రోడ్డెక్కిన పారిశ్రామికవేత్తలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోడ్డెక్కిన పారిశ్రామికవేత్తలు

రోడ్డెక్కిన పారిశ్రామికవేత్తలు

Written By news on Monday, August 20, 2012 | 8/20/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇష్టమొచ్చినట్టు విధిస్తున్న కరెంటు కోతలపై పారిశ్రామికవేత్తలు కన్నెర్ర చేశారు. ఎడాపెడా కోతలను నిరసిస్తూ రాజధానిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడకు చెందిన పలువురు యజమానులు గత రెండ్రోజులుగా శివరాంపల్లి డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తుండగా.. ఆదివారం చర్లపల్లి, కుషాయిగూడ, నాచారం పారిశ్రామిక వాడకు చెందిన పారిశ్రామికవేత్తలు స్థానిక సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్ గేటుకు తాళాలు వేసి రెండుగంటలపాటు రోడ్డుపైనే బైఠాయించారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉదయం వేళలో విద్యుత్ సరఫరా నిలిపివేయడమేమిటని అధికారులను నిలదీశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, కొత్త పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తిందని, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. సీఐఏ, సిన్మియాస్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వై.సుధాకర్‌రెడ్డి, వి.సుధాకర్, జి.ఎస్.రెడ్డి, విశ్వేశ్వర్‌రావుల ఆధ్వర్యంలో వందలాదిగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీరికి సంఘీభావంగా వైఎస్‌ఆర్‌సీపీ నేత సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సైనిక్‌పురి ఏడీఈ లక్ష్మీనారాయణ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ లేదు
కరెంటు కోతల వల్ల పరిశ్రవులు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. లైట్లను వాడుకునేందుకు కూడా కరెంటివ్వలేమని అధికారులు అంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం అదనపు విద్యుత్ కొనుగోలు చేయాలి. ఆర్-ఎల్‌ఎన్‌జీ తీసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేయాలి. వరుసగా మూడు నెలల్లో రుణం చెల్లించకపోతే బ్యాంకుల్లో దొంగల మాదిరిగా ఫోటోలు అతికిస్తామని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. చివరకు మేం దొంగలుగా సమాజంలో మిగిలిపోతున్నాం. ఇది రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి మంచి సంకేతం కాదు.
- ఏపీకే రెడ్డి, ఫ్యాప్సియా అధ్యక్షుడు
Share this article :

0 comments: