జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు మరికొందరు మంత్రులూ బలి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు మరికొందరు మంత్రులూ బలి?

జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు మరికొందరు మంత్రులూ బలి?

Written By news on Saturday, August 18, 2012 | 8/18/2012

తదుపరి టార్గెట్‌పై మంత్రుల్లో చర్చోపచర్చలు
జగన్ లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్రకు 
మరికొందరు మంత్రులూ బలికాక తప్పదనే అభిప్రాయం
సీనియర్లలో అసంతృప్తి జ్వాలలు.. 
ధర్మాన రాజీనామా ఆమోదంతో పాటు ప్రాసిక్యూషన్‌కూ గ్రీన్‌సిగ్నల్!.. 
ముఖ్యమంత్రి వైఖరితో కుంగిన ధర్మాన
లీకులిచ్చి పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారనే అనుమానాలు
బొత్సతో ప్రసాదరావు భేటీ... ధర్మానను కలిసిన చిరంజీవి, పొన్నాల, కొండ్రు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చుట్టూ సీబీఐ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆయన రాజీనామాను ఆమోదించడంతో పాటు ప్రాసిక్యూషన్‌కూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ రాసిన లేఖలపై త్వరలోనే నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. ఇదంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఢిల్లీ స్థాయిలో సాగుతున్న కుట్ర కనుక.. ధర్మానతో పాటు మరికొంతమంది మంత్రులూ బలికాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకు సాగుతున్న ఈ వ్యవహారం సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రుల్లో పెద్దయెత్తున గుబులు రేపుతుండగా మరికొందరు సీనియర్ మంత్రులు సహా అనేకమంది నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. వాన్‌పిక్ భూ కేటాయింపుల విషయంలో ధర్మానపై సీబీఐ చార్జిషీట్, ఆయన రాజీనామా, ప్రాసిక్యూషన్‌కు సీబీఐ లేఖలు... ఇలా ఒకదాని వెంబడి మరొకటిగా చోటు చేసుకున్న పరిణామాలతో వేడెక్కిన వాతావరణం శుక్రవారానికి మరింతగా రాజుకుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కేంద్రంగా మంత్రులు, సీనియర్ నేతలు సుదీర్ఘ చర్చలు సాగించారు. 

ధర్మాన ప్రసాదరావు బొత్స నివాసానికి పలుమార్లు వచ్చి సీబీఐ ఛార్జిషీట్ తదనంతర పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. ఉదయం బొత్స నివాసానికి మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి వచ్చిన ధర్మాన చాలాసేపు చర్చలు సాగించారు. మధ్యలో కొద్దిసేపు డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి కొండ్రు మురళి ఆ చర్చల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం మరోసారి ధర్మాన బొత్స నివాసానికి వచ్చారు. అంతకుముందు పలువురు మంత్రులు ధర్మానను కలసి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సమన్వయ సంఘం సభ్యులు చిరంజీవి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కొండ్రుమురళి, బస్వరాజ్ సారయ్య బీసీ సంఘం నేత ఆర్.కష్ణయ్య తదితరులు ధర్మానను ఆయన నివాసంలో కలిశారు. సీబీఐ ఛార్జిషీట్లలో పేర్కొన్న అంశాలపై బొత్స, ధర్మానలు... సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అనిల్‌చంద్ర పునీత, సుతీర్థ భట్టాచార్యలను పిలిచి మాట్లాడినట్లు సమాచారం. ధర్మానతో చిరంజీవి దాదాపు ఇరవై నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డిలు కూడా శుక్రవారం ధర్మానను కలిశారు. 

గత రెండురోజుల పరిణామాలతో శుక్రవారం ధర్మాన చాలా డీలా పడినట్లు కనిపించారని ఆయన్ను కలసిన నే తలు చెప్పారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన శాఖ పరంగా పొరపాట్లు జరిగినట్లు తేలితే దానికి సంబంధిత శాఖల అధికారులదే తప్ప తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొన్ని జీఓలు కేబినెట్‌కు తెలియకుండా జారీ అయ్యాయని, సీబీఐ ఛార్జిషీట్లో 1110, 1115, 233, 346, 270, 871 జీఓలను పేర్కొనగా వాటిపై కేబినెట్లో చర్చించాకనే నిర్ణయం తీసుకున్నామని ధర్మాన తెలిపారు. మంత్రిమండలి నిర్ణయాల తరువాత జీఓలు విడుదల చేసే బాధ్యత ప్రభుత్వ కార్యదర్శిదే తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

సీఎం తీరుతో కుంగిపోయిన ధర్మాన!: ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ధర్మాన వర్గం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన క్షణంనుంచి సంబంధిత మంత్రులు సీఎంను కలసి తమకు ఇబ్బందులు రాకుండా చూడాలని వేడుకున్నారు. న్యాయసహాయం కోసం కూడా అర్థించారు. న్యాయసహాయానికి కూడా సీఎం చాలా కాలం తటపటాయించి ఇటీవలే ఓకే చేశారు. ఛార్జిషీట్‌లో ధర్మాన పేరుండదని ముందునుంచి సీఎం భరోసా కల్పించినా చివరకు సీబీఐ తన పేరును చేర్చడంతో ధర్మాన ఒక్కసారిగా షాక్ తిన్నారని ఆయనకు అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు. సీబీఐ ఛార్జిషీట్ విషయం ఆరోజు ఉదయాన్నే సీనియర్ మంత్రి ఒకరికి తెలియగా ఆయన ధర్మానకు ఫోన్‌చేసి చెప్పారు. సీఎంను నమ్ముకుంటే ఇంతే అవుతుందనీ ఆ మంత్రి ధర్మానతో పేర్కొన్నారు. 

అయితే ఛార్జిషీట్ దాఖలైన మరునాడు, ధర్మాన రాజీనామా సమర్పించిన సందర్భంలో కూడా సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఆ మరునాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు సీఎంను కలసి రాజీనామా ఆమోదించవద్దని కోరిన సమయంలో మాత్రం తన చేతుల్లో ఏమీలేదని, అంతా అధిష్టానం చూస్తోందని, న్యాయసలహాల ప్రకారమే నడుస్తామని చెప్పడంతో ఆనేతలు అవాక్కయ్యారు. ఇది తెలిసిన ధర్మాన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతవరకు కొంత ధీమాతో ఉన్న ఆయన ఒక్కసారిగా కుంగిపోయారు. గురువారం అర్థరాత్రి వరకు ఆయన పలువురు సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆయన బొత్స నివాసానికి పలుమార్లు వెళ్లి చర్చలు సాగించారు. సీఎంను కలిసిన కొందరు నేతలు ఒక సీనియర్ మంత్రితో ఫోన్లో మాట్లాడుతూ... ‘‘సీఎం ఇంతలా వంచిస్తారని మేము అనుకోలేదు. నిన్న హామీ ఇచ్చినట్లే ఇచ్చి ఇపుడు చేతులెత్తేసినట్లుగా మాట్లాడుతున్నారు’’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు. ధర్మాన విషయంలో సీఎం మాటమారుస్తుండటంతో ఆయన వర్గానికి చెందిన జిల్లా నేతలు.. మంత్రి కొండ్రు మురళితో కలిసి మంగళవారం ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలవాలని నిర్ణయించారు. కాగా తనపై ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొన్నట్లు పత్రికల్లో వస్తున్న అభియోగాలు పెద్ద సీరియస్‌వి కావని, తనను ఇరికించేందుకు వీలుగా అందులో పెద్ద ఆరోపణలే ఉండి ఉండవచ్చని ధర్మాన భావిస్తున్నారు. ఒకవేళ ఇవి బలమైన అభియోగాలు కావని సీబీఐ భావిస్తే.. అది రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ ముఖ్యనేత ఒకరు శుక్రవారం న్యూస్‌లైన్‌తో వ్యాఖ్యానించారు. అధిష్టానం ఆదేశానుసారం నడుస్తున్న కేసు కనుకనే ఇది తప్పదన్నారు.

తదుపరి లక్ష్యం బీసీయేతర మంత్రి? 

తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్త నేతలందరూ ధర్మానకు అనుకూలంగా ఏకతాటిపైకి చేరుకుంటున్నారు. ఇప్పటికే డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా పలువురు మంత్రులు ధర్మానతో, బొత్సతో కలసి చర్చలు సాగించారు. మంత్రులు సబితారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, విశ్వరూప్, బస్వరాజ్ సారయ్య తదితరులు శుక్రవారం ధర్మానను కలసి మాట్లాడారు. జగన్ లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఆడుతున్న ఈ గేమ్‌లో తదుపరి బలయ్యే మంత్రులెవరనే దానిపైనా చర్చ సాగుతోంది. జగన్‌ను వేధించే క్రమంలో మంత్రులు, నాయకులు ఎవరు బలైనా సరే అధిష్టానం పట్టించుకొనే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం జగన్ బయటకు రాకుండా చూడడం ద్వారా పార్టీని రక్షించుకోవచ్చన్న అభిప్రాయం అధిష్టానంలో ఉందని, అందుకే ఇలా చేస్తోందని చెప్పారు. సీబీఐ అరెస్టు చేసిన మోపిదేవి వెంకటరమణ, ఛార్జిషీట్ దాఖలైన ధర్మాన ప్రసాదరావులు బీసీలు కావడం, ఆ వర్గాల్లో అసంతృప్తి రేగుతుండడంతో తదుపరి గురి హోం మంత్రి సబితారెడ్డిపై, ఆపై పొన్నాల లక్ష్మయ్యపై ఉండవచ్చని ఆ నేత విశ్లేషించారు. 

పథకం ప్రకారమే ఆ పత్రికలో కథనాలు

ధర్మానపై ఛార్జిషీట్ దాఖలుతో వివిధ పత్రికల్లో రెండు రోజులుగా వచ్చిన కథనాలు వాస్తవానికి ఆయనకు ఒకింత సానుభూతి కలిగించేవిగా వచ్చాయి. అయితే శుక్రవారం ఒక పత్రికలో ధర్మానకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పనిగట్టుకుని లీకులిచ్చి ఈ కథనాలు రాయించారన్న అనుమానాలు ధర్మానతో పాటు పలువురు మంత్రుల్లోనూ నెలకొన్నాయి. సానుభూతి లభిస్తున్న సమయంలో రాజీనామాను ఆమోదించడమో, లేదా ప్రాసిక్యూషన్‌కు అనుమతించడమో జరిగితే అది ప్రజల్లో ప్రభుత్వంపై ఒకింత వ్యతిరేకతకు దారితీస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా లీకులిచ్చి కథనాలు రాయించి ఉంటారని ధర్మాన అనుచరులు, మంత్రులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో తనకు స్థలమున్నట్లు వచ్చిన కథనం తప్పని, తాము దానికి అడ్వాన్సు చెల్లించినా అదింకా తమ పేరిట రిజిస్ట్రేషన్ కాలేదని ధర్మాన చెబుతున్నారు. ఆ విషయం ఇదివరకెప్పుడో సీబీఐకి వివరించామని, కానీ అప్పుడెప్పుడూ దానిపై రాని కథనం ఛార్జిషీట్ అనంతరం ఆ ప్రముఖ పత్రికలో వచ్చిందంటే దీని వెనుక కుట్రే ఉన్నట్లు అర్థమవుతోందని వారనుమానిస్తున్నారు. ధర్మాన తప్పు చేశాడు కనుకనే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి ఇలా పథకం ప్రకారమే కథనాలు రాయించినట్లు వారు గట్టిగా చెబుతున్నారు.

అధిష్టానానికి నివేదికలు

ఇలా ఉండగా ధర్మానపై సీబీఐ ఛార్జిషీట్, రాజీనామా తదితర సంఘటనలతో రాష్ట్రంలోని పరిణామాలపై నివేదికలు ఇవ్వాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీలను ఆదేశించారు. ఆమేరకు ఇద్దరు నేతలు శుక్రవారం వేర్వేరుగా నివేదికలు పంపారు. ధర్మాన సంబంధిత పరిణామాలు, రాజకీయంగా మారనున్న సమీకరణాలు తదితర అంశాలపై వారు అధిష్టానానికి నివేదించారు. ఈ వ్యవహారాలపై చర్చించేందుకు వారిని ఢిల్లీ రావాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. శనివారం లేదా సోమవారం బొత్స ఢిల్లీ వె ళ్లే అవకాశముంది. మరో సీనియర్ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శనివారం ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఇదిలావుండగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రతి ధర్మానకు ఇంకా అందలేదు. అది అందితేనే అందులోని విషయాలు పూర్తిగా పరిశీలించేందుకు అవకాశముంది.
Share this article :

0 comments: