యాజమాన్యాలకు ప్రభుత్వం సరిగా డబ్బులు ఇవ్వలేదు. దీంతో యాజమాన్యాలు కోర్టుకు పోయాయి. ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదని, వారికి ఈ డబ్బును సరిగా ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఇదే నేపథ్యంలో ఫీజులు కూడా పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్లుగా ఉంది ప్రభుత్వం పరిస్థితి. 

రాజశేఖరరెడ్డి సీఎం అయినప్పుడు మొట్టమొదటి బడ్జెట్‌ను రూ. 40 వేల కోట్లతో ప్రవేశపెట్టారు. ఐదు సంవత్సరాల తర్వాత అది రూ.లక్షా నాలుగు వేల కోట్లకు చేరింది. ఇవాళ ప్రభుత్వ బడ్జెట్ రూ.లక్షా 45 వేల కోట్లు ఉంది. అయినా ఫీజులు సరిగా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంతవరకూ ఫీజులనే నిర్ధారించలేదు. ఎప్పుడూ జూలైలోనే కౌన్సెలింగ్ జరపాల్సి ఉంది. ఇప్పుడు మనం ఆగస్టు మధ్యలో ఉన్నా కూడా కౌన్సెలింగ్ మొదలవ్వలేదు.

ఈ పథకాన్ని చంద్రబాబు పెట్టారా?
రాజశేఖరరెడ్డి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడం కోసం చివరి నిమిషం వరకు తపించారు. కానీ ఈ ప్రభుత్వం ఫీజుల పథకాన్ని ఎలా తగ్గించాలా అని చూస్తోంది. ఇటీవల అసెంబ్లీలో మెస్ చార్జీలు పెంచాలని అడిగితే చంద్రబాబు కనీసం నోరు మెదపలేదు. ఇప్పుడేమో ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తానే పెట్టానని చెప్పుకుంటున్నాడు. రాజశేఖరరెడ్డి పథకాలన్నింటినీ ఆయన తప్పుపట్టేవాడు. అలాంటాయన ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఒక రోజు ధర్నా చేస్తున్నాడు. ఆయన పాలించిన తొమ్మిది సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా కాలేజీలకు వెళ్లాడా? ఎప్పుడైనా ఫీజుల గురించి, చదువుల గురించి ఆలోచించాడా? అలాంటిది ఈ రోజు మీ చుట్టూ తిరుగుతున్నాడు. మరికొంతమంది ఇవి రాజశేఖరరెడ్డి పథకాలు కావంటున్నారు. మరికొందరు ఈ పథకాలను తామే చెప్పి పెట్టించామని చెబుతున్నారు. వారే చెప్పి ఉంటే ఎందుకు ఈ రోజు వాటిని సరిగా అమలు చేయించడం లేదో అర్థం కావడం లేదు. వీళ్ల రాజకీయాలు, కుసంస్కారం చూస్తుంటే బాధేస్తోంది. రాజశేఖరరెడ్డి ఫొటోలు కూడా పెట్టవద్దంటున్నారు. ఫొటో లేకపోయినా పర్వాలేదు... ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో పచ్చ బొట్టుగా నిలిచిపోయారు.

జగన్ బయట ఉంటే.. తనే వచ్చేవాడు..
వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఆయన తనయుడిగా జగన్‌మోహన్‌రెడ్డి గత రెండున్నర సంవత్సరాలుగా మీ మధ్యనే తిరిగారు. నెలకు 25 రోజులు జనం మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన బయట ఉండి ఉంటే ఇక్కడకు తనే వచ్చేవాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆందోళన చెందుతున్న విద్యార్థులకు అండగా ఏలూరు వెళ్లమని, ప్రభుత్వాన్ని నిద్ర లేపమని చెప్పాడు. అందుకే వచ్చాను. 

ప్రభుత్వం ఫీజులు సరిగా ఇవ్వకపోవడంతో 2011 ఫిబ్రవరిలో జగన్‌బాబు హైదరాబాద్‌లో వారంరోజులపాటు దీక్ష చేస్తానని ప్రకటించాడు. అప్పుడు నేను వారం రోజులు తిండి తినకుండా ఎలా.. నాన్నా అని అడిగాను. లక్షలమంది విద్యార్థులు బాధపడుతున్నారు. వారం రోజులు తిండి లేకపోతే ఏమిటమ్మా అని దీక్ష చేశాడు. విద్యార్థులకు మరోసారి ఈ పరిస్థితి రాకూడదనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్సార్ అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించాడు. పిల్లలను కూలికి కాకుండా బడికి పంపే తల్లులకు ప్రోత్సాహకంగా వారి ఖాతాలో డబ్బులు వేస్తానని ప్రకటించాడు. జగన్ బాబు త్వరలో మీ ముందుకు వస్తాడు. ఆయన తప్పకుండా సీఎం అవుతాడు. ఆయన చెప్పిన పథకాలే కాకుండా ఆయన తండ్రి పెట్టిన పథకాలను కూడా అమలు చేస్తాడు.

ఉద్వేగానికి లోనైన విజయమ్మ
ప్రసంగంలో మహానేత వైఎస్ గురించి మాట్లాడుతున్నప్పుడు విజయమ్మ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. బయటకు వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. ‘‘వైఎస్ పై నుంచి ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే.. చాలా బాధపడుతుంటారు. ఆయన పరిపాలన వేరు.. ఆయన తలచిన ప్రభుత్వం వేరు. ఆయన ఆశించిన రాష్ట్రం వేరు. ఈ సెప్టెంబర్ 2కు ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి మూడేళ్లవుతోంది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే నాకే చాలా బాధనిపిస్తోంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరు..
‘‘ఈ ప్రభుత్వాన్ని చూస్తే నాకు బాధనిపిస్తోంది. భారీగా పెరిగిన ఈ ధరలతో రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరు. ప్రతి ఒక్కరూ ఎలా బతకాలిరా దేవుడా అని బాధపడుతున్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల మోత మోగించారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. ఎరువుల ధరలు 300 శాతం పెంచారు. గ్యాస్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచారు. నిత్యావసర ధరలు కూడా బాగా పెరిగాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. వైఎస్ ఆశించింది ఇదేనా?’’
Share this article :

0 comments: