మంటల మిస్టరీ వీడేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంటల మిస్టరీ వీడేనా?

మంటల మిస్టరీ వీడేనా?

Written By news on Friday, August 3, 2012 | 8/03/2012


తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనపై అనుమానాలెన్నో! 
షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశాలే లేవంటున్న నిపుణులు 
మంటలు రేగిన ఆ ఐదు నిమిషాల్లో ఏం జరిగింది? 
బ్యాటరీలు, సర్క్యూట్ బ్రేకర్లు పనిచేస్తున్నట్లు వెల్లడి 
బోగీలో మంటలు కింది నుంచి పైకి వ్యాపించిన వైనం 
బోగీ నేలపై షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేనే లేదు 
భారీ పేలుడు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు 
బోగీలోని 5, 6, 7 ‘బే’ల్లో 20 మంది ప్రయాణికుల మృతి 
మంటలు రేగటానికి పచ్చభాస్వరం ఉపయోగించారా? 
ఈ దిశగా కూడా దర్యాప్తు జరగాలంటున్న నిపుణులు 
ఓ ప్రయాణికురాలికి నెల రోజులుగా బెదిరింపు కాల్స్! 
6వ బేలో ప్రయాణిస్తున్న ఆమె కుటుంబమంతా మృతి 
ఆ ఫోన్ కాల్స్‌కు.. ఈ దుర్ఘటనకు సంబంధం ఉందా? 
మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షల మీదా సందేహాలు 
తమ వారి మృతదేహాల కోసం బంధువుల ఆవేదన

ఎస్.గోపీనాథ్‌రెడ్డి
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో శవాల మూటల మధ్య కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గౌరీశంకర్ నిర్వేదంగా నిలబడి తన కుమారుడు అవినాష్ శవాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. గుర్తు పట్టలేని నిస్సహాయ స్థితిలో కన్నీళ్లతో డీఎన్‌ఏ పరీక్షకు అంగీకార పత్రం మీద సంతకం చేశారు. చనిపోయిన వారిలో తన కుమారుడున్నాడో లేదో తెలియదు. ‘మీ అబ్బాయి చనిపోయి ఉండవచ్చు’ అన్న పోలీసుల సమాధానం నిజం కాకపోతే బాగుండు అన్న ఒక్క చిన్న ఆశతో వరంగల్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఒకవేళ తన కొడుకు చనిపోతే.. ప్రమాదంలో చనిపోయాడా? లేక విద్రోహచర్యకు బలయ్యాడా? అనే సందేహం గౌరీశంకర్‌ను తొలిచివేస్తోంది. ఇది ఒక గౌరీశంకర్ ప్రశ్న మాత్రమే కాదు. ఆ ప్రమాదంలో చనిపోయిన 32 మంది కుటుంబాలది! యావత్ దేశానిది కూడా! సంఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత కూడా ఎటూ తేల్చని రైల్వే శాఖ, పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు.. ఎప్పటికి ఒక నిర్ణయానికి వస్తారో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితి!

షార్ట్ సర్క్యూట్ కానే కాదు!

ఆ వేకువజామున అసలేం జరిగింది? తమిళనాడు ఎక్స్‌ప్రెస్ సరిగ్గా 4:18 నిమిషాలకు నెల్లూరు రైల్వేస్టేషన్ దాటి చెన్నైకి బయలుదేరింది. వేగం దాదాపు గంటకు 30 కిలోమీటర్లు. ఒక కిలోమీటర్ ప్రయాణించగానే సరిగ్గా 4:20 నిమిషాలకు ఎస్-11 బోగీలో కలకలం. మరో నిమిషంలోనే ఎవరో చెయిన్‌లాగారు. ట్రైయిన్ ఆగింది. కొద్దిసేపట్లోనే ఎస్-11 బోగీలో శవాల కుప్పలు. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో ఏ జరిగిందనే దానిపై భిన్న వాదనలు. కరెంట్ షార్ట్‌సర్క్యూట్! కాదు.. పెట్రోల్ లేదా కిరోసిన్‌తో నిప్పు! అదీ కాదు.. పేలుడు! వీటిలో ఏది వాస్తవం? ప్రత్యక్ష సాక్షులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ ఒక విషయంలో మాత్రం అందరూ ఏకీభవించారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ మాత్రం కారణం కాదని. గతంలో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో రైల్వే బోగీలు దగ్ధమైనపుడు మంటలనార్పిన బృందంలో ఉన్న ఒక సీనియర్ అధికారి విశ్లేషణ ప్రకారం.. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బోగీలో మండే స్వభావమున్న పదార్థాలు పెద్దగా ఉండవు.. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు నిమిషాల వ్యవధిలో మంటలు అంత తీవ్రంగా విస్తరించే అవకాశం ఏమాత్రం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘ముందుగా మంటలు వచ్చి ఉంటాయి. అది కూడా ఒక చోట కాకుండా రెండు మూడు చోట్ల ప్రారంభమై ఉంటాయి. ఆ తర్వాత సీట్ల కుషన్, రెక్సిన్ కాలి దట్టమైన పొగలు వచ్చి ఉంటాయి. అందుకే రెండు నిమిషాల వ్యవధిలోనే అంత భారీ నష్టం సంభవించి ఉంటుంది’ అని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, కిరోసిన్ లేదు..!

సంఘటనకు ప్రత్యక్ష సాక్షి, విశాఖపట్నానికి చెందిన రామసుధాకర్ సీట్ నంబర్ 7లో ప్రయాణించారు. మరొక సాక్షి మదన్‌లాల్ సీట్ నంబర్ 69లో ప్రయాణించారు. ఇద్దరు చెప్పిన మాట ఒక్కటే. రెండు, మూడు సార్లు శబ్దం వచ్చిందని.. తర్వాత పొగలు, మంటలు వ్యాపించాయని. ఈ ఇద్దరూ కూడా తప్పించుకునే ప్రయత్నంలో స్వల్పంగా గాయపడ్డారు. ఇక్కడ వీరు ప్రయాణించిన సీటు నంబర్లు ప్రధానం. ఇద్దరూ ఎస్-11 కోచ్‌లో మొదటి, చివరి ‘బే’ల్లో ప్రయాణించారు. అందరికందరూ చనిపోయారంటే ప్రమాద తీవ్రత 5, 6, 7 ‘బే’లలో ఎక్కువగా ఉండి ఉండాలి. చనిపోయిన ప్రయాణికుల్లో కనీసం 20 మంది బే 5, 6, 7ల్లో ప్రయాణిస్తున్నవారే. అంటే ఈ మూడు ‘బే’ల్లో ప్రయాణించిన 24 మందిలో 20 మంది చనిపోవటం అక్కడి మంటల తీవ్రతకు అద్దం పడుతోంది. ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడే ఏదో జరిగి ఉండాలి. నిజంగానే షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే మంటలు పై నుంచి కిందకు వ్యాపించాలి. కానీ.. ఎస్-11 బోగీలో మంటలు కింది నుంచి పైకి వ్యాపించాయి. బోగీ ఫ్లోర్ (నేల) పైన షార్ట్ సర్క్యూట్‌కు అసలు అవకాశమే లేదు. ఎలాంటి ఎలక్ట్రిక్ వైర్లు నేల పైన ఉండవు కాబట్టి! ఎస్-11 బోగీని పరీక్షించినప్పుడు బ్యాటరీలు పనిచేసే కండిషన్‌లోనే ఉన్నాయని, ఒకవేళ ఏదేని పరిస్థితుల్లో సాధారణంగా 110 వోల్టులు ఉండే విద్యుత్తు ప్రసరిస్తే ‘సర్క్యూట్ బ్రేకర్లు’ విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తాయని రైల్వే విద్యుత్ ఇంజనీర్లు చెప్తున్నారు. సర్క్యూట్ బ్రేకర్లు కూడా సరిగానే ఉన్నాయంటే షార్ట్ సర్క్యూట్ కారణంకాదనే నిర్ధారణకు ఫోరెన్సిక్, రైల్వే అధికారులు వచ్చారు. కిరోసిన్, పెట్రోల్ ఆనవాళ్లు లేవని కూడా నిర్ధారించారు. 
భారీ పేలుడూ కాదు..!

ఇక మిగిలింది పేలుడు..! ప్రమాద వశాత్తు కావచ్చు లేదా విద్రోహచర్యా కావచ్చు. విద్రోహ చర్యపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే తీవ్రవాద సంస్థలు ఎక్కువగా వాడే ‘ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్స్’ (ఆర్‌డీఎక్స్ లాంటివి) లేదా కెమికల్ ఎక్స్‌ప్లోజివ్స్ (అమ్మోనియం నైట్రేట్ లాంటివి) ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ఫోరెన్సిక్ వర్గాల సమాచారం. ఈ రెంటిలో ఏది వాడినా రెండింటిని కలిపి వాడినా పేలుడు తీవ్రత ఎలా ఉంటుందో మక్కామసీదు, గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లలో చూశాం. బోగీతో పాటు ప్రయాణికుల మృతదేహాలు ఛిన్నాభిన్నం అయి ఉండేవి. పేలుడు శబ్దం భారీగా ఉండేది. అలాగే బోగీ ఫ్లోర్‌లో పెద్ద రంధ్రం ఏర్పడేది. ఇవేవీ ఎస్-11 బోగీలో కనిపించలేదు. ‘బే’ 6 లోయర్‌బెర్త్ కింద స్వల్ప పేలుడు జరిగిన ఆనవాళ్లు రెండు చిన్న రంధ్రాలు కనపడ్డాయని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఈ సంఘటనలో ‘బే’ 6 మరొక రకంగా కీలకం. సంఘటనలో కుటుంబ సభ్యులతో సహా మాడిమసైన డేవిడ్‌రాజు భార్యకు నెల రోజులుగా ఒక ఆగంతకుడి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని తమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ సంఘటనలో డేవిడ్‌రాజు కూర్చున్న చోట పేలుడు ఆనవాళ్లకి, అతడి భార్యకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్‌కి ఏమైనా సంబంధముందా? ఈ దిశలో ఇప్పటివరకు విచారణ జరిగిన దాఖలాలు మాత్రం లేవు. 

పచ్చభాస్వరం వాడారా? 

స్వల్పంగా సంభవించిందని భావిస్తున్న పేలుడుపై బాంబు నిపుణుల్లో ఉత్సుకతతో కూడిన చర్చ మాత్రం జరుగుతోంది. ఎలాంటి టైమర్, బ్యాటరీ లేదా ఇతర ట్రిగ్గర్ మెకానిజం కాని లేని ‘ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్’ని వాడి ఉంటారని బాంబు నిపుణులు భావిస్తున్నారు. బహుశా సహజంగానే మండే స్వభావం ఉన్న ‘పచ్చభాస్వరం’ వాడి ఉండవచ్చని పేరు రాయటానికి ఇష్టపడని బాంబ్ డిస్పోజల్ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. భాస్వరం గాలిలో మండుతుంది. అందుకే నీటిలో నిలువచేస్తారు. నిలువ చేసిన ‘కంటెయినర్’ నుండి బొట్లుబొట్లుగా నీటిని బయటికి పంపే ఏర్పాటు చేస్తే నిర్దిష్ట సమయానికి అటూఇటుగా భాస్వరం సహజంగానే మండే ఏర్పాటు చేయవచ్చు. 

ఇక భాస్వరం మంటలు విస్తరించేందుకు తొందరగా మండే స్వభావమున్న పదార్థాలను అక్కడే ఉంచినప్పుడు మంటలు వేగంగా విస్తరించే అవకాశాలు చాలా ఉంటాయి. బెర్త్ కింద ఒక చోట కొంత ఎక్కువగా కాలిన గుర్తులు ఉన్నాయి. అలాగే సగం కాలిన బ్యాగ్ కూడా దొరికింది. ఇది కచ్చితంగా ఎవరో ఒకరు తెచ్చి ఉండాలి. ఎవరు అక్కడ పెట్టి ఉంటారనేది కనుక్కోవటం అంత కష్టం కాదని బాంబు నిర్వీర్య నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ నుంచి విజయవాడ వరకు ఆ బోగీలో ఎక్కిన దిగిన ప్రయాణికుల జాబితాను పరిశీలించి.. దిగి వెళ్లిపోయిన ప్రయాణికులు ఎవరనేది గుర్తిస్తే చిక్కుముడి వీడే అవకాశాలున్నాయని ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ ఈ దిశలో పోలీసులు ఇప్పటివరకు విచారణ చేపట్టిన సూచనలేవీ లేవు. రైల్వే విచారణకు సమాంతరంగా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. ఈ దిశలో తక్షణం చర్యలు మొదలుపెట్టాలని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. 

మసిగా మారిన మృతదేహాలను ‘గుర్తించారా?’ 

ఇక చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించటం ఒక ప్రహసనంగా మారింది. గుర్తుపట్టలేకుండా మాడిమసైన శవాల మూటల్లోంచి బంధువులు తమవారి ‘మృతదేహాలను’ గుర్తించి తీసుకెళ్లటం పోలీసు, రైల్వే అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఈ శవం మాదే’ అని బంధువులు తీసుకెళ్లిన సంఘటనలు గత మూడు రోజుల్లో కనీసం మూడు ఉన్నాయి. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పుడు నాలుగు గుర్తుపట్టని మృతదేహాలున్నాయి. అందులో ఒకటి కచ్చితంగా అవినాష్‌ది అయిఉండాలి. ఈ నాలుగింటిలో అవినాష్ తండ్రి డీఎన్‌ఏ మ్యాచ్ కాకపోతే పరిస్థితి ఏమిటి? అవినాష్ తండ్రి రైల్వేశాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాకు ఆశపడటం లేదు. తన కొడుకు మృతదేహం తనకు దక్కితే చాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. 

డీఎన్‌ఏ పరీక్షల్లో గుర్తింపు సాధ్యమేనా? 

ఇక్కడ మరొక చిక్కు ఉంది. డీఎన్‌ఏ పరీక్షలు జరిపే సామర్థ్యం హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి, అలాగే సెంటర్‌ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)కు మాత్రమే ఉంది. ఇందులో సీడీఎఫ్‌డీకి మరింత నైపుణ్యం ఉంది. కానీ ఈ స్థాయిలో మాడిమసైన, సంక్లిష్టమైన మృతదేహాల నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించటం ఈ రెండింటికీ కష్టమేనని డీఎన్‌ఏ నిపుణుల అభిప్రాయం. విజయవాడ చిన్నారి వైష్ణవి కేసులో కచ్చితమైన ఫలితాలు రాలేదు. రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన భన్వరీదేవి కేసులో కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్, సీడీఎఫ్‌డీలు చేతులెత్తేసిన తర్వాతే సీబీఐ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహా యం కోరింది. అప్పుడు కానీ ఒక నిర్ధారణకు రాలేకపోయిందని హైదరాబాద్‌కు చెం దిన ప్రముఖ డీఎన్‌ఏ నిపుణుడొకరు చెప్పారు. బంధువు నుండి ఒత్తిడి నేపథ్యంలో హడావుడిగా మృతదేహాలు అప్పగించి ఉంటే రైల్వేశాఖ ఇబ్బందుల్లో పడక తప్పదు. 

గౌరీశంకర్ ఇంకా తన బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు. ‘ఒకటి రెండు రోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ వెళ్లి ఇవ్వాలి. తర్వాత ఫలితానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అప్పటివరకు ఎదురుచూడాల్సిందే..’ గొంతు పూడుకుపోతుండగా చెప్పారు గౌరీశంకర్. ‘రాఖీకి సెలవులు లేవు. అందుకే ముందుగానే వచ్చాడు. అక్క స్వాతి కట్టిన రాఖీ, స్వీట్స్ తీసుకెళ్లాడు. మళ్లీ 11న వస్తానన్నాడు. రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడు. కనీసం అప్పటికయినా అవినాష్ అంత్యక్రియలు పూర్తిచేయగలనా..?’ అన్నది గౌరీశంకర్ ప్రశ్న. ప్రమాదమా, విద్రోహమా? మరొక ప్రశ్న.. జవాబులు దొరుకుతాయా.. రైల్వేశాఖ నివేదికల్లో మగ్గిపోతాయా!

చనిపోయింది ఎంత మంది? 

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయారనేదానిపై స్పష్టత లేదు. కొన్ని మృతదేహాల భాగాలు మాత్రమే దొరికాయి. వీటన్నింటికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తేకాని ఎంత మంది మరణించారనే దానిపై ఒక స్పష్టత రాదు. మృతుల సంఖ్యను మొదట 32గా ప్రకటించిన రైల్వే అధికారులు ఇప్పుడు 28గా మాత్రమే చూపుతున్నారు. మిగతా నాలుగు శరీర విడిభాగాల మూటలు మాత్రమే. మరి లెక్క తేలుతుందా...?

రైలు బోగీలో ‘బే’ అంటే... 

ఒక సెకండ్ క్లాస్ రైలు బోగీలో 72 సీట్లు/బెర్త్‌లు ఉంటాయి. ప్రతి వరుసలో ఒకవైపు ఆరు సీట్లు, మరొకవైపు రెండు సీట్లు ఉంటాయి. ఈ ఎనిమిది సీట్లను కలిపి ఒక ‘బే’ అంటారు. అంటే ఒక సెకండ్ క్లాస్ బోగీలో తొమ్మిది ‘బే’లు ఉంటాయి. అలాగే మొదటి ‘బే’ వైపు బోగీకి రెండువైపులా రెండు డోర్లు, చివరి బేవైపు మరొక రెండు డోర్లు ఉంటాయి. అలాగే బోగీ రెండు చివర్లలో ముందు, వెనుక బోగీలను కలుపుతూ ‘వెస్టిబ్యూల్’లు ఉంటాయి. ప్రమాదం జరిగిన ఎస్-11 బోగీలో బాగా నష్టం జరిగింది 5, 6, 7 బేలలో.
Share this article :

0 comments: