విద్యుత్‌పై అసెంబ్లీని సమావేశపర్చాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్‌పై అసెంబ్లీని సమావేశపర్చాలి

విద్యుత్‌పై అసెంబ్లీని సమావేశపర్చాలి

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012

ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఈ డిమాండ్ చేసి ఉండాల్సింది
ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది
గ్యాస్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే
గ్యాస్ కొరత వల్లే విద్యుత్ ఉత్పాదన జరగడంలేదని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనమే
హెచ్‌టీ విద్యుత్ వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలి
ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతిస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ సంక్షోభం పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంపై చర్చించడానికి తక్షణం శాసన సభ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. అత్యంత ప్రధానమైన విద్యుత్ సమస్యపై వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కోరి ఉండాల్సిందని, అయితే వారు ఆ పని చేయలేదని అన్నారు. 

అధికారపక్షం అసమర్థంగా తయారైందని, ప్రతిపక్షం నిద్రపోతోందని, అందుకే అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోందని చెప్పారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కారణమని అన్నారు. ‘‘రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సహజ వాయువు సరఫరా సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. గ్యాస్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు ఒత్తిడి తెచ్చి సాధించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ పని చేయకుండా, గ్యాస్ కొరత వల్లే విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చేతకానితనానికి నిదర్శనం. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడమే. 

కేజీ బేసిన్‌లో రిలయన్స్ కావాలనే గ్యాస్ ఉత్పాదన తగ్గించింది. భవిష్యత్తులో ధర పెంచి అమ్ముకోవడానికే ఇలా చేస్తున్నా, కేంద్రం ఏమీ చేయలేకపోతోంది’’ అని చెప్పారు. ‘‘విద్యుత్ కోతల ప్రభావం అన్ని వర్గాలపైనా పడింది. రైతులు, విద్యార్థులు, సామాన్యులు, పారిశ్రామికవేత్తలు అందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులకు ఆప్తులైన వారి పరిశ్రమలకు మాత్రం నిరాఘాటంగా సరఫరా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో మంత్రి టి.జి.వెంకటేశ్ రసాయనాల ఫ్యాక్టరీకి 24 గంటలూ విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు పత్రికల్లో చదివాను. 

పభుత్వ వైఖరి చూస్తుంటే ‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో’ అన్న చందంగా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? అసలు హెచ్‌టీ (హైటెన్షన్) విద్యుత్ వాడే పరిశ్రమలకు గత ఆరు నెలల్లో ఎంత విద్యుత్ సరఫరా అయిందో డిస్కంలవారీగా ఎం.ఆర్.ఐ. డేటాను ప్రచురించాలి. విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, అధికంగా వాడిన పరిమాణం ఎంత? ఆంక్షలను అతిక్రమించి అధికంగా విద్యుత్ వాడిన వారిపై తీసుకున్న చర్యలేమిటి? అధికంగా వాడిన విద్యుత్‌కు అప్పట్లో ఉన్న మార్కెట్ ధర ఎంత? వంటి అంశాలన్నింటిపైనా తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు. విద్యుత్ వంటి కీలక శాఖకు మంత్రిని నియమించకపోవడాన్ని తప్పుపట్టారు. ‘‘సీఎం ఈ శాఖను ఆయన వద్దే ఉంచుకున్నా ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో సమీక్ష చేయలేదు. అంతా అధికారుల ఇష్టారాజ్యానికి వదిలేశారు. డిస్కం, జెన్‌కోలు అవినీతిమయమైపోయాయి. విద్యుత్ సంక్షోభానికి ఇదీ ఒక కారణం. విద్యుత్ కొరతపై అధికారులు ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకుని ఉంటే సంక్షోభాన్ని నివారించగలిగి ఉండేవారు’’ అని చెప్పారు. రాష్ట్రంలో వానలు కురవకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘చిత్తూరు జిల్లావాసులు చాలా మంచి వారు. నాకూ ఆ జిల్లాలో మంచి మిత్రులు ఉన్నారు. కలియుగదైవం వేంకటేశ్వరస్వామి కూడా ఆ జిల్లాలోనే ఉన్నారు. అదేమిటోగానీ.. చిత్తూరు జిల్లా వాసి సీఎం పదవిలో ఉన్నపుడల్లా వర్షాలే కురవవు. వర్షాలు కురిపించాలని వారు ఆ స్వామివారిని మొక్కుకుంటే మంచిది’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

టీడీపీ తీరు బాగోలేదు: విద్యుత్ సమస్యపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత టీడీపీకి ఉన్నప్పటికీ, వారు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని మైసూరారెడ్డి విమర్శించారు. వీధులకెక్కి పోలీసు స్టేషన్లలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే విద్యుత్ రాదని వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రధాన సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉండాల్సిందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాసం పెడితే తమ పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. బీసీలకు వంద సీట్లు ఇద్దామని విజయమ్మ చేసిన ప్రతిపాదనలో చిత్తశుద్ధి ఉందని చెప్పారు. 
Share this article :

0 comments: