ఖాతాలపై సాక్షి యాజమాన్యానికి హైకోర్టు అనుమతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖాతాలపై సాక్షి యాజమాన్యానికి హైకోర్టు అనుమతి

ఖాతాలపై సాక్షి యాజమాన్యానికి హైకోర్టు అనుమతి

Written By news on Thursday, August 23, 2012 | 8/23/2012

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల్లోని సాక్షి కరెంటు ఖాతాల నిర్వహణకు తగిన బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన తర్వాత ఏవైనా మొత్తాలు మిగిలితే వాటిని ఎస్‌బీఐకి మళ్లించి, ఆ బ్యాంకు నుంచే లావాదేవీలన్నింటినీ నిర్వహించుకునేందుకు సాక్షి యాజమాన్యానికి హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి బెజ్జారం చంద్రకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ స్తంభింపజేయని కెనరా బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాలను బ్యాంకు గ్యారంటీలను సమర్పించేందుకు ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలంటూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. గతవారం ఇదే వ్యవహారానికి సంబంధించి వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు.. తమ అనుమతి లేకుండా ఎటువంటి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ ఈ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ చంద్రకుమార్ విచారించారు.

గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కరెంటు ఖాతాల నిర్వహణకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉందని, అయితే అందుకు అవసరమైన మొత్తాలు కెనరా బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. ఆ ఖాతాల నిర్వహణకు అనుమతిస్తే బ్యాంకు గ్యారంటీలు సమర్పించగలమని ఆయన వివరించారు. కోర్టు అనుమతిస్తే ఎస్‌బీఐ నుంచే అన్ని లావాదేవీలను నిర్వహించుకుంటామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన తరువాత.. మిగిలిన మొత్తాలను ఎస్‌బీఐకి మళ్లించి, ఆ బ్యాంకు ద్వారానే లావాదేవీలు నిర్వహించుకోవాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేశారు. అంతేకాక జిల్లాలో ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలను మూసివేసి, ఆ మొత్తాలను ఎస్‌బీఐకి మళ్లించుకోవచ్చునని స్పష్టం చేశారు. బ్యాంకు గ్యారంటీల సమర్పణకు ముందు కెనరా బ్యాంకు ఖాతాల వివరాలను సీబీఐకి సమర్పించాలని.. సీబీఐ ఆ ఖాతాల వివరాలను పరిశీలించి, మూడు వారాల్లో ఆమోదముద్ర వేయాలని.. ఆ తర్వాతే ఎస్‌బీఐకి కెనరా బ్యాంకు ఖాతాల్లోని నిధులను మళ్లించుకోవచ్చునని తేల్చి చెప్పారు.
Share this article :

0 comments: