సవాల్‌కు స్పందన కరువు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సవాల్‌కు స్పందన కరువు!

సవాల్‌కు స్పందన కరువు!

Written By news on Monday, August 20, 2012 | 8/20/2012


మన ప్రజాస్వామ్యం గురించి ఎవరో అన్నారు- ఇది భూమికి సమాంతరంగా వ్యాపిస్తోందే తప్ప ఎత్తు ఎదగడం లేదని. ప్రజాస్వామ్యం మౌలికంగా ఓ సంస్కారం. మన వ్యవస్థ నిలువుగా ఎదిగితే తప్ప ఈ సంస్కారం వర్ధిల్లడం కష్టం.స్విజర్లండ్, స్వీడెన్, లెబనాన్, బెల్జియం తదితర దేశాల్లోకీలకమయిన విధాన నిర్ణయాలను పరస్పర అంగీకారం ప్రాతిపదికగానే రూపొందించడం -ప్రపంచం తెలిసినవారికి- కొత్త విషయమేంకాదు. మన దగ్గిర ఎవరయినా, ఎప్పుడయినా అలాంటి పోకడలు ప్రదర్శించినా, అందుకు తగిన స్పందన సహచర పక్షాల నుంచి కరువవుతోంది. పరస్పర అంగీకారం ప్రాతిపదికగా, ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వహించడం ఈ నేపథ్యంలో చాలా కష్టం.

ఆదివారం నాడు -అగస్ట్ 19న- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిలువెత్తు ప్రజాస్వామిక ప్రతిపాదన ఒకటి చేశారు. రాష్ట్రంలో వంద అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి, అక్కడ వెనకబడిన కులాల (బీసీ) అభ్యర్థులనే పోటీకి దించుదాం రమ్మని ప్రధాన ప్రత్యర్థి పక్షం -టీడీపీ- నేత చంద్రబాబు నాయుడికి ఆమె ఓ లేఖ రాశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వందమంది బీసీ అభ్యర్థులకు టికెట్లిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనకు స్పందిస్తూ, విజయమ్మ ఈ ప్రతిపాదన చేశారు. అయితే, ఆమె లేఖకు టీడీపీ ప్రతిస్పందన విచిత్రంగా ఉంది. తాము బీసీలకు కేటాయించిన సీట్లలో వైఎస్‌ఆర్సీపీ కూడా బీసీ అభ్యర్థులనే రంగంలోకి దించాలని సూచిస్తూ, ‘అలా చేస్తే సరిపోతుందిగా- ఆ మాత్రానికి లేఖలు ఎందుకమ్మా?’ అంటూ టీడీపీ ప్రతినిధి వర్ల రామయ్య అనడం విడ్డూరంగా ఉంది. ‘సరేనమ్మా! మీ ప్రతిపాదనకు మేం సిద్ధం. గెలుపెవరిదో బరిలో తేల్చుకుందాం!’ అనగలిగే సత్తా లేకనే, టీడీపీ డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేసినట్లు -లేదా చేయించినట్లు- కనిపిస్తోంది.

మన రాజకీయ పక్షాలు ఇంకా బాల్యాన్ని దాటి రాలేదని టీడీపీ స్పందనతో రుజువయిపోయింది. హైస్కూల్ విద్యార్థుల మాదిరిగా, ‘మాకు తట్టని ‘అవిడియా’ మరెవరికయినా తడితే మేమెందుకు ఒప్పుకోవాలి?’ అన్నట్లు టీడీపీ ప్రవర్తించడం ఇదే మొదలు కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణతికి ఈ తీరుతెన్నులు ఏ మాత్రం మేలుచెయ్యవు. ఏ పార్టీకి చెందిన వ్యక్తులయినా, ఫలానా నియోజకవర్గాల్లో బీసీలే ప్రాతినిధ్యం వహించడం బావుంటుందన్నది విజయమ్మ లేఖ సారాంశం. అలా చెయ్యడానికి ఆమె ఒక ప్రాతిపదిక కూడా సూచించారు. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండే నియోజక వర్గాలను వదిలేస్తే, రాష్ట్రంలోని ఏ నియోజక వర్గాన్ని తీసుకున్నా అందులో పాతిక వేల మందికి పైగా బీసీ వోటర్లు ఉంటారన్న అంచనా విజయమ్మ ప్రతిపాదనకు ఆధారం. లాటరీ ప్రాతిపదికపై వంద నియోజక వర్గాలను గుర్తించి వాటిల్లో బీసీలకే అవకాశం కల్పిద్దాం రమ్మని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ప్రతిపాదించారు. ఇది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటగా తాను చేస్తున్న ప్రతిపాదన అని కూడా విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు.

ఆమె ప్రతిపాదనలో అభ్యంతరకరమయిన విషయమేమిటో మహామేధావి చంద్రబాబు నాయుడే చెప్పాలి. లేదా, ఆయన అద్దె నోర్లయినా, ఈ సూచనలో సమంజసంకానిది ఏమయినా ఉంటే ఆ ముక్క చెప్పాలి. అంతే తప్ప ఒక పార్టీ నాయకురాలు మరో పార్టీ నేతకు లేఖ రాయడం ఏదో కానిపని అన్నట్లుగానో, అది ప్రజాస్వామ్య ప్రక్రియకు పనికిరానిదన్నట్లుగానో మాట్లాడడం విచారకరం. అన్నిటికీమించి, వర్ల రామయ్య, ఆ లేఖలోని అంశాలను విజయమ్మ చదివి అర్థం చేసుకోగలగడంపై అనుమానాలు వ్యక్తం చెయ్యడం దుస్సహసం. క్షుణ్ణంగా చూడకుండానే విజయమ్మ ఆ లేఖపై సంతకం చేసినట్లుందని వంకర వ్యాఖ్యలు చెయ్యడం సహించరానిది. పెత్తందారీ పురుషస్వామ్య భావజాలానికిది నిదర్శనం. మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని కొన్ని కుసంస్కార వర్గాలు కొన్ని సామాజిక వర్గాల గురించీ, మహిళల గురించీ ఈ రీతిలో మాట్లాడడం కద్దు. అక్కడికి తామే సర్వజ్ఞులయినట్లూ, ఇతరుల మేధోసామర్ధ్యం పరిమితమయినట్లూ మాట్లాడడం ఆధిపత్య భావజాలానికి తిరుగులేని రుజువు. టీడీపీ నరనరానా పాకిపోయిన ఈ కుసంస్కారాన్నే దాపరికం లేకుండా, ఉన్నది ఉన్నట్లు వ్యక్తం చేసినందుకు మాత్రం వర్ల రామయ్యను అభినందించాల్సిందే!

గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నివారించాలనీ, పరస్పర అవగాహన ప్రాతిపదికగా అన్ని పార్టీలూ ఒక అంగీకారం కుదుర్చుకునేందుకు ప్రయత్నించాలనీ మన సమాజ నిర్మాతలు ఏనాడో సూచించారు. అయితే, అలాంటి ప్రక్రియకు ఆచరణరూపం ఇవ్వడం చాలా కష్టం. అందుకు మన వ్యవస్థలో ఉన్నత స్థాయి ప్రజాస్వామ్య సంస్కారం, సహనం అభివృద్ధి చెందివుండాలి. అసాధారణమయిన, ఒక్కొక్కప్పుడు అనూహ్యమయిన, ప్రమాణాల్లో త్యాగాలు చెయ్యడానికి అన్ని పక్షాలూ సిద్ధమయినప్పుడే అది సాధ్యం.

ఒక పార్టీ నాయకురాలు మరోపార్టీ నేతకు లేఖ రాయడాన్నే సహించలేని కుసంస్కారులు రాజనీతిజ్ఞులుగా చెలామణీ అవుతున్న వ్యవస్థలో ఇవన్నీ ఊహించగలమా? వైఎస్ విజయమ్మ అలాంటి త్యాగాల గురించి మాట్లాడనే లేదు. ఆమె ఆచరణసాధ్యమే అయిన చిన్న ప్రతిపాదన చేశారు. తద్వారా, టీడీపీలోని బీసీ నేతలకే ఎక్కువ లాభం. పోయిన ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లిస్తానని చెప్పిన చంద్రబాబు 47 సీట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్నీ, అదే సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 67 మంది బీసీ అభ్యర్థులకు సీట్లిచ్చిన సంగతినీ విజయమ్మ తన లేఖలో ప్రస్తావించారు. ఈ వాస్తవం బీసీలకు బాగా తెలిసినదే. అందుకే, బీసీ నేత కృష్ణయ్య విజయమ్మ ప్రతిపాదనను హృదయపూర్వకంగా స్వాగతించారు.

ఈ మొత్తం వ్యవహారం వల్ల ఒక్క మంచిపని జరిగింది. టీడీపీ విషయంలో ఇప్పటికీ భ్రమలతో ఉన్న బీసీలకు కనువిప్పు కలిగింది. అది త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది.
Share this article :

0 comments: