'అస్సాం' వదంతుల గుట్టురట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'అస్సాం' వదంతుల గుట్టురట్టు

'అస్సాం' వదంతుల గుట్టురట్టు

Written By news on Sunday, August 19, 2012 | 8/19/2012


అస్సాంలో చెలరేగిన అల్లర్ల సెగ దేశవ్యాప్తంగా తగిలింది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉంటున్న ఈశాన్య ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన వదంతుల గుట్టు రట్టయింది. పుకార్ల విషయంలో ప్రభుత్వం అనుమానాలు నిజమయ్యాయి. వాటికి మూలం పాకిస్థాన్‌లో ఉందని తేలిపోయింది. పాక్‌లో 76 వెబ్‌సైట్లలో గంపగుత్త ఎస్‌ఎంఎస్‌లు, మార్పులు చేసిన చిత్రాలను అప్‌లోడ్ చేసినట్లు గుర్తించినట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ శనివారం (18.08.2012) ఢిల్లీలో వెల్లడించారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు తుపాన్లు, భూకంపాల మృతుల ఫొటోలకు మార్పులు చేసి, వాటిని మయన్మార్ హింసాకాండ మృతులవిగా పేర్కొంటూ ఈ వెబ్‌సైట్లలో ఉంచారని ఆయన వివరించారు. ‘ఇది అత్యంత గర్హనీయం. ఈ వెబ్‌సైట్లను బ్లాక్ చేశాం. మరో 34 వెబ్‌సైట్లను గుర్తించాం. వాటినీ త్వరలో బ్లాక్ చేస్తాం’ అని ఆయన చెప్పారు. ‘వదంతుల ప్రచారం పాక్ నుంచే జరిగిందని ప్రతి ఒక్కరికీ తెలియాలి. దీన్ని పాక్ ముందు లేవనెత్తుతాం. వాళ్లు కచ్చితంగా తోసిపుచ్చుతారు. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో మా సాంకేతిక నిపుణుల బృందానికి కచ్చితంగా తెలుసు’ అని అన్నారు.

నివురుగప్పిన నిప్పులా ఉన్న అస్సాం ఒక్కసారి భగ్గుమంది. ఎప్పటినుంచో జాతుల విద్వేషంతో రగులుతున్న కక్ష్యలు ఇప్పుడు బుసకొట్టాయి. ఒకదాని వెంట ఒకటి జరిగిన హత్యాకాండలతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కేంద్ర ప్రభుత్వం సమయానికి స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శ సర్వత్రా వినవస్తోంది. అస్సాంలో జరిగిన హింస ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకూ పాకింది. బతుకుదెరువు కోసం దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఈశాన్య రాష్ట్రాల వారు భయంతో వణికిపోతున్నారు. దాడుల పుకార్లతో సొంత రాష్ట్రం బాట పట్టారు. ఇద్దరి హత్యతో మొదలైన ఘర్షణలు అస్సాంను నిప్పుల కుంపటిగా మార్చేశాయి. దాడుల్ని ఆపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయి.

అల్లర్ల నేపధ్యం:

అస్సాంలో స్థానిక బోడో గిరిజనులకు, ముస్లిం మైనారిటీ వలసవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు బలమైన కారణాలే ఉన్నాయి. గత జూలై 10న కోక్రాఝర్‌లో ఇద్దరు బోడో విద్యార్థి సంఘాల నేతలపై కాల్పులు జరిగాయి. వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతం చిలికిచిలికి గాలివానలా మారి పలు జిల్లాల్లో ఘర్షణలకు దారితీసింది. జులై 19న ఇద్దరు బంగ్లాదేశీ వలసదారులపై దాడి చేసి హత్య చేశారు. ఆ హింసాగ్ని మొత్తం అస్సాంకు పాకింది. జులై 20న బొడోలాండ్‌ పీపుల్‌ ఫ్రంట్‌ వర్కర్స్‌ నలుగురు నమాపారా గ్రామం వద్ద హత్యకు గురయ్యారు. జులై 21 కొక్రాఝర్‌ జిల్లా దురామరి వద్ద గన్‌మేన్‌ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒకరు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు నుంచి కోక్రాఝర్‌ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అదే రోజు ముగ్గురు బోడోలు హత్యకు గురయ్యారు. గొసైన్‌గావ్ లో ఇద్దర్ని కాల్చి చంపారు. జులై 22న కోక్రాఝర్‌ జిల్లాలో నాలుగు మృతదేహాలు లభించాయి. ఈ హింస ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వ్యాపించింది. జులై 22నే చిరాంగ్‌ జిల్లాలోని బిజిని పట్టణంలోమంగోలియన్‌ బజార్‌లో మరో ఇద్దరు హత్యకు గురయ్యారు.

ఇంత జరుగుతున్నా అస్సాం ప్రభుత్వం వెంటనే తగిన రీతిలో స్పందించలేదు. ఆలస్యంగా తేరుకుంది. జులై 24న కేంద్ర సాయాన్ని అర్థించింది. ఆ రోజే గౌహతికి వెళ్లాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలుపై దాడులు జరిగాయి. నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి. కేంద్ర బలగాల సాయంతో రైలు సర్వీసుల్ని జులై 25న పునఃప్రారంభించారు. ఈ దాడులు వ్యాపించడానికి కేంద్రం ప్రభుత్వమే కారణమని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ జులై 27న కేంద్రంపై మండిపడ్డారు. సరైన సమయంలో బలగాల్ని పంపలేదని విమర్శించారు.

ఇప్పటివరకు జరిగిన హింసాకాండలో మొత్తం 77 మంది మరణించారు. దాదాపు నాలుగు లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మొత్తం 270 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొక్రాఝర్‌, చిరాంగ్‌, ధుబ్రి, కామ్‌రూప్‌, బక్సా జిల్లాలు అల్లర్లతో దెబ్బతిన్నాయి. 400 పైగా గ్రామాలు అల్లర్లతో అట్టుడికాయి. జులై 28న పీఎం మన్మోహన్ కోక్రాఝర్‌ జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో పర్యటించారు. జరిగిన సంఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆగస్టు 7న సీఎం గొగోయ్‌ డిమాండ్‌ చేశారు.

అల్లర్లు సద్దుమణిగాయనుకుంటున్న సమయంలో దాడుల భయం మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లకు వ్యాపించాయి. ఆగస్టు 11న మహారాష్ట్రలో చెలరేగిన అల్లర్లు హింసకు దారితీశాయి. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న అస్సామీయులపై దాడులు చేస్తామంటూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పుకార్లు వ్యాపించాయి. తమ జీవనోపాధిని వదులుకొని, సొంతరాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, కోయంబత్తూరు, మదురైల నుంచి వారు ఇళ్లకు మళ్లుతున్నారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ పుణ్యమా అని వందంతులు శరవేగంగా వ్యాపించడం కూడా ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. భద్రతపై రాజకీయ నాయకులతోపాటు, పోలీసు ఉన్నతాధికారుల హామీలిస్తున్నా, ఉపయోగం లేనంత తీవ్రస్థాయికి వదంతులు ప్రచారమైపోయాయి. దీనితో ఈ పుకార్లు వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం 15 రోజులపాటు బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లపై నిషేధం విధించింది. ఎంత ధైర్యం చెప్పినా అస్సామీయులను భయం వీడలేదు. వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతూనే ఉన్నారు. వారంతా 18-25 సంవత్సరాల మధ్య వయసువారే. వీరందరూ సెక్యూరిటీ గార్డులుగా, రెస్టారెంట్లలో పనులు చేసేవారు. దక్షిణాది నుంచి అస్సాంకు వెళ్లే రైళ్లు కిక్కిరిసిన జనాలతో వెళ్తున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో ప్రైవేటు సంస్థలకు తీవ్రమైన సెక్యూరిటీ సిబ్బంది కొరత ఏర్పడుతుంది.

అసోం అంశంపై ఆగస్టు 17న పార్లమెంట్‌ దద్దరిల్లింది. పూణే, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ఈశాన్యారాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్ళకు వెళ్ళిపోతుండటంపై ఉభయసభలూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవ్వరూ స్వస్థలాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రక్షణ కల్పిస్తాయని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారిని, పుకార్లు సృష్టిస్తోన్న వారిని కఠినంగా శిక్షించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలు దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించే, పనిచేసే, చదువుకునే హక్కు కలిగి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశమంతా ఒకే తాటిపై నిలబడి ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంఘీభావం తెలపాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఎవరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుందో స్పష్టం చేయాలని జెడియూ నేత శరద్‌యాదవ్‌ కోరారు.

ఈశాన్య రాష్ట్రాల శాంతిభద్రతల పరిస్థితిపై పార్లమెంట్‌ ఉభయసభలూ చర్చించాయి. పుకార్లు, బెదిరింపులకు పాల్పడుతోన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నేతలూ డిమాండ్‌ చేశారు. అసోం సహా ఈశాన్య రాష్ట్రాల ప్రజలందరికీ పార్లమెంట్‌ సంఘీభావం తెలిపింది. పుకార్లు సృష్టించడంలో విదేశీయుల పాత్ర ఉందేమో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాంతాలలో ఉండే అస్సామీయులు అభద్రతతో అస్సాం తరలి వెళ్లడానికి కేంద్రం నిర్లక్ష్యం, కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు విధానాలే కారణమని బీజేపీ ఆరోపించింది. ఇదంతా పకడ్బందీ ప్రణాళికతో జరుగుతోందని, ఇంటెలిజెన్స్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు.

అసలు కారణాలు:
అస్సాంలోకి విదేశీయుల వలస ఎక్కువైంది. వలసలను అరికట్టేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. స్థానిక బోడో తెగలకు, మైనారిటీ వలసవాదులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు ఘర్షణకు దారి తీసి పరిస్థితి ఇక్కడికి వరకు వచ్చింది. ఘర్షణలకు అసలు కారణాలు అన్వేషించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈశాన్య ప్రాంతంలోని మిగతా రాష్ట్రాల్లాగానే, అస్సాంకు కూడా విభిన్నమైన సాంస్కతిక నేపథ్యం ఉంది. దేశ ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న అస్సాం పలు దేశాల అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరగా ఉంది. బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ వంటి దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉంది. అందువల్ల ఈ రాష్ట్రంలో విభిన్న జాతుల ప్రజలు జీవిస్తున్నారు. అస్సామీల అసలు జాతి ఏదో నిర్వచించడం కూడా సాధ్యం కాదు. ఆయా దేశాల నుంచి ఇక్కడకు బతుకుదెరువు కోసం వలస వచ్చిన ప్రజలు, తమపై ఎప్పుడు ఎవరు దాడి చేస్తారోఅన్న ఆందోళనతో ఉంటున్నారు. వారికి వ్యతిరేకంగా స్థానిక వాదం బాగా బలపడుతోంది. దానికి తోడు ఇక్కడ ఉన్న ఉగ్రవాదం కారణంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరూ ఆసక్తి చూపడంలేదు. ఈ రాష్ట్రంలో పెట్రోలియం నిక్షేపాలున్నా, తేయాకు విస్తతంగా పండుతున్నా అభివద్ధి మాత్రం అంతంతమాత్రమే.

అస్సాంలో ప్రతిభ గలవారు మంచి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన పేద ప్రజలు, బీహార్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పేద కార్మికులు ఉపాధి కోసం ఇక్కడకు వస్తున్నారు. దాంతో స్థానికులు, స్థానికేతరులు అన్న సమస్య తలెత్తింది. బంగ్లాదేశ్‌ నుంచి నిరాటంకంగా సాగుతున్న వలసల వల్ల ఇక్కడ ముస్లిం ప్రాబల్యం పెరుగుతోంది. దిగువ అస్సాం జిల్లాల్లో నెలకొన్న ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అయా ప్రాంతాలను బంగ్లాదేశ్‌తో కలిపేయాలని ముస్లింలు డిమాండ్ చేయవచ్చేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోడోలు, ఇతర స్థానికుల ప్రయోజనాల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించకపోవడం సమస్యను మరింత జటిలంగా మార్చింది. అస్సాంలోని తీవ్రవాద సంస్థలు, గ్రూపులు గతంలో తమ రాష్ట్ర సార్వభౌమత్వం కోసం పోరాడేవి. అవి ఇప్పుడు వలసవాదులతో పోరుకే ప్రాధాన్యమిస్తున్నారు. మరో వైపు వలసవాదుల తరపున పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి హుజీ, ఐఎస్‌ఐ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీనితో సమస్య మరింత జటిలమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు, హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు రెండు కోట్లకు పైనే ఉంటారని ప్రభుత్వ అంచనా. ఈ వలసలు దేశ భద్రతకే ముప్పు అన్నది కాదనలేని సత్యం. 1998లో అప్పటి అస్సాం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ కె సిన్హా రాష్ట్రపతికి ఇచ్చిన నివేదికలో ఈ విషయాలన్నింటిని తెలియజేస్తూ కేంద్రంని హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను కేంద్రం ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. పార్లమెంటులో ఆగస్టు 17న జరిగిన చర్చలో దేశంలో 83 వేల 400 మంది బంగ్లాదేశ్ శరణార్థులున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత మూడేళ్లలో 23వేల 600 మంది బంగ్లాదేశ్ వాసులను వారి దేశానికి పంపించినట్లు కేంద్రం పార్లమెంటుకు వివరించింది.

అస్సాం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల సెగ దేశవ్యాప్తంగా హింసాకాండకు దారితీసిన పరిస్థితులలోనైనా కేంద్ర ప్రభుత్వం మేలుకోవలసిన అవసరం ఉందని గుర్తించాలి. తమ వైఫల్యాన్ని అర్ధం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు వాస్తవిక దక్పథంతో వ్యవహరించాలి. అక్రమ వలసలను అరికట్టడానికి కఠినమైన నిబంధనలను రూపొందించి అమలు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ కేంద్రం మేలుకోకపోతే ఈ సమస్య దేశ భద్రతకే సవాలుగా మారే ప్రమాదం ఉంది.
Share this article :

0 comments: