వణికిస్తున్న విషజ్వరాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వణికిస్తున్న విషజ్వరాలు

వణికిస్తున్న విషజ్వరాలు

Written By news on Thursday, August 2, 2012 | 8/02/2012

డెంగీతో మూడుకు చేరిన మృతుల సంఖ్య 
మంచానపడిన 500మంది బాధితులు 
అన్నపురెడ్డిపల్లిలో భయాందోళన 
సీఎం ఆదేశించినా నామమాత్రపు చర్యలు

కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా ఏజెన్సీలోని చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిని విషజ్వరాలు వణికిస్తున్నాయి. తీవ్రజ్వరంతో పదిరోజుల్లో ఇద్దరు మృతిచెందగా.. బుధవారం మరొకరు మరణించారు. సుమారు 500 మంది పైగా మంచానపడ్డారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విషజ్వరాలపై పూర్థిసాయిలో వైద్య సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించినా చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. కేవలం నలుగురు డాక్టర్లతోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటికొక్కరు చొప్పున జ్వరపీడితులు ఉన్నారు. స్థానిక సబ్‌సెంటర్‌లో వైద్యం చేయడానికి పరికరాలు, మందులు కూడా లేవు. వారంక్రితం చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి(30), జంగాల సత్యనారాయణలు మృతిచెందారు. డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణలో మంగళవారం రోగుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసినా.. మందులు మాత్రం ఇవ్వలేదు.

ఈ క్రమంలో జ్వరంతో బాధపడుతూ కంభంపాటి నర్సయ్య (80) బుధవారం మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. మళ్లీ హడావుడిగా గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఆ పరిసరాలు పిచ్చిమొక్కలతో దుర్వాసన వెదలజల్లుతున్నా అక్కడే బెడ్స్ వేసి రోగులకు సెలేన్ ఎక్కించారు. డీఎంహెచ్‌ఓ జయకుమార్ సాయంత్రం అక్కడి పరిస్థితి గురించి శిబిరంలోని డాక్టర్లతో వాకబు చేశారు. అయితే మురికికూపంగా ఉన్న వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే ఏం ప్రయోజనమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్యం కొరవడటం, మంచినీటి కలుషితం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయని, ఇవి మాత్రం డెంగీ మరణాలు కాదని వైద్యాధికారులు కొట్టిపారేస్తున్నారు. కాగా, అన్నపురెడ్డిపల్లికి ఏడుకిలోమీటర్ల దూరంలో ఉన్న భాస్కరాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ పీరూ(60) జ్వరంతో బాధపడుతూ సత్తుపల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. ఇతని భార్య చిట్టెమ్మకూడా తీవ్రజ్వరంతో మంచానపడింది.

భయాందోళనతో ఇతర ప్రాంతాలకు పయనం..
అన్నపురెడ్డిపల్లిలో జ్వరాలు సోకినవారు పలువురు మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం, విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు వెళుతుండగా.. జ్వరం తమకూ వస్తుం దన్న ఉద్దేశంతో ఇప్పటికే మూడు వందల మంది గ్రామం విడిచి ఇతర ప్రాంతాల్లోని తమ బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు. అలాగే మంచినీరు కలుషితం కావడంతో ప్రస్తుతం గ్రామంలో నీటి సరఫరా కూడా నిలిపివేశారు. ప్రత్యేక అధికారి పట్టించుకోకపోవడంతో గ్రామంలో ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీటి కూడా సరఫరా చేయడం లేదు. జ్వరాలు ప్రబలడంతో గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే రెండు రోజుల తర్వాత గ్రామంలోని పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవు ఇచ్చే అవకాశం ఉందని డీఈఓ వెంకట్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
Share this article :

0 comments: