ప్రభుత్వ నిర్ణయాలకు, జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ నిర్ణయాలకు, జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు

ప్రభుత్వ నిర్ణయాలకు, జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు

Written By news on Friday, August 17, 2012 | 8/17/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ తన పరిధి దాటి అత్యుత్సాహం చూపుతూ కాంగ్రెస్ ప్రతిష్టను మంటగలుపుతోందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యక్తిగతంగా ఏ తప్పూ చేయలేదన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న రెవెన్యూశాఖ నుంచి వచ్చిన జీఓలకు కేబినెట్ సమష్టి బాధ్యతేతప్ప ధర్మానకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. జీవన్‌రెడ్డి గురువారం సీఎల్పీ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంలో ధర్మానేగాక.. ఏ మంత్రీ, చివరకు ముఖ్యమంత్రీ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదని, కేబినెట్‌దే తుది నిర్ణయమని బిజినెస్ నిబంధనలు స్పష్టంచేస్తున్నా సీబీఐ దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్లడం విచిత్రమన్నారు. పారిశ్రామికాభివృద్ధికోసం ఆయా సంస్థలకు రాయితీలు కల్పించడం ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో కేబినెట్ విధివిధానాల్లో భాగమని, దానిని ఒక మంత్రో, సీఎమ్మో వ్యక్తిగత నిర్ణయాలుగా పరిగణించేందుకు వీల్లేదన్నారు.

వాన్‌పిక్‌కుగానీ, మరే సంస్థకైనాగానీ భూముల కేటాయింపు అంశంలో మంత్రులో, వైఎస్ రాజశేఖరరెడ్డో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ‘ధర్మాన కేబినెట్ మంత్రిగా ఉన్నందున చార్జిషీట్ దాఖలుకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కానీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతిని సీబీఐ కోరుతోందంటే.. సర్కారు అనుమతివ్వకున్నా కోర్టు ద్వారా పొందేందుకే ముందుగా చార్జిషీట్ వేసినట్లు కనిపిస్తోంది’ అని చెప్పారు. ‘ఈ కేసులో సీబీఐ పక్షపాతధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలకు, జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు.

అయినా సీబీఐ వేరే లక్ష్యంతో వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రులకు న్యాయసహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోనే జీఓల్లో ఎలాంటి తప్పు లేదని అంగీకరించినట్లయింది. కానీ కేబినెట్ నిర్ణయాలకు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సాగడం విచారకరం’’ అని అన్నారు. హైకోర్టులో ప్రైవేటుకేసు దాఖలై న్యాయస్థానం పలుమార్లు కౌంటర్ వేయాలని అడిగినప్పుడే ప్రభుత్వం మేలుకుని వాదన వినిపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. జీఓలను ఏ పరిస్థితుల్లో విడుదల చేశారో న్యాయస్థానానికి తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
Share this article :

0 comments: