అనర్హతపై కొండా మురళి న్యాయ పోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనర్హతపై కొండా మురళి న్యాయ పోరాటం

అనర్హతపై కొండా మురళి న్యాయ పోరాటం

Written By news on Sunday, August 19, 2012 | 8/19/2012

- చైర్మన్ పక్షపాతంతో ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు నివేదన
- విచారణకు స్వీకరించిన హైకోర్టు
- పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని మండలి చైర్మన్, ఇతర ప్రతివాదులకు ఆదేశం.. విచారణ 27కు వాయిదా 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేస్తూ శాసన మండలి చైర్మన్ గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఉత్తర్వుల అమలును తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఇందులో మండలి చైర్మన్, కార్యదర్శిలతోపాటు మండలి చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ విప్ శివరామిరెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ.ప్రభాకరరావు వాదనలు వినిపిస్తూ.. మండలి చైర్మన్ ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని వివరించారు. పిటిషనర్ వాదనలు పూర్తిస్థాయిలో వినకుండానే అనర్హత వేటు వేశారని తెలిపారు. 

అనర్హత వేటుకు చైర్మన్ చెప్పిన కారణాలేవీ సహేతుకంగా లేవని చెప్పారు. మరో ఎమ్మెల్సీ పుల్లా పుద్మావతిపై కూడా అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలైనప్పటికీ, దాని జోలికి వెళ్లకుండా కేవలం పిటిషనర్‌పై మాత్రమే అనర్హత వేటు వేశారని తెలిపారు. పిటిషనర్ విషయంలో చైర్మన్ పూర్తిగా వివక్షాపూరితంగా వ్యవహరించారన్నారు. మండలి చైర్మన్ చక్రపాణిస్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు మండలిలో కాంగ్రెస్ విప్ శివరామిరెడ్డి చెప్పినట్లు నడుచుకున్నారని వివరించారు. కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాననే కక్షతో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, వివరణ అడగకుండానే అనర్హత వేటు వేశారని చెప్పారు. మరికొందరు నేతలు కూడా జగన్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
Share this article :

0 comments: