చేతులెత్తేసిన ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » చేతులెత్తేసిన ప్రభుత్వం

చేతులెత్తేసిన ప్రభుత్వం

Written By news on Tuesday, August 28, 2012 | 8/28/2012


మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్న అంశం విద్యుత్. రాష్ట్రంలో చీకట్లు అలుముకున్నాయి. విద్యుత్‌ కోతలపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. విద్యుత్‌ సమస్య ఇప్పట్లో పరిష్కరించలేమని రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రోడ్లపై కూర్చోని ధర్నాలు చేస్తే విద్యుత్ రాదని చెప్పారు. విద్యుత్‌ ఆదా చేయమని ఉచిత సలహా ఇచ్చారు. 

రాష్ట్రంలో వర్షాకాలం వచ్చినా విద్యుత్‌ కోతలు ఆగడం లేదు. పైగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌, వైజాగ్‌, తిరుపతి లాంటి చోట్ల రోజూ 3 గంటలు, జిల్లా కేంద్రాల్లో ఐదు గంటలు, మున్సిపాలిటీలు, పట్టణాల్లో ఆరు గంటలు, గ్రామాలలో అయితే ఏకంగా 12 గంటలు అధికారికంగానే విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో రాత్రుళ్లు కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 

విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూత పడుతున్నాయి. దాంతో అధిక సంఖ్యలో కార్మికులు ఉపాధికోల్పోతున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న నేత కార్మికులు, రైతన్నలు విద్యుత్ కష్టాలు భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతతో సిరిసిల్లలో గడిచిన నెల రోజుల్లో ఐదుగురు నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలో పవర్‌ లూమ్‌ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. కార్మికులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక నేత కార్మికులు మగ్గాల మధ్యనే నిరీక్షిస్తున్నారు. ఇక పరిశ్రమల విషయానికి వస్తే ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5వేల పరిశ్రమలు మూతపడ్డాయి. అంటే రాష్ట్ర పరిశ్రమల పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని పారిశ్రామిక వేత్తలు మొత్తుకుంటున్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేయకపోవడం వల్లే ఆర్డర్లు లేక చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. చిన్న తరహా పరిశ్రమలు విద్యుత్‌ సమస్యలకు సంబంధించి నిరవధిక బంద్ చేసినపుడు ప్రభుత్వం స్పందించి విద్యుత్‌ కొనుగోలు చేసి ఇస్తామని ప్రకటించినా ఇంతవరకు ఆ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలలో ఉత్పత్తి తగ్గిపోతోంది. దాంతో పరిశ్రమల వారు బ్యాంకులకు వడ్డీలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులు పేరుకుపోయాయి. విద్యుత్ కోతల పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందుముందు అనేక పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. నిరుద్యోగ సమస్య తీవ్రతమయ్యే ప్రమాదం కూడా ఉంది. మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఒక్క పరిశ్రమ కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. 

రాజీవ్‌ యువకిరణాల పేరుతో మూడేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గొప్పలు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలనే రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కొత్త ఉద్యోగాలను ఎక్కడ సృష్టిస్తారు?. పక్కరాష్ట్రాలు 40శాతం విద్యుత్ ను పరిశ్రమలకు కేటాయిస్తుంటే మన రాష్ట్రం 28శాతం కేటాయించడానికి కూడా వెనకాడుతోందని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 374 పారిశ్రామిక వాడల్లో రోజుకు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి జరుగుతుంది. విద్యుత్‌ కోతలతో ఈ ఉత్పత్తి 90 శాతం దాకా పడిపోయింది. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే , అక్టోబర్‌ 2 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని పరిశ్రమ వర్గాల వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయితీలు ప్రకటించమని వారు కోరుతున్నారు. క్యాపిటివ్‌ పవర్‌ జనరేషన్‌కు డీజిల్‌ మీద ఉన్న వ్యాట్‌ను పూర్తిగా తొలగించాలని డిమండ్ చేస్తున్నారు. అదేవిధంగా డీజిల్‌ సెట్స్‌ కొనుగోలు చేయడానికి 25శాతం సబ్సిడీని అందించాలని కోరుతున్నారు. పరిశ్రమలకు తగినంత విద్యుత్‌ అందించి కష్టాలు తీర్చాలని పారిశ్రామిక వేత్తలతోపాటు, కార్మికులూ కోరుతున్నారు. 

విద్యుత్ కోతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 31న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చింది. ఇదే అంశంపై ఈరోజు (ఆగస్టు 28) రాష్ట్ర వ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. బషీర్ బాగ్ మృతులకు నివాళులర్పించారు. అవరసమైతే సెప్టెంబర్‌ మొదటి పక్షంలో బంద్‌కు పిలుపునిస్తామని వామపక్షాలు హెచ్చరించాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏదైనా ఆందోళన కార్యక్రమం చేపట్టినా ప్రజలు నమ్మేస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉండగా 2000 లో ఆగస్టు 28నే బషీర్ బాగ్ సంఘటన జరిగింది. రాష్ట్ర చరిత్రలో అది ఒక చీకటి రోజు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరనసగా 9 వామపక్షాల కార్యకర్తలు ఆందోళన చేస్తున్న సమయంలో బషీర్ బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పులలో ముగ్గురు మృతి చెందారు. 2004లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి ఈ ఘటన కూడా ఒక కారణం. 

విద్యుత్‌ సంక్షోభం అధికార కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏ విద్యుత్‌ అంశమైతే తమ పార్టీకి అధికారం కట్టబెట్టిందో ఇపుడదే అంశం తమను గద్దె దింపుతుందేమోనని కాంగ్రెస్‌ నేతల ఆందోళన. విద్యుత్‌ సమస్యను ఇప్పట్లో పరిష్కరించలేమంటూ ఏకంగా ముఖ్యమంత్రే చేతులెత్తేయడంతో ఇపుడు పార్టీ నేతలకు దిక్కు తోచడం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్ధాయికి చేరిన విద్యుత్‌ సమస్యను పరిష్కరించలేకపోవడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తోందని ఆందోళన చెందుతున్నారు. 
Share this article :

0 comments: