సర్కారు నిద్ర వదిలిద్దాం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సర్కారు నిద్ర వదిలిద్దాం: విజయమ్మ

సర్కారు నిద్ర వదిలిద్దాం: విజయమ్మ

Written By news on Thursday, August 30, 2012 | 8/30/2012

ప్రజలకు వైఎస్ విజయమ్మ పిలుపు

విద్యుత్ సమస్యపై వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో మహాధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో చీకట్లు

రైతుకు కనీసం రెండు, మూడు గంటలు కూడా సక్రమంగా అందని విద్యుత్.. 5 వేల నుంచి 10 వేల పరిశ్రమల మూత

విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం విఫలం

పులివెందుల (వైఎస్‌ఆర్ జిల్లా) న్యూస్‌లైన్ : ‘‘మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొలపాలి. విద్యుత్ సమస్యపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. విద్యుత్ కోతలకు నిరసనగా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోంది. సర్కారు నిర్లక్ష్యంతో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరుకున్న విద్యుత్తు సమస్యపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి. గురువారం జరిగే ధర్నాలు, శుక్రవారం నిర్వహించే బంద్ ద్వారా ప్రజా నిరసనను సర్కారుకు వినిపించాలి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు. ప్రజా పార్టీ. ప్రజా సంక్షేమం కోసం యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారు. వైఎస్‌లో ఉన్న మనస్సు జగన్‌బాబులో ఉంది. ప్రతి ఒక్కరూ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. అకుంఠిత దీక్షతో ఉద్యమించాలి. మన ప్రభుత్వం వచ్చేవరకు పోరాటం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

కరెంటు సమస్య ఉత్పన్నమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందే తెలిసినా అవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే రాష్ట్రంలో చీకటి పరిస్థితులు నెలకొన్నాయని విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘వైఎస్‌ఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండేవారు. ఆ మహానేత మరణం తర్వాత ఏ ఒక్క సామాజికవర్గం కూడా సంతోషంగా లేదు. ప్రస్తుత ప్రభుత్వాలవల్ల రైతులకు భరోసా లేకుండాపోయింది. సబ్సిడీ విత్తనాలు దొరకడంలేదు. ఎరువుల ధరలు 300 శాతం పెంచారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. దీంతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం గ్రామాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు పెడుతోంది. వ్యవసాయానికి రెండు, మూడు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. పరిశ్రమలకు వారంలో 3 రోజులు కోత విధిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 10 వేల వరకు పరిశ్రమలు మూతపడి 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడటం బాధాకరం. ఎన్నో కష్టాలు పడి వైఎస్‌ఆర్ అందించిన ప్రభుత్వాన్ని కూడా సరిగా నడుపుకోలేకపోతున్నారు. ఆయన మరణం తర్వాత ప్రస్తుత సర్కారు రెండుమార్లు విద్యుత్ చార్జీలు పెంచింది. సర్‌చార్జిలను వడ్డించేందుకు సిద్ధపడగా కోర్టు అక్షింతలు వేయడంతో ఆగారు. విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యతను నాయకులు విస్మరించారు. నాయకుడికి ముందుచూపు ఉండాలి. వైఎస్‌ఆర్ ఎన్నోసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరెంటు సమస్యను అధిగమించారు. తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేచి కరెంటు, ప్రాజెక్టుల్లో నీరు, నిత్యావసర సరుకుల ధరలు, ఇతర సమస్యలపై సమీక్షించే వారు. 2008లో రాష్ట్రానికి బొగ్గు అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి రూ.6 వేల కోట్లకు కొనుగోలు చేసి ప్రజలకు కరెంటు కష్టాలు తెలియకుండా పాలన సాగించారు. ప్రజలకు సంబంధించి పైసా కూడా పన్ను పెంచకుండా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వమేనని సగర్వంగా చెబుతున్నాను’’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడం వల్ల సర్పంచ్‌లు లేక గ్రామంలో ప్రతిదీ సమస్యగానే మారిపోయిందన్నారు.

ఉచిత విద్యుత్‌పై చంద్రబాబు ప్రగల్భాలు

ఉచిత విద్యుత్ అంటే దుస్తులు ఆరేసుకోవడానికేనని వ్యాఖ్యానించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనాడు ఏడు గంటలు కాదు.. 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా అమలు చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తే ‘ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాను’ అన్న చందంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు చాలాసార్లు కరెంటు చార్జీలు పెంచారని, అందుకు నిరసనగా వైఎస్‌ఆర్ బషీర్‌బాగ్ వద్ద 11 రోజులు నిరాహార దీక్ష చేసినా స్పందించలేదని అన్నారు. పైగా, నిరసన తెలిపిన వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలువురిని పొట్టన పెట్టుకుందని విమర్శించారు
Share this article :

0 comments: