‘కోల్’గొట్టారు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘కోల్’గొట్టారు!

‘కోల్’గొట్టారు!

Written By news on Saturday, August 18, 2012 | 8/18/2012

‘‘బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్ విధానాన్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్ల.. వాటిని దక్కించుకున్న ప్రైవేటు సంస్థలకు లక్షా 86 వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరింది. ఈ కేటాయింపులను పోటీయుత, పారదర్శక, నిష్పాక్షిక బిడ్డింగ్ ద్వారా జరిపి ఉంటే పైన పేర్కొన్న లబ్ధిలో అధిక భాగం ఖజానాకే చేరి ఉండేది’’
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు స్కాంలో యూపీఏ
మన్మోహన్ సర్కారును కడిగేసిన కాగ్
బొగ్గు గనులను ఇష్టారాజ్యంగా ప్రైవేటుకు కట్టబెట్టారు
ప్రైవేటు సంస్థలకు లక్షా 86 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు
పోటీ, పారదర్శకత, నిష్పాక్షికత లేని బిడ్డింగే కారణం
లేదంటే ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరేది
జీఎంఆర్‌తో ఢిల్లీ విమానాశ్రయ ఒప్పందమూ నష్టదాయకమే
దాంతో రూ. 1.63 లక్షల కోట్ల ఆదాయానికి గండిపడింది
రూ. 3,400 కోట్ల డెవలప్‌మెంట్ ఫీజు వసూలుకు అక్రమ అనుమతి
రిలయన్స్ పవర్‌కు బొగ్గు నిల్వల మళ్లింపు అనుమతులూ అక్రమమే
వాటివల్ల రూ. 29,033 కోట్ల మేర ఆ సంస్థకు అనుచిత లబ్ధి
మూడు ఉదంతాలతో ఖజానాకు రూ.3.06 లక్షల కోట్ల నష్టం
పార్లమెంటుకు కాగ్ నివేదికలు.. సర్కారుపై మండిపడ్డ విపక్షాలు.. 
బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉండగానే కేటాయింపులు..
ఆయన తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ 


న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అంతులేని అవినీతికి, కనీవినీ ఎరుగని స్థాయి కుంభకోణాలకు మారుపేరుగా మారిన యూపీఏ ప్రభుత్వం తాజాగా భారీ స్థాయి బొగ్గు కుంభకోణంలో మెడ లోతున కూరుకుపోయింది. బిడ్డింగులు ఆహ్వానించకుండా పలు ప్రైవేటు సంస్థలకు కేంద్రం ఇష్టారాజ్యంగా 57 బొగ్గు గనులను కేటాయించిందని సాక్షాత్తూ ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. తద్వారా వాటికి రూ.1.85 లక్షల కోట్ల మేరకు కేంద్రం అనుచిత లబ్ధినీ, ఖజానాకు భారీ నష్టాన్నీ కలిగించిందంటూ నిగ్గుదేల్చింది. పరిమాణపరంగా ఇది 2జీ కుంభకోణం కంటే కూడా పెద్దది కావడం విశేషం! బొగ్గు గనుల బిడ్డింగ్‌లో సంస్థల మధ్య పోటీకి అసలు అవకాశమే కల్పించలేదని, ఏమాత్రం పారదర్శకతను పాటించలేదని, నిష్పాక్షికతకు కూడా పూర్తిగా నీళ్లొదిలిందని కాగ్ తీవ్రస్థాయిలో అభిశంసించింది. అంతేకాదు.. ఢిల్లీ విమానాశ్రయం అభివృద్ధి పేరుతో అత్యంత విలువైన భూములను కేంద్రం రాయితీల పేరుతో కారుచౌకగా జీఎంఆర్ సంస్థ నేతృత్వంలోని ప్రైవేటు కన్సార్షియానికి కట్టబెట్టడంవల్ల ప్రభుత్వానికి మరో రూ.1.63 లక్షల కోట్ల మేరకు నష్టం కలిగిందని పేర్కొంది. పైగా ఒప్పందానికి విరుద్ధంగా విమానాశ్రయంలో డెవలప్‌మెంట్ ఫీజు వసూలుకు అనుమతించి కన్సార్షియానికి మరో రూ.3,400 కోట్ల దాకా అనుచిత లబ్ధి కలిగించిందని తెలిపింది. వీటికి తోడు నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు నిల్వల మళ్లింపుకు అనుమతించడం ద్వారా అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు మరో రూ.29,033 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చిందని ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ ఆరోపించింది. 

ఇలా ఈ మూడు ఉదంతాల్లో ఖజానాకు కనీవినీ ఎరగని రీతిలో రూ.3 లక్షల కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లిందని తేల్చింది. బొగ్గు గనుల కేటాయింపులు, ఢిల్లీ విమానాశ్రయ అభివృద్ధి ఒప్పందం అమలు, అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్టులపై శుక్రవారం పార్లమెంటుకు విడిగా మూడు నివేదికలను కాగ్ సమర్పించింది. ఒక్కో ఉదంతంలోనూ ఒప్పందాలకు ఎలా తూట్లు పొడిచిందీ, నిబంధనలను ఎలా ఉల్లంఘించిందీ కాగ్ పూసగుచ్చినట్టు వివరించింది. బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్ పద్ధతిని తక్షణం అమల్లోకి తేవడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కాగ్ నివేదికలు తీవ్ర రాజకీయ దుమారానికి తెర తీశాయి. యూపీఏ అవినీతికి, కుంభకోణాలకు బొగ్గు గనుల కేటాయింపు ఉదంతం పరాకాష్ట అంటూ బీజేపీ దుయ్యబట్టింది. ‘‘ఇది కేవలం కుంభకోణం మాత్రమే కాదు. దారుణ హత్య, కనీవినీ ఎరగని లూటీ’’ అంటూ దుమ్మెత్తిపోసింది. దీనికి ప్రధాని మన్మోహన్‌సింగ్ వివరణ ఇవ్వడంతో పాటు నైతికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తూ ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇతర విపక్షాలూ కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం మాత్రం నివేదికలు తప్పులతడక అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. కాగ్ నివేదికలు ఇప్పుడు బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలనకు వెళ్తాయి. గనుల కేటాయింపులు బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉండగానే జరిగినందున ఆయనపై విమర్శల జడివాన మరింత తీవ్రతరమయ్యే అవకాశముంది.

నివేదిక తప్పుల తడక: శ్రీప్రకాశ్ జైశ్వాల్, బొగ్గు మంత్రి

‘‘యూపీఏ ప్రభుత్వ నిర్వాకం వల్ల రూ.1.86 లక్షల కోట్ల మేర ప్రైవేటు కంపెనీలు లాభపడ్డాయన్న వాదనలో వాస్తవం లేదు. ఆ లెక్కలు తప్పుల తడక . బొగ్గు బ్లాకులను పూర్తి పారదర్శక పద్ధతిలో కేటాయించాం. 2006లో న్యాయ శాఖ నుంచి పరస్పర విరుద్ధాభిప్రాయలు వచ్చిన నేపథ్యంలో బ్లాకులను వేలం వేయలేదు. దీంతోపాటు నాడు బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లు పోటీ బిడ్డింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రస్తుత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని ఆ మూడు రాష్ట్రాలూ చెప్పాయి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం గౌరవించాలి కదా! విధాన నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదు. ఒక వేళ ఉంది అని అంటే.. దానిపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.’’

ప్రజలను కాగ్ తప్పుదారి పట్టిస్తోంది: పౌర విమానయాన శాఖ

‘‘ఢిల్లీ విమానాశ్రయంపై కాగ్ అంచనాలు పూర్తిగా తప్పు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. ప్రసుత విలువను లెక్కలోకి తీసుకోకుండా కాగ్ అంచనాలు వేసింది. అలాగే మా శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అభిప్రాయాలకు నివేదికలో చోటు ఇవ్వలేదు. ఈ అంశాలపై మాతో చర్చించలేదు.’’

అది మా పని కాదు: అజిత్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి

‘‘ఆ నివేదికను మేం ఆమోదించామా లేదా అని చెప్పడంగాని.. దానిపై కామెంట్ చేయడంగాని మా పనికాదు. నివేదిక ప్రజా పద్దుల సంఘానికి పోతుంది.. ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్లు చూసుకుంటారు.’’

మేం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదు: ఏకే పట్నాయక్, డిప్యూటీ కాగ్

‘‘ఆడిట్ రిపోర్టులో ఎక్కడా మేం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదు. వాటి అమలులో జరుగుతున్న లోపాలు, జాప్యాలను మాత్రమే ప్రశ్నించాం. విధానాలు ఎలా అమలవుతున్నాయో చూడడమే ఆడిట్ ఉద్దేశం. ఏ కారణం చేతయినా విధాన నిర్ణయాల్లో జాప్యం జరిగిందా అన్నది చూడడమే మా పని.’’
Share this article :

0 comments: