బొత్సే ప్రధాన నిందితుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్సే ప్రధాన నిందితుడు

బొత్సే ప్రధాన నిందితుడు

Written By news on Monday, August 20, 2012 | 8/20/2012



న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితుల ఊచకోత ఘటనలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే ప్రధాన నిందితుడని రాష్ట్ర దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆరోపించారు. ఆ ఘటనలో నిందితులు దాడులకు ఉపయోగించిన బడిసెలు, బాంబులకు ఆర్థిక సాయం చేసింది బొత్సే అని, ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన సీఎం కిరణ్ లక్ష్మీపేట బాధిత కుటుంబాలను పరామర్శించకుండా నిందితుల గ్రామాల్లో పర్యటించారని విమర్శించారు. 

దళిత ద్రోహిగా వ్యవహరిస్తున్న కిరణ్‌కు బొత్సను రక్షించే శక్తి ఉందా అని ప్రశ్నించారు. పద్మారావు ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కిరణ్ ప్రభుత్వ విధానాలను, బొత్స అరాచకాలను జాతీయ నేతల దృష్టికి తెస్తామన్నారు. దళితులపై జరిగిన దాడులపై ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ స్పందించాలన్నారు అస్సాంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను సందర్శించిన ప్రధాని దళితులపై దాడి జరిగిన గ్రామాల్లో ఎందుకు పర్యటించరని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితుల ఇళ్లలో చపాతీలు తిన్న రాహుల్‌గాంధీ ఏపీలో దళితుల ఊచకోత ఘటనపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ సైతం ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని, నిందితులకు శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై లేదా అని ప్రశ్నించారు. లక్ష్మీపేట ఘటనను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 21న ఏపీ భవన్‌లో జాతీయ స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, 22న జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు.
Share this article :

0 comments: