అంధకారాంధ్రప్రదేశ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంధకారాంధ్రప్రదేశ్!

అంధకారాంధ్రప్రదేశ్!

Written By news on Friday, August 31, 2012 | 8/31/2012

ముందు చూపులేని పాలకుల వల్ల రాష్ట్ర ప్రజానీకం బతుకుల్లో చీకట్లు ముసురుకున్నాయి. దాదాపు పది నెలల క్రితం విద్యుత్ కోతలతో మొదలైన వ్యవహారం చివరకు విద్యుత్తే లేని స్థితికి చేరుకుంది. ఏటా వేసవి కాలానికి మాత్రమే పరిమితమయ్యే కోతలు గత ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభమయ్యాయి. ఎందరు ఎన్నిసార్లు కలిసినా, గోడు వెళ్లబోసుకున్నా అంగుళం కూడా కదలికలేని రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో సకల రంగాలూ నీరసించిపోయాయి. 

పర్యవసానంగా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల దగ్గర్నుంచి పొలాల్లో ఆరుగాలం కష్టపడే రైతు వరకూ అందరి పరిస్థితీ ఒక టే. వేలాది చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మూతపడగా, భారీ పరిశ్రమలు సైతం బిక్కు బిక్కుమంటున్నాయి. చేసేందుకు పనిలేక కార్మికుడు దిగాలుగా కూర్చుంటే పొలంలోని పంటకు కాసిన్ని నీళ్లయినా పారించేదెలాగో అర్ధంకాక రైతు అయోమయంలో ఉన్నాడు. చిన్నా చితకా వ్యాపారస్తులు సైతం దెబ్బతిన్నారు. 

రోజులో దాదాపు 20 గంటలపాటు కోతలే అమలవుతుండటంతో మునిసిపాలిటీలు, పంచాయతీలు ప్రజలకు తాగునీటిని అందించలేకపోతున్నాయి. గ్రామ సీమల్లో రోజుకు కనీసం రెండు, మూడు గంటలైనా విద్యుత్ సరఫరా ఉండటం గగనమవుతున్నదంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్ధమవుతుంది. ప్రజాజీవన రంగాలన్నిటితోనూ ఇంతగా పెనవేసుకుపోయి, మనిషి మనుగడకి ప్రాణావసరంగా మారిన విద్యుత్తు గురించి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలకు పోయింది. పుట్టి మునుగుతున్నదని ఎందరు హెచ్చరించినా మందబుద్ధిని వదుల్చుకోలేకపోయింది. ఇప్పుడు అందర్నీ కష్టాల్లోకి నెట్టేసి చోద్యం చూస్తోంది. 

ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి ఏడు గంటల కరెంటిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉత్త గాలి కబుర్లని తేలిపోయింది. విద్యుత్ సంక్షోభం వ్యవసాయ క్షేత్రాల్లో సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. లక్షల వ్యయంతో బోర్లు వేయించుకుని, అటు తర్వాత మరింత ఖర్చుచేసి పంటలు వేసిన రైతులు... వేళకురాని విద్యుత్ కారణంగా ఎండుతున్న పంటను చూసి రోదిస్తున్నారు. చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియక మనోవ్యధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన పంటభూములు నెర్రెలుబారి చిన్న బోయాయి. అసలు తొలకరి సమయానికే రుణ ప్రణాళిక ప్రకటించి, విత్తనాలను సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బ్యాంకుల్లో అప్పు పుట్టకపోవడంతో రైతులంతా వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వచ్చింది. సబ్సిడీ విత్తనాలు అందక బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు, అంతకన్నా ఎక్కువ చెల్లించి కొనుక్కోవాల్సివచ్చింది. సర్కారు సృష్టించిన ఇన్ని సమస్యలను అధిగమించి సాగు మొదలెట్టిన రైతులకు విద్యుత్‌ను సైతం అందించక పాలకులు వారి ఉసురు పోసుకుంటున్నారు. ప్రాంతం ఏదైనా రైతు బతుకు సమస్తం దయనీయంగా మారింది.

పన్నెండో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలుగా ‘రాష్ట్రంలో దాదాపు లక్షన్నర కోట్ల పెట్టుబడులతో 660 భారీ పరిశ్రమల ఏర్పాటు, 60,000 వరకూ చిన్నతరహా పరిశ్రమలు, 10.62 లక్షల ఉద్యోగావకాశాలు’ అని చెప్పుకున్న మన సర్కారు ఉన్న పరిశ్రమలను సక్రమంగా నడవనీయడం లేదు. కనీవినీ ఎరుగని కరెంటు కోత కారణంగా లక్షలాదిమంది కార్మికులు వీధినపడ్డారు. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ వ్యయం పెరిగిపోయి... తెచ్చిన రుణాలపై వాయిదాలు కట్టలేక, కార్మికులకు వేతనాలు చెల్లించలేక, పెరిగిపోతున్న వడ్డీ భారాన్ని భరించలేక చిన్న తరహా పారిశ్రామికవేత్తలు కూడా చావే శరణ్యమనే స్థితికి చేరుకుంటున్నారు. వీరే ఇలావుంటే, వేతనాలపై ఆధారపడివుండే కార్మిక కుటుంబాల పరిస్థితి చెప్పనవసరమే లేదు. అది గార్మెంట్స్ పరిశ్రమ కావొచ్చు... మరమగ్గం కావొచ్చు... స్పిన్నింగ్ కావొచ్చు... సిరామిక్స్ కావొచ్చు...గ్రానైట్ కావొచ్చు... కర్మాగారమేదైనా, ఏ స్థాయిదైనా విద్యుత్ అందక మూతబడిపోతున్నాయి. కొన్నిచోట్ల అద్దెకిస్తామంటూ బోర్డులు వెలుస్తున్నాయి. 

రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న సంగతి వాస్తవమే. ఎప్పటికప్పుడు వాటిని మదింపువేసి, అందుకు అనుగుణమైన ప్రణాళికలను రచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తన పాలనాకాలంలో డిమాండ్‌కూ, సరఫరాకూ మధ్య అంతరం పెరగకుండా చూశారు. నష్టాల్లో ఉన్న జెన్‌కోకు జవసత్వాలు కల్పించారు. విద్యుదుత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటూనే తక్షణావసరాలను తీర్చడం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా విద్యుత్‌ను కొనడం, థర్మల్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును అందుబాటులో ఉంచడంలాంటి పనులు చేశారు. జనహితం కోరే నేతలు ఎలా వ్యవహరించాలో ఆచరణాత్మకంగా చూపారు. 

ఇలాంటి ఉదాహరణలేవీ మన సర్కారుకు మార్గదర్శకం కాలేకపోయాయి. ప్రాప్తకాలజ్ఞతలో కూరుకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం సరే... దాన్ని మేల్కొల్పి సరైన దారిలో పెట్టాల్సిన కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఏమైపోయినట్టు? రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని చూసైనా తక్షణం రంగంలోకి దిగి ఆదుకోవాల్సిన యూపీఏ సర్కారు ఏం చేస్తోంది? 33 మంది కాంగ్రెస్ ఎంపీలను ఇచ్చి, యూపీఏ మనుగడకు మూలాధారంగా నిలిచిన మన రాష్ట్రానికి ఈ కష్టకాలంలో బాసటగా ఉందామన్న స్పృహ కూడా దానికి కరువైనట్టు కనిపిస్తోంది. ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన తెలుగుదేశం సైతం ఆ తానులోని ముక్కగానే కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో వ్యక్తమయ్యే ప్రజల ఆగ్రహావేశాలైనా సర్కారును కార్యాచరణ దిశగా కదిలించగలవేమో చూడవలసి ఉంది.
Share this article :

0 comments: