స్వాతంత్య్రఫలసిద్ధి ఎన్నటికి?! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్వాతంత్య్రఫలసిద్ధి ఎన్నటికి?!

స్వాతంత్య్రఫలసిద్ధి ఎన్నటికి?!

Written By news on Wednesday, August 15, 2012 | 8/15/2012

సంబరాలతో సరిపోదు!

1947, ఆగస్టు 15. బ్రిటిష్ పాలకులు కాంగ్రెస్ నాయకులకు పరిపాలనా స్వాతంత్య్రం ఇచ్చి దేశం విడిచి వెళ్లిపోయిన రోజు. వాళ్లు పోయారు కాని వారి పరి పాలనా పద్ధతులు, వారి కట్టూ, బట్టా, వారి ఆలోచనా విధా నాలు, వారు ప్రవేశపెట్టిన మెకాలే విద్యావిధానం, వారి భాషా సంస్కృతులు ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. వారు ప్రవేశపెట్టిన చట్టాలన్నీ యథాతథంగా చాలా కాలం కాంగ్రెస్ పాలకులు అమలు పరుస్తూవచ్చారు. ఎప్పుడో 1894 నాటి భూమికి సంబం ధించిన చట్టం ఈ నాటికీ అమల్లో ఉంది. బానిసబుద్ధికి ఉన్న శక్తి అలాంటిది. అందుకనే కాబోలు, ప్రస్తుత పాల కులు మన వ్యవసాయ, పారిశ్రామిక, రక్షణరంగాలను అమె రికా కనుసన్నల్లో నడిపిస్తున్నారు. అమెరికా మన కోసం వండివార్చే ఆలోచనలే దేశ పాలకులకు దిక్సూచిగా ఉంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ప్రధానులు, మంత్రులు, అధికారులు ఎంత మంది, ఎన్నిసార్లు అమెరికా వెళ్లి వచ్చారో ఎవరైనా లెక్కతీస్తే మనలను వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్ సర్వస్వతంత్రులుగా పాలించారా? లేక అమెరికా ఆదేశాలను అమలుపరిచే గుమాస్తాలుగా మారి పోయి అస్వతంత్రులుగా పాలించారా? అనే సందేహం రాకమానదు.

అయితే, అమెరికా తన ఆదేశాలను ‘సలహా’లుగా ప్రపంచ బ్యాంకు ముసుగులో అందిస్తూ పరోక్షంగా దేశా న్ని అమెరికాలోనే మరో రాష్ట్రమా అన్నట్లు తన చెప్పు చేతల్లో పెట్టుకుంటోంది. అంటే సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష పరిపాలనస్థానే, ఆర్థిక సామ్రాజ్యవాదుల పాలనలో ఆగస్టు 15 ‘స్వాతంత్య్ర’ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆర్థిక సామ్రాజ్యవాదానికి, పెట్టుబడికి ప్రధాన కే్రందం అమెరికా. సోవియట్ యూనియన్ ప్రపంచ పటం నుంచి అంతర్థానమైన తరువాత, అమెరికా మరీ పేట్రేగిపోయిం ది. ప్రపంచ దేశాలన్నింటినీ తన పాదాక్రాంతం చేసుకోవ టానికి పావులు కదపటం ప్రారంభించి, ఇరాక్‌ను మింగిం ది. ఇరాన్‌ను కబళించటానికి తొక్కని అడ్డదారి లేదు. కానీ ఈ లోగా చైనా గొంతులో వెలక్కాయలా అడ్డం పడింది. కక్కడానికీ లేదు. మింగడానికీ లేదు. తన దేశంలోనే ప్రజలకు అక్కడి ప్రభుత్వ విధానాలు ముళ్లు గుచ్చుకుం టున్నట్లున్నాయి.

ప్రపంచ దేశాలన్నింటినీ నయానా భయానా లోబరచుకోవటం మాటేమోగాని, తన దేశ ప్రజలే వాల్‌స్ట్రీట్ మీద దండయాత్ర చేశారు. 21వ శతా బ్దం ఆసియా శతాబ్దం కాబోతుందనే సూచనగా 2008, సెప్టెంబర్‌లో అమెరికాలో సంక్షోభం ఏర్పడి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది. ఆ సంక్షోభం నుంచి ఇంకా కోలుకోకముందే, 2010లో యూరోపియన్ దేశాలతో సహా అమెరికా మరో సంక్షోభంలో పడింది. ఈసారి అది మన దేశాన్ని కూడా తాకింది. ఇలా రెండు సంక్షోభాల్లో చిక్కుకొన్న అమెరికాను మన ప్రధాని మన్మోహన్‌సింగ్ కౌగలించుకో వడమేమిటి? జోగి జోగి రాసుకొంటే రాలేది బూడిదే, రత్నాలు కాదు.

కేంద్ర ప్రభుత్వం సవాలక్ష సమస్యల్లో పడి గిలగిలా కొట్టుకుంటోంది. వాటిని పరిష్కరించలేక, ఈ సమస్య లన్నీ యూరోప్, అమెరికా దేశాల సంక్షోభాల మూలం గానే అనే సిగ్గుబిళ్ల అడ్డం పెట్టుకుంటోంది. తినడానికి తిండిగింజలు, తాగడానికి మంచినీరైనా దొరకని దుస్థి తిలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. చేతనైన చోట తిరగబడుతున్నారు. నిర్బంధం హద్దుమీరి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గదిలో బంధించి కొడితే పిల్లి అయినా తిరగ బడుతుంది.
మనకు స్వాతంత్య్రం వచ్చిందా? అసలు స్వాతం త్య్రం అంటే ఎలా ఉండాలి? అనే అంశం గురించి అల నాడు బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి దేశ పరిపాలనను అందిపుచ్చుకున్న నాయకుల్లో అత్యంత ప్రముఖులైన సర్దార్ పటేల్ ఏమన్నాడో చూడండి.

‘‘మనం సాధించింది స్వరాజ్యం కాదు. విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే. ప్రజలు అంతర్గత స్వరాజ్యం సాధించాలి. కులనిర్మూలన, అంటరానితనం అంతరిం చాలి. ఆకలి నుంచి నిష్కృతి సాధించాలి. ఒకే కుటుం బంగా మెలగాలి. నవజీవనానికి బాటలువేయాలి. మన సులుమారాలి. దృక్పథం మార్చుకోవాలి. గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పురాకపోతే, స్వరాజ్యం దుమ్ము, బూడి దతో సమానం’’

వీటిలో ఏ ఒక్క లక్ష్యమైనా సాధించగలిగామా? అనే ప్రశ్న అడిగే స్వతంత్రం మాత్రమే మనకు వచ్చింది. మన పాలకులకు మాత్రం పరిపూర్ణమైన స్వాతం త్య్రం వచ్చింది. దేనికి? ధరలు పెంచడానికి, పేదలెవరో 65 సంవత్సరాల తర్వాత కూడా నిర్వచించలేకపోవడానికి, ఎవరైనా నోరు విప్పి అడిగితే లాఠీచార్జి, కాల్పులు జరపడానికి, ప్రభుత్వరంగంలో ఉన్న సంస్థల్లో షేర్లు ప్రైవేట్ రంగానికి అమ్మడానికి, కార్మికుల హక్కులను కాలరాయడానికి, ఏ విదేశీయులను వెళ్లగొట్టామో, వారిని ఎర్రతివాచీ పరచి దేశంలోకి ఆహ్వా నించడానికి, దేశ రక్షణ కవచానికి చిల్లులు పొడవడానికి, వ్యవసాయరంగం కార్పొరేటీకరణకు... కాంగ్రెస్ నాయకు లకు స్వతంత్రం వచ్చేసింది. ఇలా దేశం పతనావస్థకు ఎం దుకు చేరుకుంది... కారణాలేమిటి?

ఏమైనా, ఆగస్టు 15 దేశ చరిత్రలో ఒక మైలురాయి. ఇక్కడ నిల్చొని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే -

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిష్ర్కమించారు. అమెరి కన్ సామ్రాజ్యవాదులను, బహుళజాతి సంస్థలను మన దేశాన్ని దోచుకోమని ఆహ్వానిస్తున్నాం.
ప్రకృతి ఇచ్చిన సహజ సంపదలను దోచుకొమ్మని కార్పొరేట్లను, బహుళజాతిసంస్థలను ఆహ్వానించాం.
దేశంలో సుమారు ఆరుకోట్ల ఆహార ధాన్యాల నిల్వ లుండగా ఎగుమతి చేయడానికి అనుమతిస్తున్నామే గాని, కోట్లాది మంది కడుపులు మాడుతున్నా పట్టిం చుకోవడం లేదు.

ఎరువులు, విత్తనాల కోసం దిగుమతుల మీద ఆధార పడుతున్నాం. పంట ఖర్చులు పెరిగినా, గిట్టుబాటు ధర దక్కడం లేదు. బ్యాంకులు సకాలంలో రుణాలు అందించక, అందించిన కాసిన్ని నిధులు ధనిక రైతు లకే అందజేస్తూండటంతో, రైతులు వడ్డీ వ్యాపార స్తుల మీద ఆధారపడి, తిరిగి చెల్లించలేక వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

పరిశ్రమలొచ్చాయి గాని విద్యుచ్ఛక్తి కొరత. విద్యాసంస్థలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కాని ఒకటో తరగ తిలో చేరిన ప్రతి నూరు మందిలో సుమారు 90 మంది హైస్కూలు విద్యతో ఆగిపోతున్నారు. మిగతా వారు లక్షల మంది ఉన్నత విద్య పూర్తి చేసినా, వారి లో చాలా మంది నిరుద్యోగులుగా వీధుల్లో పడ్డారు.

వైద్య సౌకర్యాలు పెరిగాయి. కానీ, ప్రభుత్వ వైద్యశా లల్లో మందుల కొరత. ఆస్పత్రుల్లో శిశుమరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ పరిణామాల కారణంగా ప్రజలు అసంతృప్త జీవులవుతున్నారు. ప్రభుత్వాల చర్మం మొద్దుబారింది. కాబట్టి కోల్పోయిన స్పర్శజ్ఞానాన్ని ప్రజలు తమదైన పద్ధతిలో ప్రభుత్వాలకు కలిగించాలి.


మరో మారు అదే తీరు!

మరో స్వాతంత్య్ర దినం వస్తూ ఉన్నది. యథావిధిగా ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండా ఆవిష్కరించి, అక్కడ ప్రసంగిస్తారు. అయితే స్వదేశీ, విదేశీ టైస్టులు దాడిచేసే అవకాశం ఉందని ముందుగా ఇంటెలిజెన్స్ వారికి తెలియడం తో వారు పోలీస్ శాఖను అప్రమత్తం చేస్తారు. అందుకని ఆ కార్యక్రమానికి ముందుగానే పోలీస్ శునకాల సాయం తో తమ వద్ద ఉన్న అధునాతన సాంకేతిక పరికరాలతో ఆ ప్రదేశమంతా పోలీసులు అణువణువు గాలిస్తారు! ఏ విధమైన దాడి జరిగేందుకు అవకాశం లేకుండా ఇతర భద్రతా చర్యలను కూడా చేపడతారు. ప్రధాని ప్రసంగం వినేందుకు రకరకాల యూనిఫారాలలో ఉన్న స్కూలు విద్యార్థినీ విద్యార్థులను బస్సులలో తీసుకువస్తారు. ఠంచనుగా అనుకున్న సమ యానికి ప్రధాని విచ్చేసి జెండా ఆవిష్కరిస్తారు. ఆయన ప్రసంగమంతా పాఠం అప్పజెప్పినట్లు సాగుతుంది. జన గణమనతో ఆ తంతు ముగుస్తుంది. మన రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి, ఢిల్లీలో ప్రధాని చేసే పనిని ఇక్కడ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో చేస్తారు. మిగిలిన తతంగ మంతా యథావిధే.

ముఖ్యమంత్రి పెరేడ్ గ్రౌండ్స్‌కు వెళుతుండగా దారిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం హామీ లేదనో లేదా మరేదో ప్రధాన సమస్యపైనో విద్యార్థులు వారి నేతలు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని తమ సమస్యపై వినతి పత్రం ఇచ్చేందుకు ఉద్యుక్తులవుతారు. పోలీసులు చూస్తూ ఊరుకుంటారా! వాళ్లున్నదెందుకు? బలవంతంగా ఉద్యమకారులను లాగివేసేందుకు ప్రయ త్నిస్తారు. ఉద్యమకారులు ప్రతిఘటిస్తారు. ఇక పోలీసులు లాఠీ ప్రయోగమో, అవసరాన్ని బట్టి రబ్బరు బుల్లెట్లో ప్రయోగించి వారిని తొలగించి లారీలలో ఎక్కించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళతారు. ఇంత మందిని స్టేషన్‌లో ఎలా ఉంచుకోగలరు? అందుకని వ్యక్తి గత పూచీకత్తుపైనో, లేకుండానో వారిని స్వాతంత్య్ర దినో త్సవ కార్యక్రమం ముగిసిన తదుపరి విడుదల చేస్తారు.

ఇక ప్రధాని ప్రసంగంపై ఆరోజే దాదాపు ఆయన ప్రసంగం పూర్తి అవుతుందనగానే వివిధ టీవీ చానల్స్‌లో విశ్లేషణలు ప్రారంభమవుతాయి. దానిలో పాల్గొన్న అధి కారపార్టీ ప్రతినిధులు ప్రధాని ప్రసంగాన్ని దార్శనికతతో కూడిన నిర్మాణాత్మక ఆచరణయుత ప్రసంగమనీ, దేశ ప్రజలను ఉత్తేజపరిచేదిగా ఉందనీ ప్రశంసలజల్లు కురిపి స్తారు. ఉదాహరణకు అందరూ అనుకుంటున్నట్లు దారి ద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ, కుటుంబానికి ఒక ‘సెల్‌ఫోన్’, కొంత టాక్‌టైమ్ ఉచితంగా ఇస్తామన్న వాగ్దా నం ప్రధాని చేస్తే అదెంతో గొప్ప చర్య అనీ ప్రపంచ దేశా లలో, అత్యధిక సెల్‌ఫోన్‌లు ఉన్న దేశంగా శాస్త్ర సాంకేతిక రంగంలో మన దేశ పురోగమనానికి చిహ్నంగా అభివర్ణి స్తారు. ఇక ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తారు. పాత చింత కాయ పచ్చడల్లే ఉందని, ధరల పెరుగుదలను, అవినీతిని అరికట్టే నిర్దుష్ట చర్యలనేమీ ప్రధాని పేర్కొనలేదని, ఆహార భద్రత అత్యావశ్యకమైన వారికి సెల్‌ఫోన్‌లు ఇవ్వడమే మిటి? అంటూ ఘాటుగా విమర్శిస్తారు.
ఇక ఆస్థాన విశ్లేషకులు సరేసరి. ‘ఇంతకుముందు ఇదే చానల్‌లో నేను చెప్పినట్లు’ అంటూ మొదలెడతారు. అరు దుగా కొన్ని పరిణతి చెందిన విశ్లేషణలూ ఉండకపోవు. ఇక మర్నాడు పత్రికలలో ప్రధాని ప్రసంగం పతాక శీర్షికగానో, ప్రముఖంగానో తొలిపుటలో ముద్రితమవుతుంది. ఆ ప్రసంగంతోపాటే ఆ ప్రసంగంపై వివిధ పార్టీల ప్రతిస్పం దన కూడా వస్తుంది. టీవీ చానళ్లలో జరిగిన తంతే ఇక్కడా సాగుతుంది. అంతటితో ఈ ఏడాది స్వాతంత్య్ర దివస క్రతువు ముగుస్తుంది.
ఇక అంతా మామూలే. ధరలు పెరుగుతూనే ఉం టాయి. పేద, దిగువ మధ్యతరగతి ప్రజానీకం నాలుగు వేళ్లు నోట్లోకి పోయేందుకు నానా తంటాలు పడుతూనే ఉంటారు.

వారి ఉద్యమాలపై పోలీస్ జులుం మామూలే! దొంగతనాలు, దౌర్జన్యాలు, దోపిడీలు షరా మామూలే. ‘శాంతి, సహనం, సమభావంపై విరిగెను గూండా లాఠీ!’ అని ఆరుద్రగారన్నట్లే జరుగుతూ ఉంటుంది. ఒక మం త్రిగారి తనయుడు రహస్యంగా పేకాట ఆడే క్లబ్బులో దొరికినప్పుడు, ఆయనెవరో తెలిసో తెలియకో పోలీసులు నిర్బంధిస్తారు. ఆ పోలీసులపై ఆ అమాత్యుని తనయుడు ‘నువ్వెంత? నీ హజం ఎంత?’ అని వీరావేశంతో ఊగిపో తాడు. ఇంకో మంత్రిగారు మరో సందర్భంలో ‘బట్టలూ డదీసి కొడతా! ఏమనుకున్నారు?’ అని సీఐపై విరుచుకు పడతాడు. కాస్త వ్యక్తిత్వం ఉన్న ఆ సీఐ అమాత్యునిపై డ్యూటీలో ఉన్న అధికారిని అవమానించిన అభియోగంతో కేసు పెడతారు. కానీ అమాత్యుని అరెస్టు చేయరు. మంత్రిపై కేసు పెట్టినందుకు పాలకపక్షం నేతలు, అగ్గిమీద గుగ్గిలమై, అమాత్యునికి అండగా నిలుస్తారు. సీనియర్ నాయకుడొకరు ‘మన పార్టీ అధికారంలో ఉంది. మరి మన మంత్రిపైనే కేసులు పెడితే ఎలా? అంటూ వాపోతాడు.

వారెవ్వరూ ఆ మంత్రి ఆగడాన్ని ప్రశ్నించరు. మన అమా త్యునిపై ఆయన పూర్వా శ్రమంలో చేసిన నేరానికి కోర్టు దశాబ్దం తర్వాత ఆయ నను దోషిగా తేల్చి శిక్ష విధిస్తుంది. ‘అమాత్యుడు దోషిగా తేలిన తర్వాత కూడా ఆయన రాజీ నామా ఇవ్వరా? ముఖ్యమంత్రి ఆయనను బర్తరఫ్ చేయరా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ‘అది నేను రాజ కీయాలలోకి రాకముందు జరిగిన నేరం... ఏదో చిన్న మతిమరుపు వలన జరిగింది. అయినా అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకుంటానని ఆ మంత్రివర్యులు సెలవిస్తారు. అది పెద్ద నేరమేమీ కాదని, సాధారణంగా పారిశ్రామికవేత్తలకు అలా జరుగుతూనే ఉంటుందని పాలక పార్టీలో మరో పారిశ్రామికవేత్త వత్తాసు! చెప్పే దేముంది? వీటన్నింటిపైనా టీవీ చానళ్లలో చర్చలు.

‘రాజకీయాలలోకి రాక ముందు హత్య చేసినా అది ఆయన మంత్రి అయిన తర్వాత నిరూపితమైతే ఆయన రాజీ నామా ఇవ్వనవసరం లేదా? అని ప్రతిపక్షాలకు మరో కొత్త వాగాస్త్రాన్ని అంది స్తారొక విశ్లేషకులు! అదే సమ యంలో ఏ నేరమూ నిరూపణ కాకపోయినా, అదే నేరారో పణకు గురైన అమాత్యులకు ముఖ్యమంత్రివర్యులే పరిశుద్ధులని సర్టిఫికెట్ ఇస్తూనే, ప్రతిపక్షనేతగా ఉన్నాడు కనుక ఒక యువనేతను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం! పాలకులు తమ చేతిలోని సీబీఐ, సీఐడీ, ఏసీబీ వంటి సంస్థలను ప్రయోగించి, ప్రతిపక్ష నేతలపై ఆస్తుల అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంటారు. పరస్పర ఐక్యతను సాధించి, ప్రజావ్యతిరేక పాలనను ఎదిరించాల్సిన కమ్యూనిస్టు పార్టీ లు, తమ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు ఆశాభంగం కలి గించే రీతిలో పరస్పర విమర్శలు, దూషణలు! అయినా ఏదో మేర తమ మధ్య ఐక్యతకై అరకొర ప్రయత్నాలు.

రాజకీయపరంగా, మీడియా పరంగా ఇదీ స్వాతంత్ర దినోత్సవ వేళ మన పరిస్థితి! మళ్లీ మధ్యలో ‘రిపబ్లిక్‌డే’ వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ల ప్రసంగాల జోరు ప్రజలకు ఎటూ తప్పదు. అప్పుడూ ఇదే తంతు. అన్నట్లు మళ్లీ 2013 ఆగస్టు 15 రావాలి కదా! చూద్దాం... ఈ ఏడాదిలోనైనా ప్రజాజీవితంలో శాంతి, సౌభాగ్యం, కనీస జీవితావసరాలైన తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం అందరికీ లభిస్తాయేమో!!
Share this article :

0 comments: