బాదుడుకు బ్రేక్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాదుడుకు బ్రేక్!

బాదుడుకు బ్రేక్!

Written By news on Thursday, August 9, 2012 | 8/09/2012


ఇంటాబయటా విమర్శలతో ఫీజుల భారం వాయిదా?
రూ. 31వేల రీయింబర్స్‌మెంట్ పరిమితిపై పునరాలోచనలో ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువె త్తుతున్న నిరసనలతో నష్ట నివారణపై దృష్టి
సొంత పార్టీ, ప్రతిపక్షాలతో పాటు మంత్రులూ వ్యతిరేకిస్తున్న ఫలితం
అందరికీ పూర్తిగా ఫీజులు ఇవ్వాలంటున్న బీసీ మంత్రులు
నేటి ఉపసంఘం భేటీ తర్వాతే నిర్ణయం ?

హైదరాబాద్, న్యూస్‌లైన్ :ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పరిమితులపై సర్వత్రా ఇంటా బయటా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఒకడుగు వెనక్కు తగ్గింది. సొంత పార్టీతో పాటు మంత్రివర్గ సహచరులు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు, కుల, విద్యార్థి సంఘాలు మండిపడ్డ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగింది. వృత్తి విద్యా కోర్సుల్లో బీసీ, ఈబీసీలకు కూడా యథావిధిగా మొత్తం ఫీజును రీయింబర్స్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. కాలేజీలు సహకరిస్తే భారం తగ్గుతుందని భావిస్తోంది. వాటిని నయానో భయానో ఒప్పించి ఈ ఏడాదికి గట్టెక్కని పక్షంలో ఎన్నికల తరుణంలో అభాసుపాలు కాక తప్పదని ఆందోళన చెందుతోంది. మరోవైపు కౌన్సెలింగ్‌లో జరుగుతున్న తీవ్ర జాప్యం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నింపుతోంది. ఇది అంతిమంగా తమకెక్కడచేటు చేస్తుందోనన్న భావనతో కూడా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు వేసినట్టు కనిపిస్తోంది. ఈ సమస్యపై విపక్షాలు ఆందోళనకు దిగడం, పరిష్కారం కోసం రెండు రోజులు దీక్ష చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ప్రకటించడం తెలిసిందే.

భారం తగ్గేదిలా..

కామన్ ఫీజు నేపథ్యంలో ఫీజుల పెరుగుదల వల్ల ప్రభుత్వంపై ఈ ఏడాది రూ. 486 కోట్ల భారం పడుతుందని అంచనా. కానీ ఫీజుల పెంపు ప్రతిపాదనలివ్వని 550 ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటిదాకా ఇస్తున్న రూ.31 వేల ఫీజుకే సరేననగా, ప్రతిపాదనలిచ్చిన 133 కాలేజీల్లో కూడా 100కు పైగా కాలేజీలు తమకు ఫీజును కాస్త పెంచితే చాలన్న అభిప్రాయానికి వచ్చాయి. దాంతో ఇక పడే భారం నామమాత్రంగానే ఉంటుందని, కాబట్టి ఈ ఏడాదికి ఎలాగోలా గట్టెక్కాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందరికీ ఫీజును రీయింబర్స్ చేసే యోచనకు గురువారం తుది రూపం ఇవ్వనుంది. అయితే కాలేజీలన్నీ ఏకాభిప్రాయానికి రాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయని భావిస్తున్న సర్కారు.. టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించడం ద్వారా వాటిని నయానోభయానో ఒప్పించే ప్రయత్నాల్లో పడింది. అందులో భాగంగా అంధ్రప్రదేశ్ విద్యాచట్టం (1982)లో అనుబంధ కాలేజీలు అనే పదాన్ని కూడా చేరుస్తూ చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేనున్నారు. సంబంధిత ఫైలును ఆగమేఘాలపై సిద్ధం చేసి గురువారం రాత్రికల్లా రాజ్‌భవన్‌కు పంపే పనిలో ఉన్నత విద్యాశాఖ అధికారులు తలమునకలుగా ఉన్నారు.

బీసీ మంత్రుల ఒత్తిడి..

రీయింబర్స్‌మెంట్‌పై పరిమితులు తగవంటూ బీసీ మంత్రులు కూడా సీఎంపై, మంత్రివర్గ ఉప సంఘంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ, ఈబీసీలకు రీయింబర్స్‌మెంట్‌లో కోత విధించడం సరి కాదని, పార్టీలన్నీ దీన్ని అస్త్రంగా మలచుకుంటాయని తీవ్రంగా వాదించినట్టు తెలిసింది. ‘‘ఫీజుల పెంపునకు అధికారులు సరైన ప్రాతిపదిక కూడా చూపలేకపోతున్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకునే మార్గాలు చూడాల్సింది పోయి రీయింబర్స్‌మెంట్‌లో కోత విధించడమేమిటి? కామన్ ఫీజుకు సరైన ప్రాతిపదిక వెదికితే భారం తగ్గుతుంది’’ అంటూ వారు చేసిన సూచనలు కూడా పని చేశాయంటున్నారు.

షెడ్యూలు నేటికైనా తేలేనా?

కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటనను గురువారానికి ఉపసంఘం వాయిదా వేసింది. న్యాయపరమైన లొసుగులే కారణమని మంత్రి చెప్పినా.. రీయింబర్స్‌మెంట్ పరిమితిపై పునరాలోచన, కామన్ ఫీజు తగ్గింపు దిశగా కాలేజీలతో చర్చలు సాగుతుండటమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. కాబట్టి గురువారం కూడా కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడేలా కన్పించడం లేదు. ఒకవేళ ప్రకటిస్తే శుక్రవారం నోటిఫికేషన్, 19 నుంచి సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాలేజీలన్నీ ఏకాభిప్రాయానికి రానందున ఇప్పటిదాకా అవి హామీ పత్రం కూడా ఇవ్వలేదని సమాచారం.

ఏ విద్యార్థీ నిరాశపడొద్దు: పితాని
కౌన్సెలింగ్ షెడ్యూలు సిద్ధంగా ఉందని, అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అడ్వకేట్ జనరల్‌తో చర్చించాక దాన్ని గురువారం ప్రకటిస్తామని సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఫీజుల వ్యవహారం, కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారుపై బుధవారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కామన్ ఫీజుపై పలు శాఖల కార్యదర్శుల సూచనలను కమిటీ పరిశీలించింది. న్యాయపరమైన లొసుగులపై ఏజీతో చర్చించాలని చెప్పాం. గురువారం మధ్యాహ్నానికల్లా వారి తుది పరిశీలన అవుతుంది. సాయంత్రం ఉపసంఘం మరోసారి భేటీ అవుతంది. కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ మాకు సమర్పించారు. గురువారం తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు. రూ.31 వేల దాకా మాత్రమే ఫీజును రీయింబర్స్ చేస్తామంటూ ఆగస్టు 6న చేసిన కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించగా, చర్చలింకా సాగుతున్నాయని, తుది దశకు రాలేదని పితాని బదులిచ్చారు. ‘‘రూ.31 వేలే ఇస్తామని మేం చెప్పింది ఉప సంఘం చర్చల సారాంశాన్ని మాత్రమే. పార్టీలు, సంఘాలు, మేధావులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రుల సూచనల మేరకు.. ఏ విద్యార్థీ ఫీజులపై నిరాశకు లోనవొద్దనే దిశగా చర్చించాం’’ అని వివరించారు. మొత్తం ఫీజులను రీయింబర్స్ చేయాల్సిందేనన్న ఇద్దరు మంత్రుల బహిరంగ వ్యాఖ్యలను గుర్తు చేయగా, వారేం మాట్లాడిందీ తనకు తెలియదని చెప్పారు.
Share this article :

0 comments: