పరిశ్రమలు టు-లెట్.కుదేలవుతున్న పారిశ్రామికవేత్తలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరిశ్రమలు టు-లెట్.కుదేలవుతున్న పారిశ్రామికవేత్తలు

పరిశ్రమలు టు-లెట్.కుదేలవుతున్న పారిశ్రామికవేత్తలు

Written By news on Thursday, August 23, 2012 | 8/23/2012


బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులనైనా చెల్లించవచ్చన్న ఆశతో టు-లెట్ బోర్డులు
ఇప్పటికే పలు పరిశ్రమల మూసివేత.. మరికొన్ని నేడో రేపో

టులెట్ బోర్డు.. దీన్ని మనం ఇళ్ల ముందు చూశాం.. వాణిజ్య సంస్థల భవన సముదాయాల ముందూ చూశాం.. అయితే, ప్రస్తుతం ఈ బోర్డు మన రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల ముందు వేలాడుతోంది.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ తీవ్రతకు గుర్తుగా.. పారిశ్రామికవేత్తల దైన్యానికి చిహ్నంగా..
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇల్లు, వాణిజ్య సంస్థకు భవనాన్ని అద్దెకు తీసుకున్న తరహాలో ఇకపై పరిశ్రమలను కూడా అద్దెకు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని నాచారం, మల్లాపూర్ పారిశ్రామికవాడలను ‘న్యూస్‌లైన్’ సందర్శించింది. ఈ సందర్భంగా అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యుత్ కోతల వల్ల ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడగా.. మరికొన్ని నేడో రేపో అన్నట్లున్నాయి. కరెంటు కోతల వల్ల పరిశ్రమను పూర్తిస్తాయిలో నడపలేక.. కార్మికులకు వేతనాలు చెల్లించలేక.. భారీగా వస్తున్న విద్యుత్ బిల్లులను భరించలేక పారిశ్రామికవేత్తలు అవస్థలు పడుతున్నారు. అయితే, పరిశ్రమను మూసివేసేందుకు మనసురాక.. కొందరు వాటిని అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయిస్తున్నారు. కనీసం అద్దెకు ఇస్తే.. బ్యాంకు వద్ద తీసుకున్న అప్పులనైనా కొంతమేరకు చెల్లించవచ్చని వారు ఆశపడుతున్నారు. ఎందుకంటే అప్పులను మూడు నెలల పాటు చెల్లించలేకపోతే నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)గా ప్రకటించే ప్రమాదముంది. అందుకే తమ పరిశ్రమలకు టులెట్ బోర్డులను తగిలిస్తున్నారు. మరోవైపు కార్మికులది మరింత దుర్భర పరిస్థితి. పరిశ్రమలు మూతపడుతుండటంతో వేలాది మంది రోడ్డున పడుతున్నారు. పనిచేస్తున్న పరిశ్రమల్లోనూ వారికి 15 రోజుల జీతమే గతి అవుతోంది.

కోతలతో ఆర్డర్లు పూర్తి చేయలేకపోతున్నాం..

రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ దాదాపుగా అనుబంధ పరిశ్రమలే. ఈ పరిశ్రమల ఉత్పత్తులకు ప్రధానంగా ఆర్డర్లు వచ్చేది బయుటి రాష్ట్రాల నుంచే. ఇందుకు కారణం రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమలు పెద్దగా లేకపోవడమే. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లను ఎంతో కష్టపడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కష్టపడి ఆర్డర్లు తెచ్చుకున్నా.. కరెంటు కోతల వల్ల వాటిని సకాలంలో అందించలేకపోతున్నామని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. దీంతో కొత్తగా ఆర్డర్లు రావడం లేదని అంటున్నారు. వచ్చిన కొద్దిపాటి ఆర్డర్లను కిందామీదా పడి డెలివరీ చేస్తున్నా.. ఆలస్యం చేయడం వల్ల పెనాల్టీ పడుతుందని.. దాని వల్ల కొద్దిపాటి మార్జిన్ కూడా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నేను బేరింగ్స్ తయూరుచేస్తుంటాను. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. అనుకున్న సమయానికి డెలివరీ చేయకపోతే 10 నుంచి 15 శాతం వరకూ జరిమానా విధిస్తారు. దీంతో పరిశ్రమ నడిపినప్పటికీ లాభం ఏమీ మిగలడం లేదు. పైగా కొన్నిసార్లు నష్టాలొస్తున్నాయి’ అని చంద్రయ్య అనే పారిశ్రామికవేత్త వాపోయారు.

ఆ రోజుల్లోనూ కోతలు.. వెతలు..

విద్యుత్ కోతలు నిరంతరం నడిచే పరిశ్రమలకు(కంటిన్యూయుస్ ప్రాసెసింగ్) కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ పరిశ్రమలు నిరంతరం నడవాలంటే నిరంతరాయంగా కరెంటు ఉండాల్సిందే. అయితే, కోతలు లేని రోజుల్లోనూ సాయంత్రం నాలుగు గంటల పాటు విద్యుత్‌ను కట్ చేయడం వల్ల ప్రధానంగా రబ్బరు, ప్లాస్టిక్, స్టీలు, క్యాస్టింగ్, ఫోర్జింగ్, ఐస్ తయూరీ, ఫార్మా వంటి పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతల వల్ల బాగా వేడి చేసిన ఫర్నేస్‌ను మళ్లీ వేడి చేయూల్సి వస్తోంది. తద్వారా అదనపు విద్యుత్‌తో పాటు తయారవుతున్న ఉత్పత్తులు కూడా అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఉండదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు.. బేరింగ్‌లు తయూరు చేసేందుకు ఫర్నేస్‌ను 800 డిగ్రీల వరకు వేడి చేయూల్సి ఉంటుంది. ఇందుకు 12 గంటల సమయం పడుతుంది. తర్వాత మరో పది గంటల పాటు ఉడకపెట్టాల్సి(సాకింగ్) ఉంటుంది. వురో 10-13 గంటల పాటు బ్యాలెన్సింగ్ చేయూలి. అప్పుడే బేరింగ్ అనుకున్న విధంగా తయారవుతుంది. అయితే, కరెంటు ఉన్న రోజుల్లోనూ 4 గంటల పాటు విద్యుత్ నిలిచిపోతుండటంతో ఆ సమయంలో వేడి అయిన ఫర్నేస్ మళ్లీ చల్లబడుతుంది. దీంతో దాన్ని మళ్లీ వేడిచేయూల్సి ఉంటుంది. అంటే మొత్తం వ్యవహారం మొదటికొస్తుందన్నమాట. అంతేకాదు.. దీని వల్ల తయారుచేయాల్సిన బేరింగ్ కూడా దెబ్బతినే ప్రమాదముంది. అటు కరెంటు బిల్లుల రూపంలో పారిశ్రామికవేత్తలపై అదనపు భారం పడుతోంది.

వేతనం..15 రోజులే..

విద్యుత్ కోతల వల్ల కార్మికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల నెలలో 15 రోజులకు మించి పరిశ్రమలు నడవడం లేదు. ఈ కోతలు గతేడాది అక్టోబర్ నుంచీ అమల్లో ఉన్నాయి. మొదట్లో పరిశ్రమ 15 రోజులు నడిచినప్పటికీ నెల జీతాన్ని కార్మికులకు చెల్లించేవారమని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. తర్వాత మాత్రం 15 రోజుల పనికి నెల జీతం చెల్లించడం తమ వల్ల కావడం లేదని వాపోతున్నారు. అందువల్ల ‘నో వర్క్-నో పే’ సూత్రాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు. తద్వారా కార్మికులకు కేవలం 15 రోజుల వేతనమే లభిస్తోంది. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సగటున నెలకు రూ.7 వేల నుంచి 8 వేల జీతం వస్తుంది. ప్రస్తుతం ఇది రూ.3,500 నుంచి 4 వేలకు పడిపోయింది. ఈ కాస్త జీతంతో బతుకును వెళ్లదీయుడం కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అనేక పరిశ్రమల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా స్వరాష్ట్రాలకు తరలిపోతున్నారు. కేవలం 15 రోజుల వేతనంతో పనిచేయుడం మా వల్ల కాదు మహాప్రభో అంటూ రెలైక్కి సొంత ఊర్లకుపోతున్నారు. మరోవైపు పరిశ్రమలు కూడా దీని వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిపుణులైన కార్మికులు వెళ్లిపోతుండటంతో పరిశ్రమ నడపడం కష్టమవుతోందని వారంటున్నారు.


రాష్ట్రంలో పరిశ్రమలు..
భారీ పరిశ్రమలు 4,351
పనిచేస్తున్న కార్మికులు 10.22 లక్షలు
పెట్టిన పెట్టుబడి రూ.1,11,928 కోట్లు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 1.88 లక్షలు
పనిచేస్తున్న కార్మికులు 20.36 లక్షలు
పెట్టుబడి రూ. 33,811 కోట్లు



బిల్లులతో గుండె గుభేల్..

ఏప్రిల్‌లో మొత్తం కరెంటిచ్చారు. జూలైలో 15 రోజులే ఇచ్చారు. అయితే, కరెంటు చార్జీలు పెంచిన తర్వాత ఏప్రిల్‌లో నా కంపెనీకి వచ్చిన బిల్లు రూ.7,17,393. జూలై నెలకుగానూ ఆగస్టులో వచ్చిన బిల్లు ఏకంగా రూ.9,83,778. కోతల సమయంలోనే ఎక్కువ బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ కోతల వల్ల ఫర్నేస్‌ను మళ్లీ వేడి చేసేందుకు ఎక్కువ విద్యుత్ అవసరమవుతోంది. ఉత్పత్తి సరిగా కాకున్నా.. బిల్లు మాత్రం ఎక్కువ వస్తోంది. కోతల వల్ల పరిశ్రమ నడవకపోవడమే కాదు.. నడిచిన రోజులకూ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి నష్టపోతున్నాం.

-చంద్రయ్యు, నాచారం, పారిశ్రామికవాడ సంఘం ఉపాధ్యక్షుడు


మూసేసుకోవాల్సిందే..
గతంలో ఎన్నడూ ఇంతటి విద్యుత్ కోతలను చూడలేదు. గత వారం రోజుల నుంచి పూర్తిగా కరెంటు లేదు. మాకు సమాచారమూ ఇవ్వడం లేదు. కోతల వల్ల పరిశ్రమను మూసుకునే పరిస్థితి వస్తోంది. డీజిల్‌తో పరిశ్రమను నడపలేం. డీజిల్ సెట్ కొనాలంటే 40 లక్షల మేరకు అవుతుంది. ఉత్పత్తి చేస్తే ఒక యూనిట్ రూ.15 అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన డీజిల్‌పై వ్యాట్ రీయింబర్స్‌మెంట్ వల్ల మాకు పెద్దగా ఉపయోగం లేదు.
-పీఎస్‌ఎస్ నాయుడు, వుల్లాపూర్ పారిశ్రామిక యూనిట్ల సంక్షేవు సంఘం అధ్యక్షుడు

బతుకు వెళ్లదీయడం కష్టంగా ఉంది..
ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. నెలంతా కరెంటు ఉన్నప్పుడు జీతం 8 వేల వరకూ వచ్చేది. ఇప్పుడు 15 రోజులే కరెంటు ఉంటోంది. దీంతో నెలకు 4 వేలే వస్తోంది. దీంతో బతుకు వెళ్లదీయడం చాలా కష్టంగా ఉంది. నాతో వచ్చిన వాళ్లందరూ ఇళ్లకు తిరిగెళ్లిపోయారు.
-సమర్ బహద్దూర్, నాచారం పారిశ్రామికవాడలో కార్మికుడు
Share this article :

0 comments: