దేశాల మధ్య సీబీఐ చిచ్చు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేశాల మధ్య సీబీఐ చిచ్చు

దేశాల మధ్య సీబీఐ చిచ్చు

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012

కేబినెట్ నిర్ణయాలను సీబీఐ సమీక్షించలేదు
నిందితుల అరెస్టులో తేడాలు చూపుతోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాన్‌పిక్ ఒప్పందాన్ని అనవసరంగా వివాదాస్పదం చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య సీబీఐ చిచ్చుపెడుతోందని వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు గురువారం విచారించారు. వాన్‌పిక్ ప్రాజెక్టు అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి, రస్ అల్ ఖైమా (రాక్)కు, ఇతరులకు ఎటువంటి విభేదాలు లేవని... ఈ వ్యవహారంలో సీబీఐ తన పరిధి దాటి జోక్యం చేసుకుంటోందని ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. మంత్రి మండలి నిర్ణయాల మేరకే రాక్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాన్‌పిక్ ఒప్పందం జరిగిందని, మంత్రి మండలి నిర్ణయాలను సమీక్షించే అధికారం సీబీఐకి ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన వాణిజ్యపరమైన ఒప్పందాన్ని కూడా సీబీఐ క్విడ్‌ప్రోకోగా చిత్రీకరిస్తూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని వివరించారు. 

ఓడ రేవుల అభివృద్ధి కోసం నిమ్మగడ్డ పెట్టుబడిగా పెట్టారని, ఇందులో ప్రభుత్వానికి పైసా నష్టం లేదని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో సింగూరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మమతాబెనర్జీ ఉద్యమించి రాజకీయంగా లబ్ధిపొంది ముఖ్యమంత్రి అయ్యారని, రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలు వాన్‌పిక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేసిన భూముల్లోకి తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలు ప్రవేశించి దున్నుతున్నా రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకుండిపోయిందని తెలిపారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో ఇప్పటికే దాదాపు రూ.వేయి కోట్లు నిమ్మగడ్డ పెట్టుబడిగా పెట్టారని... ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలగాలంటే ఆర్బిట్రేషన్ చట్టాల ప్రకారం ఆయనకు రూ. ఐదువేల కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులేదని, అలాంటప్పుడు ఆ డబ్బు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. 

అరెస్టులకు ప్రాతిపదిక ఏమిటి?

జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉందని ఉమామహేశ్వర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మంత్రిని అరెస్టు చేసిందని, మరో మంత్రిని నిందితునిగా మాత్రమే పేర్కొని అరెస్టు చేయలేదని... అలాగే మరో ఉన్నతాధికారిని అరెస్టు చేసిన సీబీఐ... ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నిందితులుగా పేర్కొని అరెస్టు చేయలేదని వివరించారు. అరెస్టుల విషయంలో సీబీఐ ప్రాతిపదిక ఏంటో అర్థం కావడం లేదన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో మిగిలిన వారంతా బయటే ఉన్నారని, నిమ్మగడ్డను మాత్రం అరెస్టు చేశారన్నారు. గత నెల 20న నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని... 30న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే గత నెల 20 నుంచి సీబీఐ ఒక్కసాక్షినైనా విచారించిందా అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకే దర్యాప్తు కీలక దశలో ఉందని, సాక్షుల విచారణ కొనసాగుతోందని సీబీఐ చెబుతోందన్నారు. కేసులో నిందితులుగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్, శామ్యూల్‌ల ప్రాసిక్యూషన్‌కు ఇప్పటికీ అనుమతి లేదని.. వందలాది మంది సాక్షులుగా ఉన్న నేపథ్యంలో తుది విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని నివేదించారు. సీబీఐ వాదనలు వినేందుకు వీలుగా విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. 
Share this article :

0 comments: